Annapurna Talli Buvvamma: డొక్కా సీతమ్మ పై మరో సినిమా
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:21 PM
అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదంటారు. అలా అన్నదానం చేసి చరిత్రలో నిలిచిపోయారు డొక్కా సీతమ్మ. ఆమె జీవితం ఆధారంగా ఇప్పుడు రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి.
నాలుగు వందల ఎకరాలు అమ్మేసి అందరికీ అన్నం పెట్టిన మహనీయురాలు డొక్కా సీతమ్మ (Dokka Seethamma). ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న బడి భోజన పథకానికి ఆమె పేరే పెట్టింది. దాంతో అందరి దృష్టీ డొక్కా సీతమ్మ ఔదార్యంపై పడింది. దాంతో ఇప్పుడు ఒకటి కాదు రెండు సినిమాలు ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నాయి.
ఇప్పటికే ఆమని (Amani) ప్రధాన పాత్రధారిణిగా ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాటలతో ప్రభావితమై ఆ సినిమాను రూపొందిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. ఈ సినిమా ద్వారా వచ్చే లాభాలను డొక్కా సీతమ్మ పథకానికి విరాళంగా ఇస్తామని తెలిపారు. 'ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ' మూవీని టి. వి. రవి నారాయణ్ దర్శకత్వంలో వల్లూరి రాంబాబు నిర్మిస్తున్నారు.
అలానే ఇప్పుడు నిర్మాతలు సిరాజ్, ఖాదర్ గోరి 'అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ' పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై చిత్ర బృందానికి షీల్డ్స్ అందించారు. సముద్ర, శివిక, కుసుమ, సుప్రియ, నవీన్ మట్టా, రోహిల్, ఆదిల్, రూపేష్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సురేశ్ లంకలపల్లి దీనికి దర్శకుడు. ఈ సినిమా ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాధికాపతి దాస్ ప్రభు, సాయి విజయేందర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఇందులో డొక్కా సీతమ్మ గా నటించడం ఆనందంగా ఉందని నటి శివిక తెలుపగా, డొక్కా సీతమ్మ భర్తగా తాను నటిస్తున్నాని దర్శకుడు వి. సముద్ర చెప్పారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు సిరాజ్, ఖాదర్ గోరి తెలిపారు.
Also Read: Pooja Hegde : పెయిడ్ ట్రోలింగ్‌పై పూజా షాకింగ్ కామెంట్స్
Also Read: War 2 - Coolie: సినీ అభిమానుల ఆవేదన