Coolie and Lokah: ఫిల్మ్ మేకర్స్ తప్పు మీద తప్పు...
ABN , Publish Date - Aug 28 , 2025 | 12:15 PM
ఐమాక్స్ వర్షన్ లో విడుదల చేయకుండానే చేస్తున్నట్టుగా ప్రకటించడం నిర్మాతలకు అలవాటుగా మారిపోయింది. దీనిపై ఐమాక్స్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
సినిమా అనేది కళాత్మక వ్యాపారం. అయితే ఫిల్మ్ మేకింగ్ అనేది కోట్లతో జరిగే వ్యాపారం. అందుకే కళ నిదానంగా వెనక్కి వెళ్ళిపోయి... వ్యాపారం ముందుకొచ్చేసింది. పెట్టిన డబ్బుల్ని తిరిగి జనాల నుండి రాబట్టడం కోసం నిర్మాతలు తిమ్మిని బమ్మిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఫేక్ కలెక్షన్స్ వేసి, జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ మధ్య వచ్చిన రజనీకాంత్ (Rajinikanth) 'కూలీ' (Coolie) సినిమా విషయంలో అదే జరిగింది. ఈ మూవీ 'అంత కలెక్ట్ చేసింది, ఇంత కలెక్ట్ చేసింది...' అంటూ ఫేక్ రికార్డులు వేయడంతో ఈ సినిమాను విదేశాల్లో కొన్న పంపిణీదారులు ఇవన్నీ అబద్ధమంటూ ఓ ప్రకటన జారీ చేశారు. కలెక్షన్స్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిక కూడా చేశారు.
ఇదిలా ఉంటే 'కూలీ' సినిమా నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ... ఈ ప్రాజెక్ట్ కు హైప్ తీసుకొచ్చే క్రమంలో ఐమాక్స్ లోనూ ఇది విడుదల అవుతున్నట్టు ప్రకటించింది. తమతో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా ఐమాక్స్ వర్షన్ ఉంటుందని ఎలా ప్రకటన వేస్తారంటూ ఐమాక్స్ నిర్వాహకులు 'కూలీ' నిర్మాతకు జరిమానా విధించారని వార్తలు వచ్చాయి. అమెరికాలో ఐమాక్స్ వర్షన్ లో ఈ సినిమా చూడొచ్చని ఆశపడిన వారంతా నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు ఇదే పని మలయాళీ చిత్రం 'లోకా' (Lokah) విషయంలోనూ మేకర్స్ చేశారు. ఈ సినిమాను ఐమాక్స్ లో చూడొచ్చంటూ ప్రకటన జారీ చేశారు. లేడీ సూపర్ హీరో మూవీగా రూపుదిద్దుకున్న 'లోకా' మలయాళంలో గురువారం, ఓనమ్ కానుకగా విడుదల అయ్యింది. తెలుగులో దీనిని శుక్రవారం విడుదల చేస్తున్నారు.
చిత్రం ఏమంటే... ఈ సినిమా తెలుగు వర్షన్ మీద మలయాళ మేకర్స్ అసలు దృష్టే పెట్టలేదు. దాంతో సినిమా తెలుగు టైటిల్ కూడా 'కొత్త లోక' బదులు చాలా వరకూ ప్రకటనల్లో 'కొత లోక'గా వచ్చింది. వివిధ దిన పత్రికలలో పదే పదే ఇలానే ప్రకటనలు రావడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి ప్రచారమూ చేయకుండానే తెలుగులో 'కొత్త లోక' మూవీని జనం ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న సూర్యదేవర నాగవంశీ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్థ పెట్టడం లేదు. నిజానికి ఇందులో నాయికగా నటించిన కళ్యాణీ ప్రియదర్శన్ (Kalyani Priyadarsan) ఇప్పటికే కొన్ని తెలుగు స్ట్రయిట్ మూవీస్ లో నటించింది. అలానే ఇందులో హీరోగా నటించిన నస్లీన్ మలయాళ చిత్రం 'ప్రేమలు' డబ్బింగ్ వర్షన్ తో తెలుగు వారికీ సుపరిచితుడే. అయినా కూడా 'కొత్త లోక' మూవీని ఎలాంటి హడావుడి లేకుండా జనం ముందుకు నిర్మాతలు తీసుకొస్తున్నారు. దీనిని డామ్నిక్ అరుణ్ డైరెక్ట్ చేశారు.
Also Read: Manushulu Mamathalu: జయలలిత తొలి తెలుగు సినిమాకు 'ఎ' సర్టిఫికెట్...
Also Read: Rajamouli: 'బాహుబలి ది ఎపిక్'కు కొత్త నిర్వచనం...