Manoj Vs Srinivas: కిష్కింధపురికి పోటీగా మిరాయ్...
ABN , Publish Date - Sep 09 , 2025 | 10:00 AM
మూడున్నర నెలల క్రితం తమ చిత్రం 'భైరవం' కోసం కలిసి ప్రచారం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ ఇప్పుడు ఒకరి సినిమాతో ఒకరు పోటీ పడబోతున్నారు.
సినిమా రంగంలో ప్రతి ఒక్కరి ఫేట్ శుక్రవారం నాడు మారిపోతూ ఉంటుంది. బాక్సాఫీస్ బరిలో రారాజుగా నిలిచిన వారు శుక్రవారం విడుదలయ్యే సినిమాతో ఏమైనా కావచ్చు అని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. అలానే కొన్ని సినిమాలలో కలిసి నటించిన హీరోలు... ఒక్కోసారి వారికి వారే పోటీగా మారే పరిస్థితులూ ఉంటాయి. అలా తాజాగా ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas), మంచు మనోజ్ (Manchu Manoj) ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారు. విశేషం ఏమంటే... సరిగ్గా మూడున్నర నెలల ముందు వీరిద్దరూ కలిసి నటించిన 'భైరవం' (Bhairavam) సినిమా విడుదలైంది. అప్పుడు ఒకే సినిమాలో నటించి, దాని విజయం కోసం కలిసి ప్రచారం చేసిన వీరిద్దరూ ఇప్పుడు తమ వేర్వేరు సినిమాల కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన 'భైరవం' సినిమా మే 30వ తేదీ గ్రాండ్ గా విడుదలైంది. ఇందులో నారా రోహిత్ (Nara Rohith) తో పాటు మంచు మనోజ్ కూడా ఓ కీలక పాత్రను పోషించాడు. ఇది తమిళ చిత్రం 'గరుడన్' (Garudan) కు రీమేక్. ఆ సినిమా ఆ సమయానికి బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కు చాలా ప్రతిష్ఠాత్మకంగా మారింది. సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా... వీరి కాంబినేషన్ మీద మాత్రం బాగా చర్చజరిగింది. ఎవరికి వారు పోటీ పడి నటించారనే పేరొచ్చింది. దీని తర్వాత సరిగ్గా మూడు నెలలకు నారా రోహిత్ సోలో హీరోగా నటించిన 'సుందరకాండ' (Sundarakanda) మూవీ ఆగస్ట్ 27న విడుదలైంది. ఈ సినిమాకు డీసెంట్ రివ్యూస్ వచ్చినా... బాక్సాఫీస్ బరిలో మాత్రం 'సుందరకాండ' ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది.
ఇప్పుడు 'భైరవం'లో నటించిన మిగిలిన ఇద్దరు ప్రధాన పాత్రధారుల సినిమాలు ఈ నెల 12న విడుదల కాబోతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న హారర్ మూవీ 'కిష్కింధపురి' భారీ అంచనాలతో జనం ముందుకు వస్తోంది. ఇందులో శ్రీనివాస్ తో పాటు 'రాక్షసుడు' (Rakshasudu) మూవీలో నటించిన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించింది. సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాను 'చావు కబురు చల్లగా' ఫేమ్ కౌశిక్ డైరెక్ట్ చేశాడు. అలానే తేజ సజ్జా హీరోగా నటించిన 'మిరాయ్' సినిమా కూడా ఈ నెల 12నే రాబోతోంది. ఇందులోనే మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలను చూసినప్పుడు మనోజ్ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమౌతోంది. ఈ కథ మొత్తం అతని చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఈ పాత్రను బాగా ఓన్ చేసుకున్న మనోజ్ 'మిరాయ్'ను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ టీజర్ ను రజనీకాంత్ కూ స్వయంగా చూపించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. 'మిరాయ్' సినిమా ఏకంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. సో... 'భైరవం'లో కలిసి నటించిన శ్రీనివాస్, మనోజ్... ఇప్పుడు ఒకరితో ఒకరు పోటీ పడుతూ బరిలోకి దిగుతున్నారు. మరి వీరిలో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో చూడాలి.
Also Read: Tuesday Tv Movies: మంగళవారం.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
Also Read: Mahesh Family: లేడీ గాగా షోలో.. మహేశ్ ఫ్యామిలీ