NTR: మరపురాని మహానాయకుడు
ABN , Publish Date - May 28 , 2025 | 12:47 PM
తెలుగు పలుకు ఉన్నంత వరకూ మరపురాని మరచిపోలేని ఏకైక మహానటుడు, మహానాయకుడు యన్టీఆర్ అనే చెప్పాలి... మే 28న యన్టీఆర్ 102వ జయంతి సాగనుంది... ఈ సందర్భంగా యన్టీఆర్ వైభవాన్ని మననం చేసుకుందాం...
రెండేళ్ళ క్రితమే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరాముని (N T Ramarao) శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి... ప్రపంచంలో ఏ మహానటునికీ జరగనటువంటి రీతిలో యన్టీఆర్ అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు... తెనాలిలోని పెమ్మసాని థియేటర్ లో ప్రతి రోజూ యన్టీఆర్ సినిమా ప్రదర్శిస్తూ, మధ్యలో కళాసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ యేడాది పాటు ఉత్సవాలు చేశారు... ఆ సమయాన యన్టీఆర్ (NTR) నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ అధికారంలోనూ లేదు... అయినా అన్న అభిమానులు తమదైన రీతిలో శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు... అవి జరిగి రెండేళ్ళు దాటినా ఇప్పటికీ యన్టీఆర్ జయంతి, వర్ధంతి వస్తే చాలు అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు... ఎందుకు యన్టీఆర్ కే ఇంతటి ఆదరణ అన్న అనుమానం కలుగక మానదు... అందుకు తెలుగుతెరపై వేల్పుల పాత్రల్లో అనితరసాధ్యంగా యన్టీఆర్ సాగిన తీరు ఓ కారణమని చెప్పక తప్పదు...
వందలాది చిత్రాల్లో యన్టీఆర్ పోషించిన విలక్షణమైన పాత్రలు తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేశాయి... ముఖ్యంగా దేవతామూర్తుల పాత్రల్లో తనకు తానే సాటి అనిపించారు రామారావు... శ్రీరామ (Srirama), శ్రీకృష్ణ (Sri Krishna), శ్రీనివాస (Srinivasa), శ్రీమహావిష్ణువు, శివుని పాత్రల్లో యన్టీఆర్ ను చూసిన కళ్ళతో మరొకరిని చూడలేమని తెలుగువారు పలుమార్లు తేల్చి చెప్పారు... తనను అంతలా ఆదరించిన తెలుగువారి రుణం తీర్చుకొనేందుకు అంటూ యన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ నెలకొల్పి అనితరసాధ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తనదైన బాణీ పలికిస్తూ పాలన సాగించారు... యన్టీఆర్ నెలకొల్పిన ఎన్నెన్నో పథకాలు ఈ నాటికీ వేర్వేరు పేర్లతో సాగుతూ ఉండడం విశేషం... రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన యన్టీఆర్ వరుసగా 1983, 1984, 1985 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేశారు. ఇక 1994లో చివరి సారిగానూ అనూహ్య విజయం సాధించి అభిమానులను పులకింప చేశారు.. సమైక్యాంధ్రలో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకునిగా నందమూరి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ తనదైన బాణీ పలికించిన రామారావును పొలిటీషియన్స్ సదా స్మరిస్తూనే ఉండడం విశేషం!
దేశంలో ఏదైనా ఉపద్రవం సంభవించినా, ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నా తెలుగు జనం యన్టీఆర్ నే స్మరించుకుంటూ ఉంటారు... 1952లో రాయలసీమ క్షామనివారణకు, ఆ పై పోలీస్ శాఖ కోసం, 1965లో దేశ రక్షణనిధికి, 1977లో దివి సీమ ఉప్పెన సమయంలో యన్టీఆర్ తాను విరాళం ఇవ్వడమే కాకుండా జనం మధ్యకు వచ్చి విరాళాలు సేకరించారు... ఇక భారత్-పాక్ యుద్ధ సమయంలోనూ యన్టీఆర్ రక్షణ నిధి కోసం అదే తీరున విరాళాలు పోగేశారు... ఇటీవల సంభవించిన భారత్-పాక్ యుద్ధ సమయంలోనూ, ఈ మధ్యే చిత్రసీమలో నెలకొన్న పరిస్థితుల చర్చల్లోనూ యన్టీఆర్ ను తెలుగు సినీజనం స్మరించుకున్నారు... యన్టీఆర్ ను అయితే తలచుకుంటున్నారు కానీ, ఆయన చూపిన బాటలో ఎందరు సాగుతున్నారు? యుద్ధ సమయంలో ఎవరూ ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చింది లేదు.. అలాగే చిత్రసీమలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికీ ఎవరూ పూనుకోవడం లేదు... యన్టీఆర్ ను స్మరించుకోవడం కాదు, ఆయన చూపిన బాటలో నడచిన నాడే ఆయనకు అసలైన నివాళి!
(ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా...)