Balakrishna: 'అఖండ -2' వాయిదా! థమన్‌కు.. కలిసొచ్చిన నిర్ణయం
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:43 PM
సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు క్షణం తీరిక లేకుండా తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒకేసారి విడుదల అవుతాయని అనుకున్న 'అఖండ -2', 'ఓజీ'లో మొదటిది వాయిదా పడటంతో థమన్ ఊపిరి పీల్చుకుంటున్నాడు.
ఇవాళ తెలుగు సినిమా రంగంలో థమన్ (Thaman) సంగీతానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. థమన్ మ్యూజిక్ ఇస్తే... సినిమా మరో స్థాయిలో ఉంటుందనే నమ్మకానికి మేకర్స్ వచ్చేశారు. తెలుగు సినీ సంగీత దర్శకులు కాస్తంత రిలాక్స్ అయిపోయారని పించినప్పుడు, నింపాదిగా సినిమాలను చేస్తున్నారనే భావన కలిగినప్పుడు మేకర్స్ కు థమన్ ఓ సరికొత్త ఆయుధంగా లభించాడు. అంతకు ముందు కొందరు సంగీత దర్శకుల దగ్గర కీ-బోర్డ్ ప్లేయర్ గా పనిచేసిన థమన్... చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తాడనే పేరుంది. దాంతో అప్పటి పేరున్న సంగీత దర్శకులను పక్కన పెట్టి చాలామంది థమన్ వెంట పడ్డారు. అయితే అడిగిన వారికి అడిగినట్టుగా థమన్ వర్క్ చేయడం మొదలు పెట్టాడు. ఫాస్ట్ గా పనిచేయడంతో పాటు... రెమ్యూనరేషన్ సైతం జన్యూన్ గా ఉండటంతో అందరూ థమన్ ను ప్రోత్సహించారు. వారందరి సహకారంతోనే థమన్ అతి త్వరగా వంద చిత్రాల మైలు రాయిని దాటేశాడు.
కొంతకాలంగా థమన్ తెలుగులో నంబర్ వన్ స్థానాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అతనికి కాపీ క్యాట్ అనే బిరుదును కొందరు తగిలించినా... థమన్ మాత్రం ఏ సినిమా విషయంలోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించలేదు. దర్శకుడి మనసెరిగి... సినిమాలకు సంగీతం అందించడమే కాదు... హీరోలను ఎలివేట్ చేసి విషయంలోనూ థమన్ ఎప్పుడూ ముందుంటాడు. అయితే అందరూ థమనే కావాలనుకోవడంతో ఈ మధ్య కాలంలో అతనిపై పని ఒత్తిడి పడుతోంది. ఇలాంటి సమయంలో థమన్ సంగీతాన్ని అందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రాలు 'ఓజీ' (OG), 'అఖండ-2 (Akhanda -2)' రెండూ కూడా దసరా కానుకగా వస్తాయనే ప్రచారం జరిగింది. కానీ 'అఖండ -2' నిర్మాతలు తమ చిత్రాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించడంతో ముందుగా రిలీఫ్ కు గురైంది థమనే అంటున్నారు. ఎందుకంటే... ఇప్పుడు తన దృష్టి అంతా థమన్ 'ఓజీ' మీదనే పెట్టే ఛాన్స్ దక్కింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు మెగాభిమానులంతా 'ఓజీ' విజయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని తన సంగీతంతో సంతృప్తిపర్చాల్సిన బాధ్యత థమన్ మీద కూడా ఉంది.
'అఖండ -2' కూడా దసరాకే ఉండి ఉంటే... థమన్ పూర్తి స్థాయిలో 'ఓజీ'కి సమయం కేటాయించలేకపోయే వాడు. సో... ఇప్పుడు ఆ భారం తొలగిపోయింది. ఇక 'అఖండ -2' డిసెంబర్ కు వచ్చినా... సంక్రాంతికి వచ్చినా... కావలసినంత సమయం ఉంటుంది కాబట్టి... బాలయ్యబాబుతో ఉన్న అనుబంధం కారణంగా ఆ సినిమాకూ థమన్ ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాడు. థమన్ కేవలం సినిమాలకు సంగీతం ఇవ్వడంతో తృప్తిపడకుండా... ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 చేస్తున్నాడు. ఈ రకంగా థమన్ నిమిషం ఖాళీ లేకుండా పనిచేస్తుండటం విశేషమే.
Also Read: Puri Jagannadh: పూరీ, ఛార్మి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్శన
Also Read: Ileana D'cruz: అది నా అదృష్టం.. త్వరలోనే మీ ముందుకు వస్తా