Pooja Hegde : పెయిడ్ ట్రోలింగ్‌పై పూజా షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:43 PM

సోష‌ల్ మీడియా ప్రమాదంగా మారుతోంద‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటోంది స్టార్ బ్యూటీ పూజా హెగ్డే. కొంద‌రు కావాల‌ని చేస్తున్న దుష్ప్రచారం జీవితాల‌ను నాశ‌నం చేస్తోంద‌ని ఆవేద‌న వెళ్లగక్కుతోంది. త‌న‌కు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి చెప్తూ ట్రోలర్స్ పై పై నిప్పులు చెరిగింది.

Pooja Hegde

సినీ పరిశ్రమలో నెగెటివ్ పి.ఆర్., సోషల్ మీడియా ట్రోలింగ్ కొత్తేమీ కాదు. దేశవ్యాప్తంగా స్టార్స్ ఈ పెయిడ్ ట్రోలింగ్‌కు బలైపోతున్నారు. కొందరు స్టార్స్ తమ కాంపిటీటర్స్‌ను డౌన్ చేయడానికి లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తుంటాయి. ఇప్పుడిప్పుడే కొంద‌రు స్టార్లు దీనిపై గ‌ళ‌మెత్తుతున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) గత ఏడాది తనపై జరిగిన పెయిడ్ నెగెటివ్ పి.ఆర్. గురించి ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వెళ్ళగక్కింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ డర్టీ గేమ్‌ను ఎక్స్‌పోజ్ చేస్తూ.. తనపై జరిగిన వైరల్ ట్రోలింగ్ డ్రామా గురించి సీరియ‌స్‌గా స్పందించింది.

నెగెటివ్ పి. ఆర్. క్యాంపెయిన్ తన ఫ్యామిలీని బాగా డిస్టర్బ్ చేసిందని చెప్పుకుంటూ పూజా ఆవేద‌న వ్యక్తం చేసింది. ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయినప్పుడు త‌న త‌ల్లి చాలా అప్‌సెట్ అయింద‌ని గుర్తు చేసుకుంది. తన ఎదుగుద‌ల‌ను ఓర్చుకోలేకే కొంద‌రు అలా చేస్తుంటార‌ని.. త‌న‌కు ఇలా జ‌రుగుతోందంటే త‌ను వారికంటే ఓ అడుగు ముందున్నట్టే అని చెప్పి త‌న త‌ల్లిని ఓదార్చానని చెప్పుకొచ్చింది.


సోషల్ మీడియా అంతా ఫేక్ అని, ఈ ట్రోల్స్ అంతా బోట్స్, ఫేక్ అకౌంట్స్ నుంచే జ‌రుగుతాయ‌ని జిగేల్ రాణి తెలిపింది. వాళ్ల ప్రొఫైల్స్ క్లిక్ చేస్తే ఒక్క పోస్ట్ కూడా ఉండదని.. విషపూరిత ట్రోలింగ్ వెనక ఎవరున్నారో కూడా తెలియదని ఫైర్ అయింది. వెండితెర మీద కనిపించినప్పుడు ప్రేక్షకులు చూపించే ప్రేమ, పేపర్స్ విసిరే చర్యలు నిజమైన అభిమానానికి నిదర్శనమని, ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫీలు అడిగేవారు రియల్ పీపుల్ అని త‌న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది పూజా (Pooja Hegde). ప్రెజెంట్ ఈ బ్యూటీ చేసిన ఈ కామెంట్స్ చ‌ర్చనీయాంశంగా మారాయి.

పూజా హెగ్డే తెలుగులో నితిన్ (Nithin) తో ఓ మూవీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇవే కాక కోలీవుడ్ లో రెండు ప్రాజెక్టులతో బిజీగా మారింది. బాలీవుడ్ లో సైతం కథలు వింటున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా 'కూలీ' (Coolie) నుంచి వచ్చిన మోనికా పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చిందీ పొడుగుకాళ్ళ వయ్యారి. హిట్ టాక్ విని చాలా కాలం అవుతున్న పూజాకు 'కూలీ'తో ఎలాంటి ఓదార్పు లభిస్తుందో చూడాలి.

Updated Date - Aug 12 , 2025 | 05:22 PM