Tollywood: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల తేదీ ఖరారు
ABN, Publish Date - Nov 26 , 2025 | 10:55 AM
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. డిసెంబర్ 28న ఛాంబర్ ఎన్నికలు జరుగుతాయని కార్య నిర్వహణాధికారి తెలిపారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) ఎన్నికలు సత్వరమే జరపాలని ఒక వర్గం, వాయిదా వేయాలని మరో వర్గం కొంతకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కమిటీనే మరికొంత కాలం పొడిగించాలని కొందరు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఛాంబర్ బైలా నియమం ప్రకారం ఎన్నికలు జరపాల్సిందేనని మరికొందరు పట్టుబట్టారు. మొత్తానికి కాస్తంత ఆలస్యంగానైనా... 2025-27కు సంబంధించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 16వ తేదీ జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నవంబర్ 25న నోటిఫికేషన్ ను విడుదల చేశారు. డిసెంబర్ 28 ఆదివారం ఉదయం 8.00 గంటల నుండి 1.00 వరకూ ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఎన్నికలు జరుగనున్నట్టు కార్యనిర్వహణాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యులతో పాటు మండలి నాలుగు విభాగాల కార్య నిర్వాహక సభ్యుల ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి.
డిసెంబర్ 1 వ తేదీన నామినేషన్ పత్రాలను హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, విశాఖపట్నం, తిరుపతి కార్యాలయాలలో అందుబాటులో ఉంచుతారు. డిసెంబర్ 12వ తేదీలోగా నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 19 వరకూ ఉంటుంది. ఆ మర్నాడు అభ్యర్థులను ప్రకటిస్తారు. డిసెంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 1.00 గంటకు ఎన్నికలు పూర్తి కాగానే కాస్త విరామం తర్వాత ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
ఏదేమైనా... తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయో లేదో అనే సందేహానికి తావు లేకుండా ఈ నోటిఫికేషన్ రావడం పట్ల సినిమా రంగానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Champion: జంట బావుంది.. పాట అదిరింది! గిరగిర గింగిరాగిరే.. లిరికల్ వీడియో!
Also Read: Sampath Nandi: దర్శకుడు సంపత్ నంది.. ఇంట విషాదం