KAANTHA: దుల్కర్ సల్మాన్ సినిమాపై.. నీలి నీడలు...

ABN , Publish Date - Nov 12 , 2025 | 03:20 PM

దుల్కర్ సల్మాన్, రానా నటించి, నిర్మించిన 'కాంత' సినిమా నవంబర్ 14న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇది తన తాతయ్య ఎం.కె. త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అని, ఈ సినిమా ద్వారా ఆయన పరువుకు నిర్మాతలు భంగం కలిగించబోతున్నారని మనవడు కోర్టును ఆశ్రయించాడు.

Kaantha Movie

గత యేడాది దీపావళికి దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) మూవీ 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar) విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత అతని నుండి మరే సినిమా రాలేదు. మళ్ళీ ఇప్పుడు యేడాది తర్వాత పాన్ ఇండియా మూవీ 'కాంత' (Kaantha) లో దుల్కర్ సల్మాన్ నటించాడు. విశేషం ఏమంటే ఈ సినిమాకు అతను నిర్మాత కూడా. ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన రానా (Rana) సైతం 'కాంత' నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తున్న 'కాంత'... సినిమా నేపథ్యంలో తెరకెక్కింది. ఓ నటుడికి, అతన్ని స్టార్ చేసిన దర్శకుడికి మధ్య ఇగో క్లాష్ వచ్చినప్పుడు వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశం చుట్టూ 'కాంత' తిరుగుతుంది. 1950ల నాటి కథతో ఈ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించాడు. ఈ నెల 14న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడీ సినిమా చుట్టూ కొత్త వివాదం ముసురుకుంది. ఈ సినిమాను తన తాతయ్య, ప్రముఖ నటుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ (M.K. Thyagaraja Bhagavathar) జీవితం ఆధారంగా తీశారని, ఆయన పేరు ప్రఖ్యాతులను కించపరిచే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని, తమ పరువుకు భంగం వాటిల్లే ఈ సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలని కోరుతూ ఆయన మనవడు చెన్నయ్ లో కోర్ట్ తలుపు తట్టాడు.

1950లలో త్యాగరాజ భాగవతార్ పలు విజయవంతమైన సినిమాలలో నటించాడు. అయితే ఓ హత్య కేసులో ఆయన దోషిగా జైలు జీవితాన్ని గడిపి ఆ తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. జైలుకు వెళ్ళడానికి ముందు ఆదరించిన జనాలు... ఆ తర్వాత ఆయన్ని పట్టించుకోలేదు. సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఓ రకంగా జీవితంపై వైరాగ్యం చెంది, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ, సంగీత విభావరులలో పాల్గొంటూ త్యాగరాజ భగవతార్ కాలం గడిపాడు. అయితే ఊహించని విధంగా అనారోగ్యానికి గురై యాభై సంవత్సరాల లోపే కన్నుమూశాడు. ఎంతోమంది ఆయన దానధర్మాలు చేశాడని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన జీవితాన్నే 'కాంత'గా తెరకెక్కించారన్నది ఆయన మనవడి ఆరోపణ.

ఈ సినిమా పబ్లిసిటీ సమయంలో దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ 'కాంత' ఏ ఒక్కరి బయోపిక్ కాదని, తన దృష్టికి వచ్చిన సినిమావాళ్ళ కథలతో తానీ సినిమాను తెరకెక్కించనని స్పష్టం చేశారు. అయితే... మద్రాస్ హైకోర్ట్ త్యాగరాజ భాగవతార్ మనవడి ఫిర్యాదును విచారణకు స్వీకరించి, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా చిత్రబృందాన్ని కోరింది. తాజా రానా సైతం ఇది ఎవరి బయోపిక్ కాదని వివరణ ఇచ్చాడు. మరి వీటిని పరిశీలించిన కోర్ట్... మూవీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

Updated Date - Nov 12 , 2025 | 04:47 PM