Good Bad Ugly: ఇళయరాజా దెబ్బ.. నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా అవుట్
ABN, Publish Date - Sep 17 , 2025 | 11:27 AM
మాస్ట్రో ఇళయరాజా ఎఫెక్ట్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీపై గట్టిగా పడింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ తొలగించింది.
స్టార్ హీరో అజిత్ (Ajith) ఫ్యాన్స్ కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) మరోసారి షాక్ ఇచ్చారు. అజిత్ తాజా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) ని కోర్టు ఆదేశాల మేరకు స్ట్రీమింగ్ కంపెనీ నెట్ ఫ్లిక్స్ (Netfilx) తొలగించక తప్పలేదు. ఇప్పుడు ఆ సినిమాను ఆ ప్లాట్ ఫార్మ్ మీద చూసే అవకాశం లేకుండా పోయింది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత మే 8వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో తాను కంపోజ్ చేసిన పాత సినిమాల్లోని మూడు పాటలను అనుమతి లేకుండా వాడుకున్నారని ఇళయరాజా తెలిపారు. నిర్మాతలు క్షమాపణలు చెప్పడంతో పాటు రూ. 5 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mytri movie makers) స్పందించలేదు. దాంతో ఇళయరాజా కోర్టు తలుపు తట్టారు. తాము సదరు మ్యూజిక్ కంపెనీ అనుమతితోనే ఈ పాటలు వాడుకున్నామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలిపింది. అయితే ఇన్ టైమ్ లో దానికి సంబంధించిన ఆధారాలను మాత్రం కోర్టుకు చూపించలేకపోయింది. దాంతో వెంటనే ఈ సినిమాను ప్రసార మాధ్యమాల నుండి తొలగించాలని మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ తీర్పు ఇచ్చారు. తుది తీర్పు వెలువడే వరకూ దీనిని అమలు చేయాల్సిందేనని గట్టిగా తెలిపారు. కోర్టు ఆర్డర్ కారణంగా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీని తన స్క్రీనింగ్ ప్లాట్ ఫార్మ్ నుండి తొలగించింది.
కాపీరైట్ యాక్ట్ పై పలువురు ఇటీవల కోర్టులకు ఎక్కుతున్నారు. ముందుగా అనుమతి తీసుకోకుండా... పాటలను వాడేసుకోవడాన్ని ఇళయరాజా వంటి సంగీత దర్శకులు సీరియస్ గా తీసుకుంటున్నారు. టేకిట్ గ్రాంట్ గా వ్యవహరిస్తే సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. గతంలోనూ 'వి' సినిమా (V Movie) ను ఇలానే కాపీ రైట్ యాక్ట్ కారణంగా అమెజాన్ ప్రైమ్ సంస్థ స్ట్రీమింగ్ నుండి తొలగించాల్సి వచ్చింది. అలానే ధనుష్ (Dhanush) తో వచ్చిన వివాదం కారణంగా నెట్ ఫ్లిక్స్ నయనతార (Nayantara) డాక్యుమెంటరీనీ తొలగించాల్సి వచ్చింది. ఏదేమైనా సంగీత దర్శకుల నుండి ముందస్తు అనుమతి లేకుండా వారి పాటలను వాడుకోవడం నేరమని మేకర్స్ గ్రహిస్తే మంచిదని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి.
Also Read: Happy Birthday Modi Ji: ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు
Also Read: Wednesday Tv Movies: బుధవారం, Sep17.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే