సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pawan Kalyan: ఊపు తగ్గిన 'ఓజీ'.. కార‌ణం అవేనా?

ABN, Publish Date - Oct 03 , 2025 | 05:51 PM

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే 'ఓజీ' మూవీ బిగ్గెస్ట్ గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అయితే... ఈ సినిమా కలెక్షన్స్ పై టిక్కెట్ రేట్ల పెంపు, 'ఎ' సర్టిఫికెట్ ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Pawan Kalyan OG Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య (DVV Danayya) నిర్మించిన 'ఓజీ' (OG) మూవీ సెప్టెంబర్ 25న జనం ముందు నిలచింది. ఈ సినిమా మొదటివారం 300 కోట్లకు పైగా పోగేసిందని తెలుస్తోంది. పైగా మొదటి రోజునే ఈ చిత్రం 154 కోట్ల గ్రాస్ వసూలు చేసి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నంబర్ వన్ గా నిలచింది. అంతా బాగానే ఉంది. కానీ, ఈ సినిమా కొనుగోలుదారులకు నష్టాలు వాటిల్లచేయనుందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. నైజామ్, గుంటూరు, ఓవర్సీస్ మినహా మిగిలిన ఏరియాల్లో 'ఓజీ' ద్వారా బయ్యర్స్ నష్టాలు చవిచూడనున్నారని టాక్! ఇంతకు ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'తో పోలిస్తే 'ఓజీ'కి మొదటి నుంచీ పాజిటివ్ టాక్ ఉంది. అయితే ఈ సినిమా టిక్కెట్ రేట్స్ భారీగా పెంచడం ద్వారా రెండో రోజు నుంచీ వసూళ్ళలో తేడా కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు, ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా పవన్ సినిమాలను పదే పదే చూసే టీనేజ్ ఆడియెన్స్ రాలేక పోయారనీ చెబుతున్నారు.


'అత్తారింటికి దారేది' తరువాత వచ్చిన పవన్ చిత్రాలేవీ ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఆ రేంజ్ సక్సెస్ ను 'ఓజీ' అందిస్తుందని ఫ్యాన్స్ మొదటి నుంచీ ఆశిస్తూ వచ్చారు. దర్శకుడు సుజిత్ సైతం ఫ్యాన్స్ ను ఆకట్టుకొనేలా 'ఓజీ'ని తెరకెక్కించారు. సినిమా రిలీజైన దగ్గర నుంచీ ఇది ఫ్యాన్స్ ను ఆకట్టుకొనే చిత్రం అంటూ ప్రచారం సాగుతోంది. అయితే పవన్ ను ఎంతగానో అభిమానించే టీనేజ్ పిల్లలకు 'ఏ' సర్టిఫికెట్ కారణంగా ఈ సినిమా థియేటర్స్ లో చూసే వీలు కలగలేదు. అందువల్లే రిపీట్ ఆడియెన్స్ 'ఓజీ'కి రావడం లేదని తెలుస్తోంది. పైగా మాస్ హీరోస్ సినిమాల్లో ఆడియో అదరహో అనే స్థాయిలో ఉండాలి. 'ఓజీ'లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించిన థమన్, పాటల్లో ఆ స్థాయి చూపించలేక పోయారనీ కొందరు అంటున్నారు.


ఇక అసలు విషయానికి వస్తే 'ఓజీ' దసరా బరిలో దూకిన ఏకైక స్ట్రెయిట్ తెలుగు మూవీ. దసరాకు ఓ వారం ముందుగానే సోలోగా జనం ముందు నిలచింది 'ఓజీ'. ఆ కారణంగానే ఈ మాత్రం వసూళ్ళు లభించాయని అంటున్నారు. నైజామ్, గుంటూరు, ఓవర్సీస్ మినహాయిస్తే మిగిలిన ఏరియాల్లో 'ఓజీ' ద్వారా 15 నుండి 25 శాతం నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా టిక్కెట్ రేట్స్ తగ్గిన తరువాత పికప్ అవుతుందని ఆశించారు. అయితే అక్టోబర్ 2న వచ్చిన కన్నడ డబ్బింగ్ మూవీ' కాంతార చాప్టర్ 1'కు తెలుగునాట కూడా విశేషాదరణ లభిస్తూ ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో 'ఓజీ' ఊహించిన నష్టాన్ని ఏ మేరకు తగ్గిస్తుందో చూడాలి.

Also Read: Akhanda -2: బాలకృష్ణపై పథకం ప్రకారం ట్రోలింగ్...

Also Read: NR Anuradha Devi: మళ్ళీ చిత్ర నిర్మాణంలోకి అనూరాధా దేవి

Updated Date - Oct 03 , 2025 | 08:01 PM