Kaantha Review: 'కాంత' మూవీ రివ్యూ
ABN, Publish Date - Nov 14 , 2025 | 12:16 PM
దుల్కర్ సల్మాన్ నిర్మించిన 'లోక' చిత్రం దీపావళికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అతను నటించి, నిర్మించిన మరో సినిమా 'కాంత' తాజాగా జనం ముందుకు వచ్చింది. రానాతో కలిసి దుల్కర్ ప్రొడ్యూస్ చేసిన 'కాంత' ఎలా ఉందంటే...
'మహానటి (Mahanati), సీతారామం (Sita Ramam), లక్కీ భాస్కర్' (Lucky Bhaskhar) చిత్రాలతో తెలుగువారి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). గత యేడాది దీపావళికి వచ్చిన 'లక్కీ భాస్కర్' తర్వాత దుల్కర్ నటించిన మరే చిత్రమూ ఇంతవరకూ విడుదల కాలేదు. యేడాది తర్వాత అతని సినిమా 'కాంత' (Kaantha) జనం ముందుకు వచ్చింది. ఈ తమిళ చిత్రాన్ని దుల్కర్ తో కలిసి రానా దగ్గుబాటి (Rana Daggubati) నిర్మించాడు, తనూ నటించాడు. తెలుగులోనూ డబ్ అయిన 'కాంత' మూవీ శుక్రవారం విడుదలైంది. 1950 నాటి సినీ నేపథ్యంలో తెరకెక్కిన 'కాంత' ఎలా ఉందో తెలుసుకుందాం.
'కాంత' సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ బయటకు రాగానే ఇది తమిళనాడుకు చెందిన ఒకప్పటి స్టార్ హీరో ఎం. కె. త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అనే ప్రచారం జరిగింది. తమిళ సినీ ప్రముఖుల జీవితాల నుండి స్ఫూర్తి పొంది ఈ కథను రాసుకున్నానని ఈ చిత్ర దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ చెప్పినా జనాలు నమ్మలేదు. త్యాగరాజ భాగవతార్ వారసులైతే సినిమా విడుదలకు ముందు దీన్ని నిలుపుచేయాలంటూ కోర్టు తలుపు తట్టారు. అయితే ఈ విన్నపాలు సినిమా విడుదలను ఆపలేకపోయాయి. మూవీ విడుదలైంది. దర్శకుడు చెప్పినట్టుగా ఇది ఒకరి బయోపిక్ కాదు... తమిళ సినిమా రంగంలో యాభై, అరవై యేళ్ళ నాడు జరిగిన కొన్ని సంఘటనల సమాహారం.
కథ విషయానికి వస్తే దర్శకుడు అయ్య (సముతిరకని Samuthirakani) అనాథ అయిన టి.కె. మహదేవన్ (దుల్కర్ సల్మాన్) ను స్టార్ హీరోగా తీర్చిదిద్దుతాడు. అతను తప్పటడులు వేసిన సమయంలో పక్కనే ఉండి మందలిస్తాడు. స్టార్ హీరోగా ఎదిగినా... తనను అయ్య తన చెప్పుచేతల్లో ఉంచుకోవడాన్ని మహదేవన్ సహించలేకపోతాడు. అదే సమయంలో అయ్య తన తల్లి విషాద జీవిత గాథను 'శాంత' పేరుతో తెరకెక్కించాలని చూస్తాడు. కానీ సెట్స్ లో మహదేవన్, అయ్య మధ్య వచ్చిన గొడవల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. మోడ్రన్ స్టూడియోస్ అధినేత వారసుడు చొరవ చూపడంతో ఆగిన 'శాంత' మూవీ మళ్ళీ ఆరేడేళ్ళ తర్వాత సెట్స్ పైకి వస్తుంది. అయితే ఈసారి హీరో మహదేవన్ ఓ కండీషన్ పెడతాడు. తన స్టార్ డమ్ కు తగ్గట్టుగా ఈ సినిమా క్లయిమాక్స్ మార్చాలంటాడు. సినిమా పేరు శాంత కాకుండా 'కాంత'గా పెట్టాలంటాడు. అయ్య కేవలం సెట్స్ మీద ఉంటాడు తప్పితే, సినిమాను తానే డైరెక్ట్ చేస్తానని మహదేవన్ చెబుతాడు. మూవీ రీ-ఓపెన్ అయిన తర్వాత అయ్య శిష్యురాలైన కుమారి (భాగ్యశ్రీ బోర్సే Bhagyashri Borse) హీరోయిన్ గా ఎంపికవుతుంది. అయ్య, మహదేవన్ మధ్య కుమారి ఎలా నలిగిపోయింది? ఇగోస్ ను పక్కన పెట్టి 'కాంత' సినిమాను అయ్య, మహదేవన్ పూర్తి చేశారా? క్లయిమాక్స్ రోజు జరిగిన హత్యకు కారకులెవరు? పోలీస్ అధికారి ఫీనిక్స్ (రానా దగ్గుబాటి) హంతకులను పట్టుకోలిగాడా? అనేది మిగతా కథ.
'కాంత' సినిమా ఆసక్తికరంగా మొదలైంది. నట చక్రవర్తిగా ఎదిగిన ఓ స్టార్ కు, పరాజయాలతో సతమతమౌతున్న ఓ సీనియర్ డైరెక్టర్ కు మధ్య ఉండే ఇగో క్లాష్ ను దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ చక్కగా తెర మీద చూపించాడు. నష్టాల ఊబిలో మునిగిపోతున్న స్టూడియోను నిలబెట్టడానికి ప్రయత్నించే స్టూడియో అధినేత ఒకవైపు, అయ్య ఆదరణతో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని సంబరపడే కుమారి మరోవైపు, నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలో అయ్య, మహదేవన్ మధ్య వాదవివాదాలు మరోవైపు... ఇలా సినిమా ఫస్ట్ హాఫ్ చకచకా సాగిపోయింది. అయితే... ఈ సమయంలో వచ్చే కొన్ని సన్నివేశాలు 'మహానటి' సినిమాను గుర్తు చేస్తాయి. పెళ్ళైన హీరో... హీరోయిన్ ను సెట్స్ లో ఫ్లర్ట్ చేస్తుంటే... 'మహానటి'లో జెమినీ గణేశన్ పాత్రే గుర్తొస్తుంది. కథ రంజుగా సాగుతున్న సమయంలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కసారిగా ఆడియెన్స్ ను అలర్ట్ చేస్తుంది. ఓపెనింగ్ షాట్ ను ఇంటర్వెల్ లో రిపీట్ చేసి సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టిన డైరెక్టర్... ఆ మర్డర్ కు కారకుడు ఎవరు? హంతకుడి మోటివ్ ఏమిటీ అనే అంశం మీద సెకండ్ హాఫ్ ను నడిపాడు.
సినిమా షూటింగ్ తో కళకళలాడిన ఫ్లోర్ ను సెకండ్ హాఫ్ లో ఒక్కసారిగా పోలీస్ ఇంటరాగేషన్ హాల్ గా మార్చేయడం కాస్తంత అనీజీకి గురిచేసే అంశమే. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒక్కొక్కరిని ఇంటరాగేట్ చేయడం, వారి నుండి వివరాలు సేకరించే క్రమంలో ఫీనిక్స్ చేసే అతి... ఆడియెన్స్ ను ఇరిటేటింగ్ గురిచేసేలా ఉంది. అనుమానితులు చెప్పే విషయాలను, వాటిని ఫీనిక్స్ విశ్లేషించే తీరు, హంతకుడి మోటివ్ ఏమై ఉండొచ్చోనని రకరకాలుగా ఊహించుకోవడం ఇవన్నీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నాయి. కుమారికి జరగాల్సిన అన్యాయం జరిగిపోయిన తర్వాత ఆ హత్య ఎవరు చేస్తే ఏం లాభం అనే పరిస్థితికి ప్రేక్షకుడు వచ్చేస్తాడు. అయ్య, మహదేవన్ మధ్య ఇగో క్లాష్ కు బలమైన కారణాన్ని చూపించలేకపోవడం, హంతకుడు దర్జాగా బయటకు వచ్చేయడం ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తాయి.
నటీనటుల విషయంలో ఎలాంటి వంక పెట్టడానికి వీలులేదు. దుల్కర్ సల్మాన్... మహదేవన్ పాత్రకు జీవం పోశాడు. అందులోని షేడ్స్ ను అద్భుతంగా పోషించాడు. చాలా సన్నివేశాలలో 'మహానటి' ఛాయలు కనిపించినా... నూరుశాతం ఎఫర్ట్ ను దుల్కర్ కనబరిచాడు. సముతిరకని దుల్కర్ తో పోటా పోటీగా నటించి మెప్పించాడు. అతని క్యారెక్టరైజేషన్ కాస్తంత భిన్నంగా ఉండి ఊహకు అందకుండా సాగింది. భాగ్యశ్రీ బోర్సే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను ఇచ్చింది. ప్రథమార్థంలో ఈ ముగ్గురూ పోటాపోటీగా నటిస్తే... ద్వితీయార్థంలో వీరందరినీ పక్కన పెట్టేసే ప్రయత్నం రానా చేశాడు. అతని ఎంట్రీ కాస్తంత ఆలస్యంగా జరిగిన ద్వితీయార్థాన్ని భుజానకెత్తుకుని తీసుకెళ్ళాడు. అయితే ఫస్ట్ హాఫ్ ను నల్లేరు మీద బండిలా నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంకు వచ్చే సరికీ తడబడ్డాడు. ఇన్వెస్టిగేటివ్ పార్ట్ ను ఆసక్తికరంగా మలచడంలో విఫలం అయ్యాడు. దాంతో 'కాంత' మూవీ గ్రాఫ్ కిందకు పడిపోయింది. ఇతర ప్రధాన పాత్రలను రవీంద్ర విజయ్, నెళల్ గళ్ రవి, భగవతి పెరుమాల్, గాయత్రి శంకర్, వాయపురి తదితరులు పోషించారు. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఆర్ట్ వర్క్ సూపర్. 1950 నాటి వాతావారణాన్ని వెండితెరపై అందరూ కలిసి చక్కగా ఆవిష్కరించారు. అయితే నటీనటులు అద్భుతంగా నటించినా, కథను ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయిన కారణంగా 'కాంత' ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తుందనే చెప్పాలి.
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: నిరాశపర్చిన 'కాంత'