Nandamuri Balakrishna: చివరి పాట చిత్రీకరణలో 'అఖండ -2'
ABN, Publish Date - Sep 18 , 2025 | 01:50 PM
నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సీక్వెల్ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ఓ పార్టీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దీనితో సినిమాకు గుమ్మడి కాయ కొట్టేసినట్టేనని చిత్ర బృందం చెబుతోంది.
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సినిమా 'అఖండ 2 - తాండవం'. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ కు ఉన్న అరుదైన రికార్డుల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాగానే అంచనాలు అమాంతంగా అంబరాన్ని తాకాయి. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాను బాలకృష్ణ కుమార్తె తేజస్వినీ నందమూరి సమర్పించడం మరో హైలైట్ గా మారింది. ఇక బాలకృష్ణ సినిమా అంటేనే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్... పూనకాలు వచ్చేలా బాణీలు, నేపథ్య సంగీతం సమకూర్చుతాడు. 'అఖండ -2' కోసం తమన్ మరోసారి తనలోని మాస్ అవతార్ ను బయటకు తీశాడని అంటున్నారు. తాజాగా చిత్రీకరణ జరుగుతున్న పార్టీ సాంగ్ కూడా అలానే ఉంటుందని చెబుతున్నారు. భారీ సెట్స్ లో ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. దీనితో ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయినట్టేనని తెలుస్తోంది.
'అఖండ -2' సినిమా షూటింగ్ అనివార్య కారణాలతో కొంత ఆలస్యమైంది. అయితే... ఆ లోటును తీర్చుతూ బోయపాటి శ్రీను తనదైన శైలిలో చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా ఉరకలు వేయించాడు. బాలకృష్ణ ఇప్పటికే తన డబ్బింగ్ ను పూర్తి చేశారు. సినిమా రషెస్ చూసుకున్న నిర్మాతలు... విఎఫ్ఎక్స్ వర్క్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో దాన్ని తిరిగి చేయించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అన్ని పర్ ఫెక్ట్ గా కుదరడంతో త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాలని అనుకుంటున్నారట.
సంయుక్త హీరోయిన్ గా నటించిన 'అఖండ -2'లో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆదికి నటించిన అనుభవం ఉంది. కానీ సంయుక్త మాత్రం తొలిసారి బోయపాటి డైరెక్షన్ లో యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే బాలకృష్ణతో వాణిజ్య ప్రకటనల్లో నటించిన సంయుక్త ... హీరోయిన్ ఆయన సరసన నటించడం ఇది ఫస్ట్ టైమ్. 'అఖండ -2' సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సింది. కానీ విఎఫ్ఎక్స్ వల్ల జరిగిన జాప్యంతో ఇప్పుడు డిసెంబర్ 5కు వాయిదా పడింది. ఇప్పటి వరకూ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా... బాలకృష్ణ ఇటీవల ఈ సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వస్తుందని చెప్పడంతో నందమూరి అభిమానులంతా ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా బాలకృష్ణ 'డాకు మహరాజ్' విడుదల కాగా... ఇప్పుడు చివరి నెల మొదటి వారంలో 'అఖండ -2' విడుదల అవుతుండటం విశేషం.
Also Read: Trupti Ravindra: హీరోయిన్‌గా.. మరాఠీ స్టేజ్ ఆర్టిస్ట్
Also Read: Tollywood: అడ్వాన్సులతో.. కొడుతున్నారు