Mahavathar Narasimha: ఐదుగురు స్టార్ హీరోల పోటీ తట్టుకుని...
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:35 PM
యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' నాలుగోవారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే రూ. 260 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా అతి త్వరలోనే రూ. 500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
కన్నడ చిత్రం 'మహావతార్ నరసింహ' (Mahavathar Narasimha) వివిధ భారతీయ భాషల్లో జూలై 25న విడుదలైంది. సరిగ్గా దానికి ఒకరోజు ముందు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'హరిహర వీరమల్లు' (Harihara veeramallu) విడుదలైంది. ఓపెనింగ్ డే కాస్తంత సందడి చేసినా... ఆ తర్వాత ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ఉదృతిని ప్రదర్శించలేకపోయింది. గ్రాఫిక్స్ వీక్ అనే టాక్ బాగా స్ర్పెడ్ అయిపోయింది. వాటిని కరెక్ట్ చేసి పెట్టినా... అప్పటికే బ్యాడ్ టాక్ స్ప్రెడ్ కావడంతో సినిమా ఒడ్డున పడలేదు. ఇక ఆ తర్వాత 31వ తేదీ వచ్చిన 'కింగ్డమ్' (Kingdom) మూవీ కూడా బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టింది. ఈ సినిమా ఓపెనింగ్స్ అదరహో అనిపించాయి. కానీ మితిమీరిన హింస, తలాతోక లేని ద్వితీయార్థం 'కింగ్డమ్' ను కిల్ చేశాయనే విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో 25వ తేదీ విడుదలైన 'మహావతార్ నరసింహ' నిదానంగా పుంజుకుని రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోయింది.
ఆగస్ట్ 1న తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ జంటగా నటించిన 'సార్ మేడమ్' (Sir Madam) మూవీ తెలుగులో విడుదలైంది. తమిళంలో మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఊపు చూపించలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న వచ్చిన 'వార్ -2' (War -2), 'కూలీ' (Coolie) చిత్రాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించిన తొలి హిందీ సినిమా 'వార్ -2'పై ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇది హిందీ డబ్బింగ్ మూవీనే అయినా హైదరాబాద్ లోనూ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేశారు. ఈ సినిమా తెలుగు హక్కుల్ని సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నాడు. ఈయనకు యాభై శాతంపైనే లాస్ వస్తుందని అంటున్నారు. ఇదే పరిస్థితి రజనీకాంత్ (Rajinikanth) 'కూలీ' విషయంలోనూ వినిపిస్తోంది. నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), ఆమీర్ ఖాన్ (Aamirkhan), శ్రుతీహాసన్, పూజా హెగ్డే వంటి వారు సైతం 'కూలీ'ని సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయారు. అపజయమే ఎరుగని లోకేష్ కనకరాజ్ తొలిసారి 'కూలీ' రూపంలో పరాజయాన్ని అందుకున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇలా గత మూడు వారాలుగా ఐదుగురు స్టార్ హీరోల సినిమా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి బాక్సాఫీస్ బరిలో బోల్తా కొడుతుంటే... 'మహావతార్ నరసింహ' స్ట్రాంగ్ కలెక్షన్స్ తో నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. పలు నగరాలు, పట్టణాలలో ఈ సినిమా ఇప్పటికీ వీకెండ్ లో 70, 80 శాతం కలెక్షన్స్ తో దుమ్మురేపుతోంది. భారతదేశంలో యానిమేషన్ మూవీస్ లో రూ. 260 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా 'మహావతార్ నరసింహ' నిలిచింది. ఈ సినిమా అతి త్వరలోనే వరల్డ్ వైడ్ రూ. 500 కోట్ల గ్రాస్ ను వసూలు చేస్తుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఏ స్టార్ హీరో లేకుండా, కేవలం 15 కోట్ల బడ్జెట్ తో యానిమేషన్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ ను చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. సినిమాకు కావాల్సింది స్టార్స్ కాదని, ఆసక్తికరమైన కథ, కథనాలు మాత్రమేనని 'మహావతార్ నరసింహ' నిరూపించిందని వారు చెబుతున్నారు. ఇప్పుడీ సినిమా విజయంతో పలు అగ్ర నిర్మాణ సంస్థలు సైతం డివోషనల్ యానిమేషన్ మూవీస్ మీద దృష్టి పెడుతున్నాయి. వచ్చే యేడాది ఈ తరహా సినిమాలు మరిన్ని వచ్చే ఆస్కారం కనిపిస్తోంది.
Also Read: SS Rajamouli: ఆ సీన్ చిరు చేయలేకపోయాడు.. అందుకే చరణ్ తో చేయించా
Also Read: Anil Sunkara: సరిలేరు నీకెవ్వరుకు కొవిడ్ దెబ్బ...