Vash Level 2: ఈ సినిమా ఏంటి.. ఇంత భయంకరంగా ఉంది! భయపడి చస్తారు
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:38 PM
గుజరాత్ (Gujarati) నుంచి వచ్చిన సూపర్ నేచురల్ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం వష్ .
మనకు మాములుగా హర్రర్ సినిమాలంటే మొదటగా గుర్తొచ్చేది హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు ది రింగ్, కంజూరింగ్, నన్ వంటివి అనేకం మైండ్‌లోకి వస్తాయి. ఆపై మన దేశానికి వచ్చే సరికి బాలీవుడ్‌లో వచ్చిన భూత్, తెలుగులో వచ్చిన రాత్రి చిత్రాలు ఫేమస్. ఆ తర్వాత లారెన్స్ నుంచి వచ్చిన కాంచన సిరీస్ చిత్రాలు సౌత్ తో పాటు నార్త్‌ను షేక్ చేశాయి. ఇదే కోవలో గుజరాత్ (Gujarati) నుంచి వచ్చిన సూపర్ నేచురల్ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం వష్ (Vash). కృష్ణదేవ్ యాగ్నిక్ (Krishnadev Yagnik) దర్శకత్వంలో 2023లో సాదా సీదా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సంచలనాలు క్రియేట్ చేసింది. ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు, స్కూల్ పిల్లల చుట్టూ తిరిగే హింసాత్మక సన్నివేశాలతో ఈ సినిమా అందరినీ బాగా భయ పెట్టింది కూడా. దీంతో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ సైతాన్ పేరుతో హిందీలో రిమేక్ చేసి హిట్ కొట్టారు.
‘వష్’ కథ ఒక మాంత్రికుడి చుట్టూ తిరుగుతుంది. అతడు వశీకరణ విద్య ద్వారా స్కూల్ పిల్లలను తన వశం చేసుకొని, వారి జీవితాలతో ఆటలాడుతాడు. చివరకు ఓ అమ్మాయి తండ్రి ఈ దుష్టశక్తులను ఎలా ఎదుర్కొన్నాడనేది కథలోని కీలక అంశం. ఇప్పుడు ఈ వష్ సినిమాకు సీక్వెల్‌గా పుష్కరం తర్వాత జరిగే కథగా వష్2 నెక్స్ట్ లెవల్ (Vash Level 2) ను గుజరాతీలో తెరకెక్కించి హిందీలో డబ్ చేసి ఒకే సారి ఈ వినాయక చవితికి థియేటర్లలోకి తీసుకు వచ్చారు. మొదటి భాగంతో పోలిస్తే, ఈ సీక్వెల్ మరింత భయానకంగా, షాకింగ్ కంటెంట్‌తో రూపొందింది. జానకి బోడివాలా (Janki Bodiwala), హితూ కనోడియా (Hitu Kanodia), హితేన్ కుమార్ (Hiten Kumar)లతో పాటు మన తెలుగులో పాపులర్ హీరోయిన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ (Monal Gajjar) కీ రోల్ చేయడం విశేషం.
కథ ఏంటంటే..
ఒక పెద్ద స్కూల్‌లో చదివే పది మంది అమ్మాయిలు ఒక్కసారిగా పాఠశాల టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొంతమంది అమ్మాయిలు ఒకరిపై ఒకరు వశీకరణ చేసుకుంటూ, ఇతరులపై దాడులు చేస్తారు. ఇంకొంతమంది ఊరిపై పడి, దొరికిన వారిని అత్యంత దారుణంగా చంపేస్తారు. ఈ హింసాత్మక ఘటనల వెనుక మొదటి భాగంలోని మాంత్రికుడి శిష్యుడి చేయి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరికింది, ఎవరు ఎదురు నిలబడి పోరాడారు అనే ఆసక్తికరమైన, థ్రిల్లింగ్ అంశాలతో సీట్ ఎడ్జ్ హర్రర్ థ్రిల్లర్ గా మలిచారు.
అయితే.. సినిమా నిడివి కేవలం 1 గంట 35 నిమిషాలు మాత్రమే ఉన్నా ప్రతి సన్నివేశం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. మధ్యలో వచ్చే హింసాత్మక దృశ్యాలు కాస్త ఒళ్లు జలదరింప చేస్తాయి. ఓ సందర్భంలో ఎవడ్రా పిలల్లతో ఇలాంటి సినిమా తీసింది అనే ఆగ్రహం రాక మానదు. ఇదిలాఉంటే ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉండనున్నట్లు మేకర్స్ చెప్పకనే చెప్పి క్యూరియాసిటీ పెంచేశారు. ప్రస్తుతం ఈ వష్2 నెక్స్ట్ లెవల్ (Vash Level 2) చిత్రం గత సినిమా మాదిరిగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.