Akkineni Nageswara Rao: ఐదు దశాబ్దాల అన్నపూర్ణ స్టూడియోస్
ABN, Publish Date - Aug 13 , 2025 | 03:29 PM
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు స్వప్నసౌధం ఏది అంటే 'అన్నపూర్ణ సినీ స్టూడియోస్' అనే చెప్పాలి. ఆగస్టు 13తో అన్నపూర్ణ స్టూడియోస్ కు అంకురార్పణ జరిగి యాభై ఏళ్ళు అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఆ నాటి విశేషాలను మననం చేసుకుందాం.
మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) లివ్స్ ఆన్... అవును ఏయన్నార్ సదా జీవించే ఉంటారు. అలాగే ఆయన అభినయంతో అలరించిన చిత్రాలనూ మరచిపోలేరు. ఇక ఆయన నెలకొల్పిన అన్నపూర్ణ సినీ స్టూడియోస్ (Annapurna Cine Studios) సైతం తెలుగువారి స్మృతిపథంలో సదా మెదలుతూనే ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ శంకుస్థాపన జరిగి ఆగస్టు 13తో యాభై ఏళ్ళు పూర్తవుతున్నాయి. 1975 ఆగస్టు 13వ తేదీన తన పెద్దకొడుకు అక్కినేని వెంకటనారాయణ రావు, పెద్ద మనవడు యార్లగడ్డ సుమంత్ కుమార్ చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ కు శంకుస్థాపన చేయించారు. తరువాత యుద్ధ ప్రాతిపదికన కేవలం ఐదు నెలల్లోనే రెండు ఫ్లోర్లతో అన్నపూర్ణ స్టూడియోస్ ను సినిమా షూటింగ్స్ కు అనుగుణంగా నిర్మించారు. 1976 జనవరి 14వ తేదీన సంక్రాంతి రోజున ఆ నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభం కావడం విశేషం. ఇందులోని రెండు ఫ్లోర్స్ ను నటరత్న యన్టీఆర్, నడిగర్ తిలకం శివాజీగణేశన్ ఆరంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో మొట్టమొదట షూటింగ్ జరుపుకున్న చిత్రం సురేశ్ ప్రొడక్షన్స్ డి.రామానాయుడు (D. Ramasnaidu) నిర్మించిన 'సెక్రటరీ'. ఇందులో హీరో ఏయన్నార్ హౌస్ కు సంబంధించిన సెట్ ను వేశారు. మరికొన్ని సీన్స్ ను స్టూడియో ఆవరణలో చిత్రీకరించారు. అలా అన్నపూర్ణ స్టూడియోస్ లో మొట్టమొదట షూటింగ్ జరుపుకున్న 'సెక్రటరీ' మూవీ మూడు నెలల్లో పూర్తయి 1976 ఏప్రిల్ 28న ప్రేక్షకులను పలకరించింది.
అక్కినేని ప్రేమ సామ్రాజ్యం...
అక్కినేని నాగేశ్వరరావు పెద్దగా చదువుకోక పోయినా, లోకాన్ని బాగా చదివారు. తన అభివృద్ధికి కారకులైన వారందరినీ మరచిపోయేవారు కారు. తన మాతృభాష తెలుగు- అందువల్ల తెలుగునేలపై మన చిత్రసీమ పరిఢవిల్లాలని అక్కినేని ఆశించారు. అలా మదరాసు నుండి హైదరాబాద్ మకాం మార్చిన ఏయన్నార్ అప్పట్లో ఇక్కడ ఉన్న సారథీ స్టూడియోస్, భాగ్యనగర్ స్టూడియోస్ లోనే తన సినిమాల షూటింగ్స్ జరిగేలా చూసేవారు. అయితే ఒక సందర్భంలో సారథీ స్టూడియోస్ వారితో ఏయన్నార్ కు మాట పట్టింపు వచ్చింది. దాంతో ఆ స్టూడియోస్ లో షూటింగ్స్ జరపరాదని భావించారు. అదే సమయంలో మనకంటూ ఓ సొంత స్టూడియో ఉంటే బాగుంటుందనీ ఆశించారు. ఆ తలంపు నుండి పుట్టినదే అన్నపూర్ణ స్టూడియోస్. ఏయన్నార్, ఆయన సతీమణి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం కోసం అహర్నిశలూ శ్రమించారు. స్టూడియో నిర్మాణ సమయంలో ఏయన్నార్ దగ్గరే ఉండి పనులు చూసుకొనేవారు.. మధ్యాహ్నం ఆయనకు క్యారియర్ తీసుకు వచ్చేవారు అన్నపూర్ణమ్మ. వారిద్దరికీ స్టూడియో అంటే ప్రాణం.నిజం చెప్పాలంటే స్టూడియోస్ ను వారి ప్రేమ సామ్రాజ్యంగా భావించేవారు.
ఏయన్నార్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన తరువాత అదే పేరుతో సొంతగా ఓ బ్యానర్ నెలకొల్పారు. ఆ బ్యానర్ లో కేవలం తాను హీరోగా నటించే చిత్రాలే కాకుండా ఇతర హీరోలతోనూ సినిమాలు తీయాలని సంకల్పించారు. అలా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తొలి చిత్రంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'కళ్యాణి' నిర్మించారు. మురళీమోహన్, జయసుధ జంటగా నటించిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోకపోయినా, అందులో ఏయన్నార్ అభిరుచి ఇట్టే కనిపిస్తుంది. ఈ చిత్రానికి నిర్మాతలుగా తన తనయులు వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని పేర్లు ప్రకటించారు. తరువాత చాలా రోజులు అన్నపూర్ణ బ్యానర్ నిర్మాతలుగా వారి పేర్లే కనిపించేవి. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ తో కలసి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కృష్ణంరాజు హీరోగా 'మంచిమనసు' సినిమానూ నిర్మించారు. ఇక యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన 'రామకృష్ణులు' చిత్రం కూడా జగపతి పిక్చర్స్ బ్యానర్ తో కలసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించడం విశేషం. 1978లో అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రంగా 'రామకృష్ణులు' నిలచింది.
ఎందరికో నీడనిచ్చిన అన్నపూర్ణ...
ఏయన్నార్ నెలకొల్పిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అనేక జనరంజకమైన చిత్రాలు రూపొందాయి. వాటిలో ఎవర్ గ్రీన్ మూవీ అంటే దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటసమ్రాట్ నటించిన 'ప్రేమాభిషేకం' అనే చెప్పాలి. ఈ సినిమా అప్పట్లో కోటి రూపాయలకు పైగా వసూలు చేసి ఏయన్నార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది. ఇదే బ్యానర్ పై రూపొందిన 'విక్రమ్' సినిమాతోనే నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు చిత్రసీమకు పరిచయం అయ్యారు. వారందరూ ఎంతో పేరు సంపాదించారు. ఇక ఏయన్నార్ పెద్దల్లుడు యార్లగడ్డ సురేంద్రకు చెందిన ఎస్.ఎస్. క్రియేషన్స్ తో కలసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'శివ' చిత్రం నాగార్జున కెరీర్ నే కొత్త మలుపు తిప్పింది. తెలుగు సినిమాను టెక్నికల్ గా కొత్త పంథాలో పయనించేలా చేసిందీ చిత్రం. 'శివ' సినిమా ఇప్పుడు మోడరన్ టెక్నాలజీతో రీ-రిలీజ్ కు సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ శంకుస్థాపన జరిగి యాభై ఏళ్ళయిన సందర్భంలోనే 'శివ' రీ-రిలీజ్ జరగబోవడం అక్కినేని ఫ్యాన్స్ కు అమితానందం కలిగిస్తోంది.
Also Read: War 2 Vs Coolie: బాక్సాఫీస్ వార్ నేపథ్యంలో హృతిక్ హార్ట్ టచ్చింగ్ పోస్ట్
Also Read: Param Sundari: జాన్వీ కపూర్ నోట ఐకాన్ స్టార్ మాట