Vetrimaaran: ట్రైలర్ చూశాకే ప్రేక్షకుడు నిర్ణయించుకుంటున్నాడు..
ABN , Publish Date - May 18 , 2025 | 06:58 PM
తమిళ దర్శకుడు వెట్రిమారన్‌కు ఓ ప్రత్యేకశైలి ఉంది. హీరోని దృష్టిలో పెట్టుకుని కథను రాయడం కాకుండా కథను రాసుకుని ఆ కథకు సరిపడే హీరోని ఎంపిక చేసుకుంటారు.
తమిళ దర్శకుడు వెట్రిమారన్‌కు(Vetrimaaran) ఓ ప్రత్యేకశైలి ఉంది. హీరోని దృష్టిలో పెట్టుకుని కథను రాయడం కాకుండా కథను రాసుకుని ఆ కథకు సరిపడే హీరోని ఎంపిక చేసుకుంటారు. ఆ విషయంలో మాత్రం ఆయన తగ్గరు. చాలామంది హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాశాం అంటారు. కానీ ఆయన అలా కాదు. పైగా ఆయన చిత్రాలు నేచురల్‌గా ఉండటమే కాకుండా వాస్తవికతకు పెద్దపీట వేస్తారు. ఆయన సూర్యతో ‘వాడివాసల్’ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ మూవీ గురించి మాట్లాడారు. దర్శకుడి పేరు చూసి ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా అన్న అంశంపై ఆయన మాట్లాడుతూ ‘‘ఎప్పటి నుంచో డైరెక్టర్లకూ అభిమానులున్నారు. వారికీ ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అగ్ర దర్శకుడు, స్టార్ హీరో కలిసి చేసినా సినిమా అయినా ట్రైలర్ చూశాకే ప్రేక్షకుడు ఓ నిర్ణయానికొస్తున్నాడు. సినిమాని విడుదల రోజే చూడాలా? ఓటీటీలోకి వచ్చినప్పుడు చూడాలా? అనేది తేల్చుకుంటున్నాడు’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘సూర్యతో మీరు ప్రకటించిన సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు భారీగా ఉన్నాయి’ అని హోస్ట్ అడగగా దర్శకుడు స్పందించారు. ‘‘నేను సినిమాలు తీస్తా. 100 శాతం అంకితభావంతో పనిచేస్తా. అంతే తప్ప అంచనాలకు బాధ్యత వహించలేను. ఒకవేళ నా చిత్రాలు ఆడియన్స్ అంచనాలు అందుకుంటే ఆనందిస్తా’’ అని అన్నారు. జల్లికట్టు ఇతివృత్తంగా ‘వాడివాసల్’ తెరకెక్కనుంది. 2022లోనే ఈ సినిమా గురించి ప్రకటించారు. కథా నేపథ్యానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ లేదు. దాంతో సినిమా ఆగిపోయిందనుకున్నారు. ‘విడుదల 2’ సినిమా తర్వాత తాను తెరకెక్కించేది ‘వాడివాసల్’నే అని ఆ సమయంలోనే వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చారు.