సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

August Tollywood Report: షరా మామూలే...

ABN, Publish Date - Sep 01 , 2025 | 05:11 PM

ఆగస్ట్ మాసం ముగిసింది. సినిమా సందడి సాగింది కానీ, విజయగీతాలు పల్లవించలేదు. స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి 22 మూవీస్ రిలీజయ్యాయి. వాటిలో అలరించినవి ఎన్ని? ఆకట్టుకోలేక పోయినవి ఎన్ని? అనేది తెలుసుకుందాం.

August Winner Coolie

ఈ యేడాది ప్రథమార్ధం అంతగా మురిపించలేక పోయింది. దాంతో ద్వితీయార్ధంపైనే సినీజనం హోప్స్ పెంచుకున్నారు. జూలై మాసం నిరాశ పరచింది. పోనీ, ఆగస్టు ఉందిలే అనుకుంటే - ఈ ఎనిమిదో నెల కూడా ఉత్సాహం నింపలేకపోయింది. ఆగస్టు నెలలో మొత్తం 22 చిత్రాలు వెలుగు చూడగా, వాటిలో 16 స్ట్రెయిట్ మూవీస్, 6 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఆగస్టు 1వ తేదీన 'ఉసురే, థ్యాంక్యూ డియర్' సినిమాలు రాగా, విజయ్ సేతుపతి, నిత్యామీనన్ నటించిన అనువాద చిత్రం 'సార్ - మేడమ్' (Sir - Madam) కూడా వెలుగు చూసింది. ఏదీ ఆకట్టుకోలేకపోయింది. తరువాతి వారం అంటే ఆగస్టు 8న సందడి బాగానే సాగింది. ఏకంగా ఆరు స్ట్రెయిట్ మూవీస్, ఒక డబ్బింగ్ సినిమా వచ్చినా ఫలితం లేకుండా పోయింది. వచ్చిన వాటిలో కన్నడ నుండి డబ్ అయిన 'సు ఫ్రమ్ సో' (Su From So) పరవాలేదనిపించింది. అయితే వసూళ్ళు రాబట్టలేకపోయింది. అదే రోజున వచ్చిన హాస్యనటుడు ప్రవీణ్ (Praveen) హీరోగా రూపొందిన 'బకాసుర రెస్టారెంట్' కూడా చతికిల బడింది.


మొదటి నుంచీ సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూసిన తేదీ ఆగస్టు 14 అనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజున రజనీకాంత్, నాగార్జున నటించిన 'కూలీ' (Coolie), యన్టీఆర్, హృతిక్ రోషన్ అభినయించిన 'వార్-2' (War -2) జనం ముందు నిలిచాయి. ఈ రెండు సినిమాలు డబ్బింగ్ పిక్చర్స్ కావడం గమనార్హం!. 'కూలీ' ఇప్పటి దాకా 500 కోట్ల దాకా పోగేసింది. కాగా, 'వార్ 2' మొదటి నుంచీ 'కూలీ' ఆధిపత్యాన్ని అధిగమించలేక పోవడం గమనార్హం! ఆ సినిమా కూడా 475 కోట్లు రాబట్టింది. అయితే 'వార్ 2' క్లియర్ డిజాస్టర్ గా నిలచిపోయింది. 'కూలీ' బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది. అందువల్ల ఆగస్టులో కొంత ఊరట కలిగించింది 'కూలీ' అనే చెప్పాలి. యన్టీఆర్ కారణంగానే 'వార్ 2' ఆ మేరకైనా వసూళ్ళు చూసిందని కొందరంటున్నారు. ఏది ఏమైనా ఊరించిన రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోవడం గమనార్హం!


ఆగస్టు ప్రథమార్ధం 'కూలీ- వార్-2' కోసం ఎదురుచూపులు, ఆ తరువాత ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాగిన తీరుపై ఆసక్తి సాగింది. ఆగస్టు 22న వచ్చిన 'మేఘాలు చెప్పిన ప్రేమకథ, పరదా', తమిళ అనువాద చిత్రం 'బన్ బట్టర్ జామ్' ఏ మాత్రం తమ ఉనికిని చాటుకోలేక పోయాయి. 27వ తేదీన వెలుగు చూసిన 'సుందరకాండ, కన్యాకుమారి' పరవాలేదనిపించు కున్నా, కలెక్షన్స్ మాత్రం చూడలేకపోయాయి. 29న నాలుగు చిత్రాలు రాగా, వాటిలో సత్యరాజ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'త్రిబాణధారి బార్పరిక్' కాసింత మెరుగు అనిపించుకున్నా, వసూళ్ళు ఏ మాత్రం పెంచుకోలేక పోయింది. 30న వెలుగు చూసిన అనువాద చిత్రం 'కొత్తలోక' కూడా అంతే సంగతులు చిత్తగించవలెను అంది. అలానే ఈ నెలలో పలువురు అగ్రనటుల పుట్టిన రోజులు ఉండటంతో వాళ్ళు నటించిన సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. అలా వచ్చిన వాటిలో మహేశ్ బాబు 'అతడు', చిరంజీవి 'స్టాలిన్', నాగార్జున 'రగడ', పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' ఉన్నాయి. అలానే ఆర్. నారాయణమూర్తి రూపొందించిన 'యూనివర్సిటీ' మూవీ కూడా రీ-రిలీజ్ అయ్యింది. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. దాంతో నిరాశ పరచిన ఆగస్టును మరచి సెప్టెంబర్ వైపు చూస్తున్నారు సినీ ఫ్యాన్స్. ఏమవుతుందో చూడాలి.

Also Read: Ustaad Bhagat Singh: ఫుల్ మీల్స్ పెట్టిన హరీష్ శంకర్.. ఏమున్నాడ్రా బాబు

Also Read: Anushka: మా ఇళ్లలో పెళ్లిలకు కూడా వెళ్లడం లేదు...

Updated Date - Sep 01 , 2025 | 05:11 PM