సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: మన స్టార్స్ అలా చేయరెందుకు...

ABN, Publish Date - May 28 , 2025 | 01:03 PM

ఏడు పదుల వయసులోనూ మలయాళ సీనియర్ స్టార్ హీరోలు ఏడాది మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. ప్రేమ్ నజీర్ లాంటి హీరో అయితే ఏకంగా ఏడువందల చిత్రాలలో నటించారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఏ చిత్రసీమైనా పచ్చగా ఉండాలంటే స్టార్ హీరోస్ సందడి సాగుతూ ఉండాలి... టాలీవుడ్ లో స్టార్ మూవీస్ సందడి తగినంతగా లేదు... అందువల్లే పరిస్థితి థియేటర్ల బంద్ దాకా సాగింది... బంద్ ఆగింది... కానీ, సందడి సాగడం మొదలు కావాలి... ఈ విషయంలో మలయాళ స్టార్స్ ను స్ఫూర్తి తీసుకోవాలని సినీజనం ఆశిస్తున్నారు.

మన స్టార్ హీరోస్ (Star Heroies) ఒక్కొక్కరు ఏడాదికి ఒక సినిమాకు మించి చేయడం లేదు - చాలా రోజులుగా ఇదే అభిమానుల ఆవేదన! అయితే ఫ్యాన్స్ కూడా తమ ఫేవరెట్ హీరోల తీరుకు అలవాటు పడిపోయారు... స్టార్స్ ఏ రోజున సినిమా రిలీజ్ చేస్తే అప్పుడే చూద్దామన్న భావనకు అభిమానులు వచ్చేశారు... మధ్య మధ్యలో తమ ఫేవరెట్ హీరో పాత సినిమా ఏదైనా వస్తే దానినే చూస్తూ ఆనందిస్తున్నారు... అయితే టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోస్ పయనం కారణంగా చిత్రసీమ సంక్షోభానికి గురయింది... పెద్ద హీరోల సినిమాలు లేక వేలాది థియేటర్లు వెలవెల బోతున్నాయి.. ఇప్పటికే ఎన్నో సింగిల్ థియేటర్స్ గోడౌన్స్ గానో, ఫంక్షన్ హాల్స్ గానో మారాయి... ఈ నేపథ్యంలోనే మొన్న ఎగ్జిబిటర్స్ సినిమా హాళ్ళ బంద్ కు పిలుపు నిచ్చారు... తరువాత జరిగిన తెలుగు సినిమా ఛాంబర్ త్రీ సెక్టార్స్ సమావేశంలో బంద్ లేకుండా చేశారు... అయినా బిగ్ హీరోస్ ఏడాదికి ఒక్కొక్కరు రెండు మూడు సినిమాల్లో అయినా నటించక పోతే సంక్షోభం పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు... ఈ నేపథ్యంలోనే మళ్ళీ పాత రోజుల్లోలాగా పర్సంటేజ్ సిస్టమ్ రావాలని కొన్ని థియేటర్ల వారు కోరుతున్నారు...


పేరున్న హీరోలు ఎక్కువ సినిమాల్లో నటించినప్పుడే చిత్రసీమ కళకళ లాడుతుందని నటరత్న యన్టీఆర్ (NTR), నటసమ్రాట్ ఏయన్నార్ (ANR) ఏనాడో పాటించి చూపించారు... ఆ తరువాతి తరం హీరోలు కూడా అదే తీరున సాగి, స్టార్ డమ్ ఉన్నన్ని రోజులు ఏడాదికి సగటున ఆరేడు సినిమాల్లో నటించారు... పరిశ్రమకు కళ తీసుకు వచ్చారు... కానీ, ఈ తరం హీరోలు ఏడాదికో, లేక రెండు మూడేళ్ళకో ఒక సినిమాచేస్తూ సాగుతున్నారు... దాంతో థియేటర్స్ ఫీడింగ్ కష్టతరమై పోయింది... పోనీ, గతంలో లాగా స్టార్ హీరోస్ మూవీస్ రిపీట్ రన్స్ లో ఆడేద్దామంటే అవన్నీ యూ ట్యూబ్ లోనూ, ఓటీటీల్లోనూ చిందేస్తున్నాయి... మరి థియేటర్లకు జనం వచ్చే దెప్పుడు? సినిమా హాళ్ళు కళకళలాడాలంటే టాప్ స్టార్స్ ఒక్కొక్కరు ఏడాదికి రెండు మూడు సినిమాలైనా చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది... ఈ నేపథ్యంలోనే మన హీరోలు మలయాళ నటులను ఆదర్శంగా తీసుకోవాలని సినీజనం సూచిస్తున్నారు... ఒకప్పుడు స్టార్ హీరోగా సాగిన మలయాళ నటుడు ప్రేమ్ నజీర్ (Prem Nazir) ఓ యేడాది ఏకంగా నలభై సినిమాల్లో కనిపించారు... ఆ తీరున ఆయన ఏడువందలకు పైగా చిత్రాల్లో నటించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు... ఆయన చూపిన బాటలోనే మలయాళ స్టార్స్ సాగుతూ ఉండడం విశేషం... వయసు మీద పడ్డా మమ్ముట్టి (Mammootty), మోహన్ లాల్ (Mohan Lal) సైతం ఏడాదికి నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నారు... ఈ యేడాది కేవలం నెల వ్యవధిలో మోహన్ లాల్ నటించిన రెండు చిత్రాలు 'ఎంపురాన్', 'తుడరుమ్' (Thudarum) కేరళలో బ్లాక్ బస్టర్స్ గా నిలవడం విశేషం! మోహన్ లాల్ ను చూసి మన హీరోలు కూడా ఇన్ స్పైర్ అయితే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.

మలయాళ చిత్రసీమలో పేరున్న టాప్ స్టార్స్ మాత్రమే కాదు, వర్ధమాన నటులు సైతం సంవత్సరానికి ఏడెనిమిది చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు... అంతేకాదు, బడ్జెట్ విషయంలోనూ వీరు జాగ్రత్త తీసుకుంటున్నారు... దాంతో పరాజయాల శాతం తగ్గించడానికి వీలవుతోంది... కథాబలం ఉన్న చిత్రాలు నిర్మిస్తూ కేరళ నిర్మాతలు సాగుతున్నారు... దాంతో తక్కువ బడ్జెట్ తోనే ఎక్కువ లాభాలు చూస్తూన్నారు మలయాళ నిర్మాతలు... భారీ చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించడం కాదు - లో-బడ్జెట్ మూవీస్ తోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో అలరించే ప్రయత్నం చేస్తున్నారు మలయాళ సినీజనం... అందువల్ల తెలుగు స్టార్సే కాదు, భారతదేశంలోని ఇతర భాషల వారు సైతం తమ సినిమారంగాలపై అభిమానం ఉంటే మాలీవుడ్ బాబులను ఆదర్శంగా తీసుకోవాలని పరిశీలకులు సూచిస్తున్నారు... మరి ఎంతమంది ఈ సూచనను పాటిస్తారో చూడాలి.

Also Read: NTR: మరపురాని మహానాయకుడు

Also Read: Harihara Veeramallu: హరి హర వీరమల్లు నుంచి.. తార పాటొచ్చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 28 , 2025 | 01:03 PM