BroCode: తల్లిని గౌరవించిన రవి మోహన్
ABN, Publish Date - Aug 29 , 2025 | 02:30 PM
హీరో రవి మోహన్ కొత్త సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
తమిళ హీరో రవి మోహన్ (Ravi Mohan) ఇటీవలే భార్య ఆర్తి (Arthi) కి విడాకులు ఇచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. విశేషం ఏమంటే... తన తండ్రి ఎడిటర్ మోహన్ (Editor Mohan) బాటలో సాగుతూ రవి నిర్మాతగానూ మారాడు. రవి మోహన్ స్టూడియోస్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించిన వార్తలు తమిళనాట బాగా హల్చల్ చేస్తున్నాయి. సొంత బ్యానర్ లో రెండు సినిమాలను నిర్మిస్తానని చెప్పిన రవి 'బ్రోకోడ్' (Brocode) పేరుతో మొదటి సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ కార్యక్రమానికి శివ కార్తికేయన్ (Siva Krathikeyan) , కార్తీ (Karthi), జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ, ‘నేను రవిని స్టంట్ క్లాస్‌లో కలిశాను. అప్పుడు నేను ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చాను. రవి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. రవి ఇలా ఇంత గ్రాండ్‌గా నిర్మాణ సంస్థను ప్రారంభిస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. రవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. రవి ప్రొడక్షన్ కంపెనీలో రాబోతోన్న ‘బ్రో కోడ్’, యోగిబాబు ప్రాజెక్టులు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. శివకార్తికేయన్ మాట్లాడుతూ, ‘రవి, నాలా అందరు నటులు నిర్మాణ సంస్థలను ప్రారంభిస్తే, పరిశ్రమకు చాలా మంచి కథలు వస్తాయి. మంచి పరిణామం చోటు చేసుకుంటుంది’ అని చెప్పారు. రవి సోదరుడు రాజా మోహన్ ‘మీతో పని చేయడాన్ని గర్వంగా భావిస్తుంటాను’ అని అన్నారు. కన్నడ నటుడు డాక్టర్ శివరాజ్ కుమార్... రవి కోసం తాను ఏమైనా చేస్తానని, అతను చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చాడు.
హీరో, నిర్మాత, దర్శకుడు రవి మోహన్ మాట్లాడుతూ, 'ఈ సమయంలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. నేను, కార్తీ ఇద్దరం కూడా విలాసాలను కోరుకోం. 'పొన్నియిన్ సెల్వన్' షూటింగ్ సమయంలో మేం ఒకరినొకరం ఎంతో తెలుసుకున్నాం. సినిమా అనేది లక్షలాది మందికి వినోదం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. నాకు నా అభిమానులే ఈ ప్రయాణంలో అండగా నిలిచారు. వారి వల్లే ఈ స్థాయికి వచ్చాను. సినిమాలో నేను ఇంకా సాధించాల్సిన కలలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది నా స్వంత ప్రొడక్షన్ స్టూడియో. నేను ప్రారంభించిన ఈ కంపెనీ కేవలం నా సొంత చిత్రాల కోసమే కాదు. యువ, కొత్త దర్శకులకు అవకాశాలను ఇవ్వడం, ఎంతో మంది కలలకు రూపం ఇవ్వడం, సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ప్రాజెక్టులు చేయడం నా ఉద్దేశం. కొత్త వారికి నేను ప్రాధాన్యం ఇస్తాను’ అని అన్నారు.
ఇదే వేదికపై గాయని కెనిషా మాట్లాడుతూ .. ‘నువ్వు (రవి మోహన్) నాకు ఓ మంచి కుటుంబాన్ని ఇచ్చావు. నా ఈ ప్రయాణం ఎంతో కష్టంగా సాగింది. కానీ నా కంటే ఎక్కువ కష్టాల్ని నువ్వు ఎదుర్కొన్నావు. నువ్వెప్పుడూ ఇతర జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రొడక్షన్ కంపెనీ పెట్టేందుకు చాలా కష్టపడ్డావు. నీకు ఎన్నో విజయాలు దక్కాలి’ అని చెప్పింది. నటుడు యోగిబాబు మాట్లాడుతూ, ‘ఆరేళ్ల క్రితం ఇచ్చిన మాట ప్రకారం అవకాశం ఇచ్చిన రవి మోహన్ గారికి థాంక్స్. దర్శకత్వం చేస్తే ఆ మొదటి చిత్రంలో హీరోగా అవకాశం ఇస్తానని, ఇచ్చిన మాట ప్రకారం నాతో సినిమాను చేస్తున్నారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తన తల్లి లక్ష్మీని రవి మోహన్ సత్కరించారు.
Also Read: Vash Level 2: ఈ సినిమా ఏంటి.. ఇంత భయంకరంగా ఉంది! భయపడి చస్తారు
Also Read: Vishal Sai Dhanshika: విశాల్, సాయి ధన్సిక.. నిశ్చితార్థం అయిపోయింది