War 2 Vs Coolie: బాక్సాఫీస్ వార్ నేపథ్యంలో హృతిక్ హార్ట్ టచ్చింగ్ పోస్ట్
ABN , Publish Date - Aug 13 , 2025 | 02:46 PM
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటుడిగా యాభై యేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హృతిక్ రోషన్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
'అపూర్వ రాగాంగళ్' చిత్రం ఆగస్ట్ 15వ తేదీ 1975లో విడుదలైంది. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకాంత్ ఓ చిన్న పాత్ర చేశారు. ఆ రకంగా ఆయన తొలిసారి తెర మీద కనిపించి ఈ ఆగస్ట్ 15కు యాభై యేళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్... రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. విశేషం ఏమంటే... ఆగస్ట్ 14వ తేదీ రజనీకాంత్ నటించిన 'కూలీ' మూవీతో హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతోంది.
'కూలీ', 'వార్ -2' సినిమాల బాక్సాఫీస్ వార్ కు సరిగ్గా ఒకరోజు ముందు హృతిక్ రోషన్ సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. రజనీకాంత్ నటించిన హిందీ చిత్రం 'భగవాన్ దాదా' 1986లో విడుదలైంది. దీన్ని హృతిక్ రోషన్ తాతయ్య జె. ఓంప్రకాశ్ డైరెక్ట్ చేశారు. రాకేశ్ రోషన్ ఈ సినిమాను నిర్మించడంతో పాటు రజనీకాంత్ తో కలిసి ఓ కీలక పాత్రను పోషించాడు. శ్రీదేవి, టీనా మునీమ్, డానీ ఇతర కీలక పాత్రలు చేశారు. ఇందులో గోవింద్ దాదా అనే పాత్రను బాలనటుడు హృతిక్ రోషన్ చేశాడు. ఆ నాటి సంఘటనలను హృతిక్ తాజాగా గుర్తు చేసుకుంటూ, 'మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు, రజనీకాంత్ సార్, మీరు నాకు ఎప్పుడూ ఆదర్శం అవ్వాలి, 50 సంవత్సరాల ఆన్-స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు!' అని పోస్ట్ పెట్టాడు. దీంతో హృతిక్ రోషన్ అభిమానులే కాదు రజనీకాంత్ అభిమానులు సైతం హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Thummalapalli Rama Satyanarayana: ఒకే రోజు పదిహేను సినిమాలు ప్రారంభం
Also Read: Art Mafia: అగ్గిరాజేస్తున్న టి.జి. విశ్వప్రసాద్ వ్యాఖ్యలు