Sobhanbabu: 50 ఏళ్ళ 'బలిపీఠం'
ABN , Publish Date - Jul 17 , 2025 | 02:07 PM
నటభూషణ శోభన్ బాబు హీరోగా దర్శకరత్న దాసరి తెరకెక్కించిన నవలాచిత్రం 'బలిపీఠం'. జూలై 17తో 'బలిపీఠం' యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం.
నటభూషణ శోభన్ బాబు (Sobhanbabu)కు 1975వ సంవత్సరం భలేగా అచ్చివచ్చింది. ఆ యేడాది విడుదలైన శోభన్ సినిమాలు 'దేవుడు చేసిన పెళ్ళి, జీవనజ్యోతి, జేబుదొంగ, బలిపీఠం, సోగ్గాడు' డైరెక్ట్ గా హండ్రెడ్ డేస్ చూసి అలరించాయి. ఓ వైపు 'జీవనజ్యోతి' విశేషాదరణ పొందుతున్న సమయంలోనే శోభన్ - దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రంగా 'బలిపీఠం' (Balipeetam) విడుదలయింది. శారద నాయికగా నటించిన ఈ సినిమా 1975 జూలై 17న జనం ముందు నిలచింది. రంగనాయకమ్మ (Ranganayakamma) రాసిన 'బలిపీఠం' నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నవల విశేషాదరణ పొందింది. దాంతో పాఠకులు 'బలిపీఠం' సినిమా కోసం పరుగులు తీశారు. కులాంతర వివాహం, తరువాతి పరిణామాలు నేపథ్యంలో తెరకెక్కిన 'బలిపీఠం' అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది.
అంతకు ముందు శోభన్ బాబు, శారద (Sarada) జంటగా నటించిన 'మనుషులు మారాలి, శారద, ఇదా లోకం' వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. శోభన్ -శారద హిట్ పెయిర్ తో తెరకెక్కిన 'బలిపీఠం'పై మొదటి నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండేది. పైగా ఇది రంగుల్లో రూపొందిన చిత్రం కావడంతో జనం మరింతగా ఆదరించారు. ఈ చిత్రాన్ని వై.సునీల్ చౌదరి నిర్మించారు. ఇందులో రాజబాబు, రోజారమణి, నిర్మలమ్మ, హేమలత, అల్లు రామలింగయ్య, మురళీమోహన్, శ్రీవిద్య, బేబీ రాణి నటించారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం ఓ ఎస్సెట్ గా నిలచింది. దేవులపల్లి, శ్రీశ్రీ, దాశరథి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు పాటలు రాశారు. మరో విశేషమేంటంటే ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, ఆయన సోదరుడు డైరెక్టర్ కొమ్మినేని శేషగిరిరావు ఓ పాటలో చిందేస్తూ కనిపించారు.
శోభన్ బాబు ఈ సినిమాను కలర్ లో తీస్తేనే నటిస్తానన్న కండిషన్ పెట్టారు. అప్పట్లో కలర్ ముడి ఫిలిమ్ రేటు ఎక్కువగా ఉండేది. ఈ విషయం దాసరి ద్వారా తెలుసుకున్న శోభన్ నిర్మాత బాగు కోసం తన పారితోషికంలో పాతికశాతం తగ్గించుకున్నారు. అలా ఆ యేడాది శోభన్ మరికొన్ని సినిమాలనూ రంగుల్లో రూపొందించడానికి తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారట. ఏది ఏమైనా 'బలిపీఠం' చిత్రం మంచి విజయం సాధించి, విజయవాడ, గుంటూరు కేంద్రాలలో శతదినోత్సవం చూసింది.
Also Read: Bakasura Restaurant: వడ్డించడమే తరువాయి...
Also Read: Genelia horror comedy: హారర్ కామెడీ మూవీలో హాసిని...
Also Read: DNA Tamil Movie: అసలేం జరుగుతోంది...