Kotha Loka Movie Review: కొత్తలోక సినిమా సమీక్ష
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:41 PM
మలయాళీ ముద్దుగుమ్మ కళ్యాణీ ప్రియదర్శన్ టైటిల్ రోల్ ప్లే చేసిన లేడీ సూపర్ హీరో మూవీ 'కొత్త లోక 1: చంద్ర'. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందంటే...
సినిమా రంగానికి చెందిన వాళ్ళు 'ఇలాంటి స్టోరీ గతంలో రాలేద'ని చెప్పుకోవడం, 'ఇలాంటి సినిమా ఇండియాలో రాలేద'ని చెప్పడం పరిపాటిగా మారిపోయింది. అలానే లేటెస్ట్ గా విడుదలై 'కొత్త లోక 1: చంద్ర' (Kotha Loka 1: Chandra) ఇండియాలోనే ఫస్ట్ లేడీ సూపర్ హీరో మూవీ అని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో టైటిల్ రోల్ ను కళ్యాణీ ప్రియదర్శన్ (Kalyani Priaydarsan) పోషించగా, దీన్ని మలయాళంలో దుల్కర్ సల్మాన్ (Dulquar Salmaan) నిర్మించాడు. డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఓనమ్ కానుకగా మలయాళంలో ఆగస్ట్ 28వ తేదీ విడుదలైంది. ఇతర భాషల్లో కాస్తంత ఆలస్యంగా 30న రిలీజైంది. మరి కళ్యాణీ ప్రియదర్శన్ నటించిన ఈ లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో మూవీ ఎలా ఉందో చూద్దాం...
కథేమిటంటే...
ఇది నీల అనే గిరిజన బాలిక కథ. రాజుల కాలంలో ఓ తండాలో ఆమె జన్మిస్తుంది. ఆ ప్రాంతపు రాజు అహంకారంతో నీల ఉండే గూడెం మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. దాంతో నీల కుటుంబం దగ్గరలోని గుహలోకి వెళ్ల తలదాచుకుంటుంది. ఆ లోపల తలతెగిపడిన అమ్మవారి విగ్రహాన్ని నీల చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నీల కు అతీంద్రియ శక్తులు వస్తాయి. ఆమె ఇమ్మోర్టల్ గా మారిపోతుంది. తన కూతురు రక్తం తాగే యక్షిణి అని గుర్తించిన నీల తల్లి ఆమెను గూడెం వదలి పారిపొమ్మని చెబుతుంది. అలా నీల కొన్ని వందల సంవత్సరాల పాటు మరణం లేకుండానే జీవిస్తుంటుంది. అయితే ఆమెకు తనలాంటి వారే ఈ లోకంలో మరికొందరు ఉన్నారని తెలుస్తుంది. అందులోని మంచివారి సాంగత్యంతో తల్లి చెప్పనట్టు మంచి పనులు చేస్తూ, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అలా ఒక కార్యం నిమిత్తం ఆమె చంద్ర పేరుతో బెంగళూరులోకి అడుగు పెడుతుంది. అక్కడో బేకరిలో పనిచేస్తుంటుంది. అదే సమయంలో ఆ నగరంలో పొలిటీషిన్స్, పోలీస్ ఆఫీసర్స్ అండతో ఓ అండర్ వరల్డ్ మాఫియా ఆర్గాన్ ట్రాఫికింగ్ చేస్తుంటుంది. అమాయకులను కిడ్నాప్ చేసి చంపేస్తుంటుంది. తన కళ్ళ ముందు జరుగుతున్న ఈ అక్రమాలను సూపర్ పవర్స్ ఉన్న చంద్ర ఎలా ఎదుర్కొంది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలు ఏమిటనేది? మిగతా కథ.
ఎలా ఉందంటే...
సహజంగా హాలీవుడ్ (Hollywood) సినిమాల్లో వాంపైర్స్ గా అందమైన అమ్మాయిలను చూపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ వారి నిజ రూపం బయటపడుతూ ఉంటుంది. అయితే... ఇందులో చంద్రగా మారిన నీల ఎప్పుడూ అందంగానే ఉంటుంది. అప్పుడప్పుడూ కోర పళ్ళు మాత్రం బయటకు వస్తుంటాయి. కనిపించిన ప్రతి ఒక్కరి రక్తాన్ని తాగేసే రక్తపిశాచి కాదు ఈమె... బ్లడ్ బ్యాంక్ నుండి 'ఓ పాజిటివ్' బ్లడ్ తెప్పించుకుని, ఫ్రిజ్ లో భద్రపర్చుకుని, అవసరమైనప్పుడు తాగుతుందన్నమాట! అలాంటి చంద్ర జీవితంలోకి ప్రవేశించిన సన్నీ (నస్లెన్) జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? చంద్ర గురించి ఆరా తీయాలని అనుకున్న పోలీస్ ఆఫీసర్ గతి ఏమైందన్నది మిగతా సినిమా.
దర్శకుడు డొమినిక్ అరుణ్, నిర్మాత దుల్కర్ సల్మాన్ తీయాలనుకుంటున్న 'లోక 1: చంద్ర' యూనివర్శ్ లో ఇది తొలి భాగం మాత్రమే. అందువల్ల జవాబు దొరకని ప్రశ్నలు చాలానే ఉంటాయి. ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడితే... మిగిలిన భాగాలను తెరకెక్కించినప్పుడు ఈ ప్రశ్నలకు జవాబు దొరికే ఆస్కారం ఉంటుంది. ఈ మూవీ ప్రథమార్ధం ఆసక్తికరంగా ఉన్నా... ద్వితీయార్థం అంతా కంగాళీగా సాగింది. సెకండ్ హాఫ్ లో టొవినో థామస్ ఎంట్రీ, సౌబిన్ షాహిర్ గెస్ట్ రోల్, క్లయిమాక్స్ లో దుల్కర్ సల్మాన్ కనిపించడం... ఇవి మలయాళీ ప్రేక్షకులకు కొంత ఆనందాన్ని కలిగించొచ్చు కానీ తెలుగువాళ్ళకు వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలాంటి అదనపు ఉత్సాహాన్ని ఇవ్వదు. రొటీన్ చిత్రాలకు కాస్తంత భిన్నంగా ఉన్నదన్న మాట తప్పితే... 'కొత్త లోక'లో చెప్పుకోదగ్గ కొత్తదనం ఏమీ లేదు.
నటీనటుల విషయానికి వస్తే కళ్యాణి ప్రియదర్శన్ టైటిల్ రోల్ ను సమర్థవంతంగా పోషించింది. యాక్షన్ సీన్స్ ఈజీగా చేసింది. మానసిక సంఘర్షణకు గురయ్యే సన్నివేశాలను బాగా ప్లే చేసింది. ఆమె బోయ్ ఫ్రెండ్ గా 'ప్రేమలు' ఫేమ్ నస్లెన్ కె గఫూర్ నటించాడు. అతను, అతని మిత్రబృందం ద్వారా ప్రేక్షకులకు చెప్పుకోదగ్గ వినోదం లభించింది. పోలీస్ ఆఫీసర్ గా శాండి బాగా యాక్ట్ చేశాడు. ఇతర ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులు తెలుగువారికి పరిచయం లేని వారే. ప్రభాస్ 'కల్కి'లో కీ-రోల్ ప్లే చేసిన అన్నా బెన్ ఇందులో సన్నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసింది. ఈ సినిమా మెయిన్ హైలైట్ యానిక్ బెన్ యాక్షన్ కొరియోగ్రఫీ, జేక్స్ బెజోయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. దుల్కర్ సల్మాన్ తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమాను తెలుగులో సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. అయితే సినిమా పబ్లిసిటీలో జరిగినట్టే... తెలుగులో వచ్చిన టైటిల్ కార్డ్స్ లోనూ బోలెడన్ని తప్పులు దొర్లాయి. వాటిని గురించి మేకర్స్ కు ఇసుమంత కూడా పట్టింపులేదనేది అర్థమైంది. టెక్నికల్ గా బాగున్నా... కథంతా కంగాళీగా సాగడంతో రెగ్యులర్ మూవీ లవర్ 'కొత్త లోక'ను ఎంజాయ్ చేయడం కష్టమే!
ట్యాగ్ లైన్: కంగాళీ 'కొత్త లోక'!
రేటింగ్: 2.5/5
Also Read: Tribanadhari Barbarik Review: 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా మెప్పించిందా...
Also Read: Kanya Kumari: కన్యాకుమారి మూవీ రివ్యూ
Also Read: Sundarakanda Review: నారా రోహిత్ 'సుందరకాండ' మెప్పించిందా