AAA: దిల్ రాజు అడ్డాలోకి ఐకాన్ స్టార్....
ABN, Publish Date - Jul 10 , 2025 | 03:36 PM
దిల్ రాజు అడ్డాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏసియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో కలిసి జెండా పాతేయబోతున్నాడు. వైజాగ్ లో ఎనిమిది థియేటర్ల మల్టీప్లెక్స్ కు బన్నీ శ్రీకారం చుట్టారు.
ఓ వైపు థియేటర్లకు జనాలు రావడం లేదని నిర్మాతలు వాపోతుంటే... స్టార్ హీరోలు మాత్రం కొలాబరేషన్ లో మల్టిప్లెక్స్ థియేటర్ల నిర్మాణంపై ఆసక్తిచూపుతున్నారు. ఇప్పటికే అలా థియేటర్లను నిర్మించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి వారిని మరిన్ని నగరాల్లోకి విస్తరింప చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చిత్ర నిర్మాణంతో పాటు సినిమాల పంపిణీ కూడా చేస్తుంటారు. అలానే ఆయన పలు సెంటర్స్ లో కొన్ని థియేటర్లను లీజుకు తీసుకుని కొంత కాలంగా నిర్వహిస్తున్నారు కూడా. కానీ తమ సొంత సినిమాలు లేని సమయంలో ఈ థియేటర్ల నిర్వహణకోసం బయటి చిత్రాలను సైతం పంపిణీ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అదేమంత లాభసాటిగా లేకపోవడంతో లీజ్ కు తీసుకున్న థియేటర్లను నిదానంగా తగ్గించుకుంటూ వచ్చేశానని స్వయంగా ఆ మధ్య అల్లు అరవింద్ చెప్పారు. అయితే ఇదే సమయంలో ఆయన తనయుడు అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం సొంత థియేటర్ల నిర్మాణంపై ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ అమీర్ పేటలోని సత్యం థియేటర్స్ ను తీసుకుని, ఆ కాంప్లెక్స్ లో 'ట్రిపుల్ ఎ' పేరుతో అల్లు అర్జున్, ఏసియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ (Sunil Narang) తో కలిసి మల్టీప్లెక్స్ లను నిర్మించాడు. ఇప్పుడు తన థియేటర్ల నిర్మాణాన్ని వైజాగ్ కు విస్తరించే పనిలో పడ్డాడు.
హైదరాబాద్ లో 'ట్రిపుల్ ఎ' మల్టీప్లెక్స్ సక్సెస్ కావడంతో తాజాగ వైజాగ్ లోని ఇన్ ఆర్బిట్ మాల్ లో ఏకంగా ఎనిమిది థియేటర్ల నిర్మాణానికి ఏసియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్, అల్లు అర్జున్ సిద్థమయ్యారు. తాజాగా దీని పనులు మొదలయ్యాయి. శరవేగంగా ఈ ఎనిమిది థియేటర్లను పూర్తి చేసి వచ్చే వేసవి నుండి చిత్ర ప్రదర్శనకు సిద్థం చేయబోతున్నట్టు తెలుస్తోంది. విశేషం ఏమంటే... ఏసియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ ఇప్పటికే మహేశ్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ లను సైతం ఫిల్మ్ ఎగ్జిబిషన్ రంగంలోకి తీసుకొచ్చారు. వీరంతా ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్ల ఓనర్స్ కూడా. కాకపోతే... అల్లు అర్జున్ ఓ అడుగు ముందుకేసి 'దిల్' రాజు అడ్డా అయిన ఉత్తరాంధ్రలో మల్టిప్లెక్స్ థియేటర్ ను నిర్మిస్తున్నాడన్నమాట. గత కొన్నేళ్ళుగా దిల్ రాజు నైజాంతో పాటు ఉత్తరాంధ్ర ఏరియాలోనూ సినిమాలను పంపిణీ చేస్తున్నారు. అలానే అక్కడ అత్యధిక థియేటర్లను లీజ్ కు తీసుకుని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఎనిమిది థియేటర్ల మల్టీప్లెక్స్ ను అల్లు అర్జున్, ఏసియన్ సునీల్ వైజాగ్ నడిబొడ్డున నిర్మిస్తున్నారంటే దిల్ రాజు అడ్డాలో జెండా పాతేయడమేనని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: Janaki Vs State of Kerala: వివాదాల సుడిగుండం నుండి బయటకు...
Also Read: Sir Madam: విజయ్ సేతుపతి, నిత్యా మీనన్.. సర్ మేడమ్ తెలుగు టీజర్