Sundarakanda Review: నారా రోహిత్ 'సుందరకాండ' మెప్పించిందా
ABN , Publish Date - Aug 27 , 2025 | 03:16 PM
లెక్చరర్ ని ప్రేమించిన అమ్మాయి కథతో వెంకటేశ్ హీరోగా కె. రాఘవేంద్రరావు రూపొందించిన చిత్రం ‘సుందరకాండ’. అయితే దానికి రివర్స్ లో స్టూడెంట్ ని ప్రేమించిన లెక్చరర్ కథతో తయారైన సినిమా తాజా ‘సుందరకాండ’.
సినిమా రివ్యూ: సుందరకాండ (Sundarakanda Review)
విడుదల తేది: 27-8-2025
లెక్చరర్ ని ప్రేమించిన అమ్మాయి కథతో వెంకటేశ్ హీరోగా కె. రాఘవేంద్రరావు రూపొందించిన చిత్రం ‘సుందరకాండ’. అయితే దానికి రివర్స్ లో స్టూడెంట్ ని ప్రేమించిన లెక్చరర్ కథతో తయారైన సినిమా తాజా ‘సుందరకాండ’ (sundarakanda) . హిట్టు మొహం చూసి చాలా కాలమైన నారా రోహిత్ క్రిటికల్ సబ్జెక్ట్ కి ఓటేశాడు. నైఫ్ ఎడ్జ్ లాంటి ఈ కథని ఎంతో కన్వెసింగ్ గా చెబితే తప్ప ఆడియన్స్ కి డైజెస్ట్ అవదు. మరి కొత్త దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలుగా వచ్చిన ఈ సినిమా జనాలను ఎలా ఆకట్టుకుంటుందో చూద్దాం.
కథ: (Sundarakanda Review)
సిద్థార్థ్ (నారా రోహిత్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. నలభైకి దగ్గర్లో ఉంటాడు. కానీ పెళ్లి కాదు. అమ్మాయిల్లో అతనికి నచ్చిన ఐదు గుణాలు ఉండాలని, అలా ఉన్నవాళ్లనే పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయి కూర్చుంటాడు. అలా చాలామంది అమ్మాయిలను తిరస్కరిస్తాడు. చిన్నప్పుడు స్కూల్లో తన సీనియర్ వైష్ణవి (శ్రీదేవి విజయ్‌కుమార్)లో అతను గమనించిన ఐదు క్వాలిటీస్ తనకు కాబోయే భార్యలో ఉండాలని కోరుకుంటాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగా చెప్పినా మాట కూడా వినడు. ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్తున్న సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో ఐరా (వృతి వాఘాని) సిద్థార్థ్‌కి తారసపడుతుంది. ఫస్ట్ లుక్‌లోనే ఆమెను ఇష్టపడతాడు. దాంతో అమెరికా ప్రయాణం క్యాన్సిల్ చేసి ఐరాని పెళ్లికి ఒప్పిస్తాడు. ఐరా తల్లితో పెళ్లి విషయం మాట్లాడటానికి వెళ్తే అక్కడొక ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి? చిన్నప్పుడు ఇష్టపడ్డ వైష్ణవి తారసపడటంతో ఏం జరిగింది. సిద్థార్థ్, ఐరా పెళ్లి జరిగిందా? లేదా? అన్నది కథ.
విశ్లేషణ
ఏజ్ బార్ అయిన ఓ యువకుడి ప్రేమకథ ఇది. సిద్థార్థ్ పెళ్లి చూపులు సీన్తో కథ మొదలవుతుంది. తను కోరుకున్న ఐదు గుణాల విషయంలో కాంప్రమైజ్ కాడు సిద్ధార్థ్. ఆ అయిదు గుణాలను చెప్పడానికి కాస్త సమయం తీసుకున్నాడు దర్శకుడు. ఇక చిన్నప్పటి క్లాస్మేట్ శివ (అజయ్)తో ఫైట్ సీన్ అవసరం లేదనిపించింది. ఏదో యాక్షన్ పార్ట్ ఉండాలి అన్నట్లు ఆ సీన్ ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత కథ వైజాగ్కి షిప్ట్ అవుతుంది. కథలోకి సత్య, బేబీ సునయన రావడంతో పరుగులు తీస్తుంది. అయితే కథ ఇంటర్వెల్కి చేరుకుంటున్న సమయానికి కథలో కాన్ఫ్లిక్ట్ ఏంటనేది తెలిసిపోతుంది. నెక్ట్స్ జరగబోయేది ఇదే అని అర్థమైపోతుంది. అయినా సెకెండాఫ్ ఎంగేజ్ చేసేలా ఉంటుంది. సెకెండాఫ్ ఊహకు దగ్గరగానే ఉన్నా ఏం జరగబోతోంది… దర్శకుడు ఎలా చెప్పగలడు అనే క్యూరియాసిటీని పెంచుతుంది. ఆ ఆసక్తి కలిగించడానికి దర్శకుడు హీరోహీరోయిన్ల మధ్య రాసుకున్న సంభాషణలే కారణం. దానితోపాటు సత్య పాత్ర, ఫ్రెండ్స్ మధ్య సింపుల్ వేలో ఇచ్చిన ఫన్, ఫీల్ గుడ్ సీన్స్ను దర్శకుడు పర్ఫెక్ట్ గా వర్కవుట్ చేయడంతో కాన్ఫ్లిక్ట్ ఇష్యూ పక్కకు వెళ్లిపోయింది. సిద్ధార్థ్, ఐరా, వైష్ణవి ముగ్గురు మధ్య సాగే సున్నితమైన పాయింట్ ఇది. దర్శకుడు చెప్పిన విధానంలో ఏమాత్రం తడబడ్డా సినిమా తేడా కొడుతోంది. తల్లిని ప్రేమించి పిల్లతో పెళ్ళి అనే పాయింట్ ను దర్శకుడు కన్వెన్సింగ్ చెప్పడంలో ఎక్కడా తడబాటుకు లోను కాలేదు. అక్కడే చక్కని సన్నివేశాలు, స్క్రీన్ ప్లే తో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లి దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. చివర్లో క్లాస్ పీకిన భావన కలిగినా భావోద్వేగాలు పండంచటంతో బోర్ కొట్టదు.
నటీనటుల పనితీరు..
నారా రోహిత్ యూత్ ఫుల్ సినిమా చేసి చాలా కాలమైంది. బొద్దుగా ఉన్నా ఇందులో యూత్ ఫుల్ లుక్ లో కనిపించాడు. సిద్ధార్థ్ పాత్రకు న్యాయం చేశాడు. వృతి వాఘునిది కీలకమైన పాత్రే. గ్లామర్ గా, యాక్టివ్ గా కనిపించింది. శ్రీదేవి విజయ్ కుమార్ షాకింగ్ లుక్లో కనిపించింది. టీనేజ్ అమ్మాయిగా, టీనేజ్ దాటిన అమ్మాయికి తల్లిగా రెండు వేరియేషన్స్ పర్ఫెక్ట్గా చూపించింది. ఆమె పాత్రలో నటనకు మంచి స్కోప్ ఉంది. ఇక సినిమాలో మెయిన్ ఎంటర్టైనర్ సత్య అనే చెప్పుకోవాలి. ఆద్యంతం తనదైన శైలి కామెడీతో మెప్పించాడు. భారంగా ఉన్న సన్నివేశాల్లో హాస్యం తో అలరించాడు. తనకు రాసిన ప్రతి డైలాగ్ నవ్వించింది. అతని భార్యగా బేబీ సునయన కూడా మంచి పాత్రే దక్కింది. రోహిత్ కు అక్కగా వాసుకి క్యారెక్టర్ బావుంది. ఉంది. నరేశ్, రూపాలక్ష్మీకి ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో అభినవ్ గోమటం బాగా చేశాడు. అజయ్, వీటీవీ గణేష్ చిన్న పాత్రల్లో మెరిశారు. ప్రదేశ్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఫర్వాలేదు. కొన్ని సన్నివేశాల్లో సౌండింగ్ కాస్త ఎక్కువ అనిపించింది. ‘డియర్ ఐరా’ పాట బాగుంది. మిగిలిన పాటలు బాగున్నా కథకు స్పీడ్ బ్రేక్ అనిపించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. పాయింట్లో చిన్నచిన్న లూప్ హోల్స్ ఉన్నా పాత్రలకు దర్శకుడు రాసుకున్న మాటలు ప్లస్ అయ్యాయి. కాలేజ్, సీమంతం సీన్స్ కు కాసంత కత్తెర వేసుంటే క్రిస్పీ గా ఉండేది. ఫైనల్ గా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పండుగకు చక్కని వినోదాన్ని పంచుతుంది. హిట్ కోసం చూస్తున్న హీరో నారా రోహిత్ కు కమ్ బ్యాక్ అనే చెప్పాలి. ఓ సారి ఫ్యామిలీతో చక్కగా చూసేయవచ్చు.
ట్యాగ్‌లైన్: ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్
రేటింగ్: 2.5/5