Karthi: వావ్... కార్తీ సినిమాకు తెలుగు టైటిల్...
ABN, Publish Date - Nov 19 , 2025 | 11:25 AM
కార్తీ తాజా తమిళ చిత్రం 'వా వాతియార్' తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో డబ్ అవుతోంది. కృతీశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు.
మొదటి నుండి కార్తీ (Karthi) కి తెలుగులో అభిమానులు విశేషంగా ఉన్నారు. అతను నటించిన కొన్ని తమిళ సినిమాలు అక్కడ కంటే ఇక్కడే ఎక్కువ ఆడిన సందర్భాలు ఉన్నాయి. అలానే ఈ నెల 22 కార్తీ నటించిన 'ఆవారా' (Aawara)సినిమా తెలుగులో రీ-రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే కార్తీ కొత్త సినిమా టైటిల్ ను తెలుగులో ప్రకటించారు. కార్తీ నటించిన తమిళ చిత్రం 'వా వాతియార్' (Vaa Vaathiyaar) డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకున్న సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాని కారణంగా ఈ సినిమా కొంత ఆలస్యంగా జనం ముందుకు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. విశేషం ఏమంటే 'వా వాతియార్' సినిమాకు తెలుగులో 'అన్నగారు వస్తారు' (Annagaru Vostaru) అనే పేరును పెట్టారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కాబోతోందంటూ ఓ కొత్త పోస్టర్ ను నయా టైటిల్ తో విడుదల చేశారు.
కార్తీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అతని సరసన కృతీశెట్టి ( Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె. ఇ. జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) నిర్మించాడు. ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి కథను అందించడంతో పాటు నలన్ కుమారస్వామి (Nalan Kumarasamy) దర్శకత్వం వహించాడు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సత్యరాజ్ (Satyaraj), మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ చిత్రాలను అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్న సమయంలో కార్తీ తన సినిమాకు తెలుగు పేరును పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. గతంలోనూ కార్తీ తన తమిళ చిత్రాల పేర్లను చాలా సందర్భాలలో తెలుగులోనే పెట్టారు. గత యేడాది కార్తీ హీరోగా నటించిన 'మేయళగన్' తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో అనువాదమైంది.
Also Read: Diesel: సడన్‌గా.. తెలుగులో ఓటీటీకి వచ్చేసింది