సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rajnikanth: రజనీ తొలి సినిమా 'అపూర్వ రాగంగళ్'కు 50 ఏళ్ళు...

ABN, Publish Date - Aug 15 , 2025 | 07:24 PM

రజనీకాంత్ (Rajnikanth)- ఈ పేరే తమిళనాట ఓ సమ్మోహనం. అంతలా అలరించే రజనీకాంత్ ఆగస్టు 15తో నటునిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.

రజనీకాంత్ (Rajnikanth)- ఈ పేరే తమిళనాట ఓ సమ్మోహనం. అంతలా అలరించే రజనీకాంత్ ఆగస్టు 15తో నటునిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయన తెరపై తళుక్కుమన్న తొలి చిత్రం కె.బాలచందర్ రూపొందించిన 'అపూర్వ రాగంగళ్' (Apoorva Ragangal) 1975 ఆగస్టు 15న విడుదలయింది. ఆ చిత్రంలో రజనీకాంత్ సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందులో శ్రీవిద్య భర్తగా, జయసుధ తండ్రిగా రజనీకాంత్ కనిపించారు. తొలి చిత్రంలోనే మిడిల్ ఏజ్డ్ రోల్ లో కనిపించిన రజనీకాంత్ ఆ పై తన దరికి చేరిన ప్రాతలకు న్యాయం చేస్తూ సాగారు.

రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్ (Sivaji Rao Gaikwad). బెంగళూరులో జన్మించిన శివాజీరావ్ మాతృభాష మరాఠీ. ఇంట్లో మరాఠీ మాట్లాడేవారు. బెంగళూరులో ఉండడం వల్ల కన్నడ, తెలుగు, తమిళ భాషల్లోనూ ప్రావీణ్యం సంపాదించారు. కండక్టర్ గా జీవితం ఆరంభించిన శివాజీ రావ్ కు సినిమాలంటే పిచ్చి. తెలుగులో యన్టీఆర్, కన్నడలో రాజ్ కుమార్, తమిళంలో ఎమ్జీఆర్, హిందీలో శత్రుఘ్న సిన్హా ఆయనకు అభిమాన నటులు. వారి స్టైల్స్ ను అనుసరిస్తూ నాటకాలు వేసేవారు. మిత్రుల సలహాతో శివాజీరావ్ మదరాసు చేరి నటనలో శిక్షణ తీసుకున్నారు. అడయార్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో శివాజీ రావ్ ట్రైనింగ్ పీరియడ్ లోనే ఓ సారి కె.బాలచందర్ (K.Balachandar) ఆయనను చూడటం జరిగింది. శివాజీ రావ్ కళ్ళలోని స్పార్క్ గమనించిన బాలచందర్ ఇతను తప్పకుండా మంచి నటుడవుతాడని భావించారు. అలా తన 'అపూర్వ రాగంగళ్'లో తొలి అవకాశం కల్పించారు. అప్పుడే శివాజీ రావ్ ను కాస్తా రజనీకాంత్ గా మార్చారు బాలచందర్. రజనీకాంత్ తెలుగులో తొలిసారి నటించిన చిత్రం కూడా కె.బాలచందర్ రూపొందించిన 'అంతులేని కథ' (Anthuleni Katha). కన్నడలోనూ కొన్ని సినిమాల్లో నటించారు రజనీకాంత్. తెలుగులో మురళీమోహన్ హీరోగా రూపొందిన 'తొలిరేయి గడిచింది', 'ఆమెకథ' చిత్రాల్లో విలన్ గా నటించారు రజనీ. ఇక 'చిలకమ్మ చెప్పింది'లో సంగీతకు జోడీగా కనిపించారు. కన్నడలో రజనీకాంత్, విష్ణువర్ధన్ హీరోలుగా రూపొందిన 'సహోదరర సవాల్'ను తెలుగులో 'అన్నదమ్ముల సవాల్'గా రీమేక్ చేశారు. అందులో కృష్ణకు అన్నగా రజనీకాంత్ నటించారు. ఈ సినిమాతో తెలుగునాట మంచి క్రేజ్ సంపాదించారు రజనీ. తమిళంతో పాటు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నసమయంలోనే 'భైరవి' (Bhairavi)తో హీరోగా తొలి సక్సెస్ చూశారు రజనీకాంత్. ఆ తరువాత తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రజనీ.

రజనీకాంత్ కు కమల్ హాసన్ (Kamal Haasan) మంచిమిత్రుడు. తొలి చిత్రం'అపూర్వ రాగంగళ్'లోనూ, తొలి తెలుగు సినిమా 'అంతులేని కథ'లోనూ కమల్ తో కలసి నటించారు రజనీ. శ్రీధర్ రూపొందించిన 'వయసు పిలిచింది'లోనూ రజనీ, కమల్ కలసి నటించారు. వారిద్దరూ నటించిన 'అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఎత్తుకు పైఎత్తు, అందమైన అనుభవం' వంటి సినిమాలు సైతం అనువాద రూపంలో తెలుగువారిని ఆకట్టుకున్నాయి. రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న రజనీ, కమల్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం పోటీదారులు. ఎమ్జీఆర్, శివాజీగణేశన్ తరువాత తమిళనాట పోటాపోటీగా సాగిన జోడీ కమల్ హాసన్, రజనీకాంత్ అనే చెప్పాలి. కమల్ హాసన్ ప్రయోగాలతో సాగుతూ, కమర్షియల్ మూవీస్ కు దూరమైపోతున్న సమయంలో రజనీకాంత్ మాస్ మసాలా సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు. Super Star అన్నది ఇంటిపేరుగా మార్చుకున్నారు.


రజనీకాంత్ నటించిన "బాషా, ముత్తు, నరసింహ, అరుణాచలం, చంద్రముఖి, శివాజీ, రోబో" వంటి చిత్రాలు తెలుగునాట కూడా విశేషాదరణ చూరగొన్నాయి. వీటిలో కొన్ని తెలుగు స్టార్స్ మూవీస్ కే పోటీనివ్వడం గమనార్హం. తెలుగులో యన్టీఆర్ తో కలసి 'టైగర్' సినిమాలో నటించారు రజనీకాంత్. ఆ తరువాత తమిళనాట సూపర్ స్టార్ గా సాగుతున్నా, 'జీవనపోరాటం'లో శోభన్ బాబు తమ్ముని పాత్రలో అభినయించారు. తెలుగు నిర్మాత ఎ.పూర్ణచంద్రరావు నిర్మించిన 'అంధా కానూన్'తో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన రజనీకాంత్ అక్కడ కూడా తన స్టైల్స్ తో ఆకట్టుకున్నారు.

చాలా ఏళ్ళ తరువాత 'జైలర్'తో మంచి విజయాన్ని అందుకున్నారు రజనీకాంత్. తరువాత వచ్చిన 'లాల్ సలామ్, వేట్టైయాన్' సినిమాలు అంతగా అలరించలేదు. తన నటజీవిత స్వర్ణోత్సవ సందర్భంగా ఆగస్టు 14న విడుదల చేసిన 'కూలీ' డివైడ్ టాక్ తో నడుస్తోంది. వచ్చే యేడాది 'జైలర్ 2'తో జనం ముందుకు రానున్నారు రజనీకాంత్. 74 ఏళ్ళ వయసులోనూ ఇంకా ఉత్సాహంగా నటిస్తోన్న రజనీకాంత్ రాబోయే రోజుల్లో ఏ తీరున మురిపిస్తారో చూడాలి.

ALSO READ: Kasthuri Shankar: బీజేపీలో చేరిన కాంట్రవర్సీ క్వీన్

Rashmika: రశ్మిక మూవీలో నోరా, మలైకా

Sir Madam - ott: 'సార్‌ మేడమ్‌’.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

Tollywood Heroes: బాలీవుడ్ డైరెక్టర్స్ ను నమ్మడమే వీరు చేసిన తప్పా

Updated Date - Aug 15 , 2025 | 08:23 PM