Rajinikanth: నాకు.. సత్యరాజ్‌కు అభిప్రాయ భేదాలు నిజమే!
ABN , Publish Date - Aug 03 , 2025 | 08:47 PM
అభిమానుల్లో ఉండే ఎనర్జీ తనలోనూ ఉందని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు.
అభిమానుల్లో ఉండే ఎనర్జీ తనలోనూ ఉందని సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అన్నారు. ఆయన హీరోగా లోకేష్ కనక రాజ్ (Lokesh kanakaraj) దర్శకత్వంలో రూపొందిన 'కూలీస (Coolie) చిత్ర ఆడియో వేడుక చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నాకు, సత్యరాజ్‌కు అభిప్రాయభేదాలు ఉండొచ్చు, కానీ ఆయన మనసులో వచ్చిన మాటను నిర్మొహమాటంగా చెప్పి వెళ్లిపోతుంటారు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారిని నమ్మొచ్చు. కానీ, మనసులో ఒకటి, బయట ఒకటి పెట్టుకుని వుండేవాళ్లని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు' అన్నారు. 'ఎన్ని రోజులని నేను మంచిగా నటించాలి' అని హీరో అజిత్ కుమార్‌కు దర్శకుడు వెంకట్ ప్రభు ఒక డైలాగ్ రాశాడు. ఆ విధంగానే ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున ఒక పాత్రలో నటించారు' అని రజనీకాంత్ అన్నారు.
అనంతరం అక్కినేని నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ, 'ఒక కూలీ వంద బాషాలకు సమానం. నిజమైన సూపర్ స్టార్ రజనీకాంత్ ఓజీ సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ యూ ఆర్ ది సూపర్ స్టార్ ఆఫ్ ది ఇండియన్ సినిమా' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ, 'నా తండ్రి ఒక బస్సు కండక్టర్. ఆయన నంబరు 1421. ఆ నెంబరును ఈ సినిమాలో రజనీకాంత్‌కు ఉపయోగించాను. ఇది నా తండ్రికి నేను ఇచ్చే ఒక గౌరవంగా భావిస్తున్నా' అన్నారు.
హీరోయిన్ శృతి హాసన్ మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో నాకు ఒక మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు లోకేశ్ కు ధన్యవాదాలు మా నాన్నకు 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆ చిత్రం నుంచి నేను మీ అభిమానిగా మారిపోయాను' అన్నారు. ఈ ఆడియో వేడుకల్లో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ (Amir khan) తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14వ తేదీన తమిళ, తెలుగు,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.