Good Bad Ugly: అగ్లీ చర్యపై ఇళయరాజా విజయం
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:28 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్ర నిర్మాతలకు మద్రాస్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఇళయరాజా పాటలను ఆయన అనుమతి లేకుండా వాడుకోవడాన్ని తప్పుపట్టింది. ఈ సినిమా ప్రసారాలను వెంటనే ఆపేయాలని ఆదేశించింది.
వెయ్యికి పైగా సినిమాలకు సంగీతం అందించిన చరిత్ర మాస్ట్రో ఇళయరాజాది. కొన్ని దశాబ్దాల పాటుగా తన జీవితాన్ని సినీ సంగీతానికే అంకితం చేసిన తపస్వి ఆయన. అలాంటి ఇళయారాజా స్వరపర్చిన పాటలను వాటికి ఉన్న ఫేమ్ దృష్ట్యా చాలామంది దర్శక నిర్మాతలు ఇష్టానుసారం వాడేసుకుంటున్నారు. ముందుగా ఒక్క మాట కూడా ఇళయరాజాకు చెప్పకుండా, ఆయన అనుమతి తీసుకోకుండా కాపీ రైట్ ఉల్లంఘానికి పాల్పడుతున్నారు.
కొంతకాలంగా ఇళయరాజా తన పాటల విషయంలో జరుగుతున్న కాపీరైట్ ఉల్లంఘనపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. అవసరం అయితే నోటీసులు పంపడంతో పాటు సదరు వ్యక్తులపై కోర్టుకూ వెళుతున్నారు. ఇటీవల ఆయన అజిత్ హీరోగా నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో తన పాటలను వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు కోర్టుకూ ఎక్కారు. తాజాగా మద్రాస్ హైకోర్టులో తీర్పు ఇళయరాజాకు అనుకూలంగా వచ్చింది. తాను గతంలో స్వరపర్చిన మూడు సినిమాల పాటలను ఇందులో కాపీ కొట్టి వాడారన్నది ఇళయరాజా వాదన. 'నట్టుపుర పట్టు' చిత్రంలోని 'ఓథ రుబాయమ్ థారెన్', 'సకల కళా వల్లభన్' లోని 'ఇలమై ఇధో ఇదో', 'విక్రమ్' మూవీలోని 'ఎన్ జోడి మాంజా కురువి' పాటలను ఇందులో కాపీ కొట్టారని ఇళయరాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాధమిక ఆధారాలను బట్టి న్యాయమూర్తి తీర్పు చెబుతూ, 'సినిమా ప్రసారాలను తాత్కాలికంగా ఆపేయాల'ని తీర్పునిచ్చారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో దానికి బ్రేక్ వేయక తప్పడం లేదు. ఇది ఒక రకంగా నిర్మాతలకూ ఊహించని షాకే. వేరొకరి సినిమాలోని పాటలను చట్టవిరుద్థంగా వాడుకోవడం అనైతికం కూడా అని న్యాయమూర్తి సెంథిల్ కుమార్ ఇచ్చిన తీర్పుపై ఇళయరాజా హర్షం వ్యక్తం చేశారు.
ఇళయరాజా తరఫు లాయర్ ఈ విషయం గురించి చెబుతూ, '2025 కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 19 (9) మరియు సెక్షన్ 19 (10) ఆధారంగా, పాటల స్వరకర్తగా, ఏ మాధ్యమంలోనైనా వాటి ఉపయోగం కోసం రాయల్టీలను పొందే హక్కు ఇళయరాజాకు ఉంటుంద'ని తెలిపారు. ఆయన బాణీలను వేరొకరు ఉపయోగించుకుంటే దానికి సంబంధించి రాయల్టీ పొందే హక్కు ఉందని ఇళయరాజాకు ఉంటుందని వాదించారు. దీనితో న్యాయమూర్తి సైతం ఏకీభవించినట్టు ఈ తీర్పు బట్టి అర్థం అవుతోంది.
Also Read: Vijay Antony: 'బూకి' సినిమాలో మంచు లక్ష్మీ...
Also Read: Manoj Vs Srinivas: కిష్కింధపురికి పోటీగా మిరాయ్...