Vijay Antony: ఏమి రా బాలరాజు దీనివల్ల ఉపయోగం...

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:04 PM

విజయ్ ఆంటోని తన మేనల్లుడుతో నిర్మిస్తున్న సినిమాకు 'పూకి' అనే పేరు పెట్టారు. అయితే తెలుగులో ఈ టైటిల్ పై విమర్శలు రావడంతో దాని పేరును 'బూకి' అని మార్చారు.

Vijay Antony Bookie movie

తమిళ సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని (Vijay Antony) అంటే తెలుగువారికి ఎంతో ప్రేమ. అతను నటించిన తొలి చిత్రం 'నకిలి' (Nakili) నుండి నిన్నటి 'మార్గన్' (Margan) వరకూ దాదాపు ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతూనే ఉంది. తమిళనాడులో పెద్దంత ఆదరణకు నోచుకోని సినిమాలను కూడా తెలుగువారు ఆదరించారు. 'బిచ్చగాడు' (Bichchagadu) తర్వాత అతనికి తెలుగులో స్టార్ స్టేటస్ ను కట్టబెట్టారు. ఆ పైన వచ్చిన సినిమా మళ్ళీ 'బిచ్చగాడు' స్థాయిలో ఆడకపోయినా... విజయ్ ఆంటోని కంటూ తెలుగులో ఓ పెద్ద మార్కెట్టే ఏర్పడింది. దాంతో తన డబ్బింగ్ సినిమాల ప్రమోషన్ ను కూడా స్ట్రయిట్ సినిమాల మాదిరిగా చేస్తూ వచ్చాడు విజయ్ ఆంటోని. ఎందుకంటే... తను హీరోగా నటించిన చాలా సినిమాకు అతనే నిర్మాత కూడా. ఆ మధ్య విజయ్ ఆంటోని కుమార్తె చనిపోతే... చలించని తెలుగువాడు లేడు! అంతగా విజయ్ ఆంటోని ని మనవాళ్ళు సొంతం చేసుకున్నారు.


ఈ మధ్య కాలంలో విజయ్ ఆంటోని నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడటంతో లేదు. ఆ మధ్య వచ్చిన 'మార్గన్' సినిమా బాగుందనే టాక్ వచ్చినా... థియేటర్లలో పెద్దంత సందడి చేయలేదు. ఆ సినిమాతో విజయ ఆంటోని మేనల్లుడు అజయ్ దిశాన్ వెండితెరకు పరిచయం అయ్యాడు. నటుడిగా అతనికీ మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఇప్పుడు అజయ్ దిశాన్ ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్ ఆంటోనీ ఓ సినిమాను మొదలు పెట్టాడు. దాని పేరు 'పూకి' (Pookie). ట్రెండీ గా ఉండాలని ఈ టైటిల్ పెట్టామని, దాని అర్థం ఫ్రెండ్ అని చెబుతున్నారు.. సంతోషం.. అయితే అదే టైటిల్ లోగోనూ తెలుగులోనూ రాయించి, సోషల్ మీడియాలో పోస్టర్స్ పోస్ట్ చేశారు. ఆ టైటిల్ చూసి తెలుగు భాషాభిమానులు గగ్గోలు పెట్టారు. సిగ్గూ శరం లేకుండా 'పూకి' అనే టైటిల్ తెలుగులో ఎలా పెడతారు? అని విమర్శాస్త్రాలు సంధించారు. ఆ సెగ విజయ్ ఆంటోనికి తాకినట్టుంది. దాంతో విజయ్ ఆంటోని సినిమాల ఆస్థాన రచయిత అయిన భాష్యశ్రీ ఈ టైటిల్ కేవలం తమిళ సినిమా వరకే పరిమితమని, తెలుగులో వేరే టైటిల్ పెట్టబోతున్నారని వివరణ ఇచ్చాడు.


పబ్లిసిటీ కోసం ఇలా... 'భద్రకాళి' కోసం అలా...

సహజంగా విజయ్ ఆంటోని తన తమిళ చిత్రాలను తెలుగులో డబ్ చేసినప్పుడు వీలైనంత వరకూ వేరు పేరును పెడుతుంటారు. అయితే తమిళ, తెలుగు భాషల్లో తీస్తున్న 'పూకి'కి మాత్రం రెండు చోట్ల ఆయన అదే పేరు పెట్టాలనుకున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే ఆ టైటిల్ పై విమర్శలు మొదలయ్యాయో... విజయ్ ఆంటోనీ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టాడు. ఠక్కున అది కేవలం తమిళ వర్షన్ కు మాత్రమే అని మీడియాకు వివరణ ఇప్పించాడు. అదే నిజమైతే... తెలుగు పేరు పెట్టకుండా... తెలుగు భాషలో ఆ పోస్టర్ రిలీజ్ చేయాల్సిన అవసరం విజయ్ ఆంటోనికి ఏముంది? అని కొందరి ప్రశ్నిస్తున్నారు. ఇదంతా సినిమాకు పబ్లిసిటీ రావడం కోసం చేసిన చీప్ స్టంట్ అని కొందరు తేల్చి చెప్పారు. తాజాగా ఇప్పుడీ సినిమాకు తెలుగులో 'బూకి' (Bookie) అనే పేరు పెట్టినట్టు ఓ ప్రకటన వచ్చింది. దీనిని కూడా జనాలు తప్పు పడుతున్నారు. విజయ్ ఆంటోని అసలు ఈ టైటిల్ ద్వారా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయనకైనా అర్థమౌతోందా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక తప్పును కవర్ చేసుకోవడానికి తప్పు మీద తప్పు ఎందుకు చేస్తున్నాడని అడుతున్నారు. ఇంతకూ తాజాగా తెలుగు వర్షన్ కు పెట్టిన 'బూకి' పదానికి అంటే అర్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలుగులో 'బుకీ' అనే పదం వాడుకలో ఉంది. అది కూడా తెలుగు పదం కాదు. కొన్ని వ్యాపారాలకు మధ్యవర్తులుగా వ్యహరించేవారిని 'బుకీస్' అని పిలుస్తుంటారు. ఆ టైటిల్ కు ఈ సినిమాకు అసలు ఏమైనా సంబంధం ఉందా? అని వీరు అడుతున్నారు. పూరి జగన్నాథ్‌ డైరెక్ట్ చేసిన ఓ సినిమాలో 'ఏమిరా బాలరాజు నీవల్ల ఉపయోగం' అనే డైలాగ్ ఉంటుంది. విజయ్ ఆంటోని చర్యలు చూసి... అదే మాటను జనాలను అనుకుంటున్నారు.

ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. విజయ్ ఆంటోని నటించిన 25వ చిత్రం 'భద్రకాళి' (Bhadrakaali) ఈ నెల 19న తమిళ, తెలుగు భాషల్లో రాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్స్ కు విజయ్ ఆంటోని హైదరాబాద్ కు వస్తారు. అప్పుడు మీడియా 'పూకి' టైటిల్ విషయంలో ఆయనతో వాదనకు దిగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో హఠాత్తుగా 'బూకి'గా పేరు మార్చి ఉంటారని కొందరంటున్నారు. చిత్రం ఏమంటే... 'పూకి' టైటిల్ పోస్టర్ ను వారం క్రితం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విజయ్ ఆంటోని... తాజా టైటిల్ 'బూకి'ని మాత్రం పోస్ట్ చేయలేదు. బహుశా దీనికి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలని ఆయన అనుకుంటున్నాడేమో! ఏదేమైనా... ఈ మధ్య కాలంలో అత్యంత వివాదాస్పదమైన టైటిల్ పెట్టిన ఘనత మాత్రం విజయ్ ఆంటోనీకే దక్కుతుంది.

Also Read: Sunday Tv Movies: ఆదివారం, Sep 07.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Also Read: Teja Sajja: ‘హనుమాన్‌’ విడుదలకు ఆరు నెలల ముందే.. స్టెప్‌ వేశా...

Updated Date - Sep 07 , 2025 | 01:17 PM

VIjay Antony: అమ్మాయిలని ఎలా హ్యాండిల్ చెయ్యాలో 'లవ్ గురు' చూసి తెలుసుకోండి:

Pookie: ఇదేం.. టైటిల్‌రా నాయ‌నా! ఈ చండాలమేంది.. విజ‌య్ అంటోనీ

VIjay Antony: నా సినిమాని మరో 'అన్బే శివం' చేయొద్దు, 'ఎక్స్' లో పోస్ట్ వైరల్

Vijay Antony : ‘బిచ్చగాడు 2’ షూటింగ్‌లో ప్రమాదం.. విజయ్‌కి గాయాలు

Vijay Anthony: ‘బిచ్చగాడు 2’ తర్వాత పవర్‌ఫుల్‌ టైటిల్‌తో..