Baahubali The Epic: తుదిమెరుగుల్లో ప్రభాస్ చిత్రం...
ABN , Publish Date - Oct 02 , 2025 | 06:54 PM
'బాహుబలి: ది ఎపిక్' మూవీ అక్టోబర్ 31న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమా తుదిమెరుగులు దిద్దడం కోసం రాజమౌళి బృందం అన్నపూర్ణ స్టూడియోస్ లో కలిసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) 'బాహుబలి' (Baahubali) సినిమాలకు ఉన్న గుర్తింపు ఇంతా అంతా కాదు. అయితే అది కేవలం ప్రభాస్ ప్రతిభ అనుకోలేం. ఎందుకంటే దానికి సారధ్యం వహించి ముందుకు తీసుకెళ్ళింది శ్రీకృష్ణుడు లాంటి రాజమౌళి (Rajamouli). ఆయనకు సంపూర్ణ సహకారం అందించింది నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణులు నిద్రాహారాలు మాని పనిచేయడం వల్లే 'బాహుబలి' ఆ స్థాయి విజయాలను సాధించింది. అంతేకాదు... భారతీయ సినిమా రంగంలో 'బాహుబలి' ముందు... తర్వాత అని మాట్లాడుకునేలా చేసింది.
'బాహుబలి' కథను ఒక భాగంలో చెప్పలేని నిస్సహాయ స్థితిలో దర్శకుడు రాజమౌళి దానిని రెండు భాగాలుగా తెరకెక్కించారు. కానీ చిత్రంగా ఇప్పుడు ఆయనే 'బాహుబలి' రెండు భాగాలను కలిపి ఒక్కటి చేస్తున్నారు. అదే 'బాహుబలి: ది ఎపిక్'. కథలోని ఇంటెన్సిటీ తగ్గకుండా... అప్పుడు ఉపయోగించని మరికొన్ని సన్నివేశాలను కలిసి... దీనిని ఓ సరికొత్త సినిమాగా మలిచారు దర్శక ధీరుడు. విశేషం ఏమంటే... అక్టోబర్ 31న ఈ సినిమా విడుదల కాబోతోంది. దాంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రం బృందం మొత్తం మరోసారి ఈ సినిమాకు తుదిమెరుగులు దిద్దే పనిలో పడింది. అన్నపూర్ణ స్టూడియోస్ మెట్ల మీద రాజమౌళి అండ్ టీమ్ ఇలా ఓ గ్రూప్ ఫోటో దిగేసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో మరోసారి 'బాహుబలి' అభిమానుల్లో నూతన ఉత్తేజం మొదలైంది. 'బాహుబలి: ది ఎపిక్'ను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఆశపడుతున్నారు. సినిమాను ప్రాణంగా భావించే రాజమౌళి పని రాక్షసుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన కనుసన్నల నుండి ఓ సినిమా వస్తోందంటే ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది. అలాంటిది ఒకసారి ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న సినిమా ట్రిమ్ అయ్యి వస్తోందంటే సహజంగానే అంచనాలు అంబరాన్ని తాకుతాయి. ఇప్పుడు 'బాహుబలి: ది ఎపిక్'ది అనే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: Nandamuri Balakrishna: పట్టాలెక్కబోతున్న బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా...
Also Read: Purusha Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా.. ‘పురుష’