Deepika Padukone.: అల్లు అర్జున్ సినిమానే కారణమా...
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:48 PM
'కల్కి' సీక్వెల్ నుండి దీపికా పదుకొణేను తప్పించడంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పందించాడు. అల్లు అర్జున్, అట్లీ మూవీకి దీపికా పదుకొణే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే 'కల్కి' సీక్వెల్ నుండి తప్పించారనే ప్రచారం ఫిల్మ్ నగర్ లో జరుగుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే పాపులర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గముంటున్న విషయం తెలిసిందే. ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో నటించడానికి దీపికా తొలుత అంగీకరించింది, కథంతా విని, సినిమాకు సైన్ చేసింది. ఆ తర్వాత దీపికా కొన్ని షరతులు పెట్టడంతో సందీప్ రెడ్డి వంగ కు మండింది. దాంతో ఆమెకు కటీఫ్ చెప్పేశాడు. తన సినిమాలోంచి ఆమెను తీసేశాడు. దీపిక గొంతెమ్మ కోరికలను తీర్చడం ఎవరి వల్లా కాదని సందీప్ వంగ అండ్ బ్యాచ్ సోషల్ మీడియాలో కోడై కూసింది. అయితే అదే సమయంలో దీపికా తరఫున వకాల్తా పుచ్చుకుని కూడా కొందరు మాట్లాడారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో సినిమా 'కల్కి 2898 ఎ.డి.' సీక్వెల్ నుండి కూడా దీపికా పదుకునేను తప్పించారు మేకర్స్. ఆ విషయాన్ని తెలియచేస్తూ వాళ్ళు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దానిని సందీప్ రీ-పోస్ట్ చేస్తూ... లాఫింగ్ ఎమోజీని పెట్టాడు. నవ్వీ నవ్వీ తట్టుకోలేకపోతున్న భావనను ఈ ఎమోజీ ద్వారా వ్యక్తం చేశాడు సందీప్ రెడ్డి వంగ.
ఇదిలా ఉంటే... 'కల్కి 2898 ఎ.డి.' సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది. అయితే ఇంత ఆలస్యంగా ఇప్పుడు ఈ సీక్వెల్ లో దీపికా ఉండదని మేకర్స్ చెప్పడం వెనక ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. నిజంగానే మొదటి భాగం షూటింగ్ సమయంలోనే దీపికా పదుకొనేతో ఏవైనా విభేదాలు వచ్చి ఉంటే... అది విడుదల అయిపోగానే చెప్పి ఉండాల్సింది కదా అని అంటున్నారు. దీపికను వదిలించుకోవడానికి చాలానే కారణాలు ఉన్నాయనే మాట కూడా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. కల్కి విడుదల సమయంలో దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ కావడంతో మేకర్స్ ఆశించిన స్థాయిలో ఆమె ప్రచారంలో పాల్గొనలేదు. అలానే రేపు ఈ సినిమా షూటింగ్ సమయంలో కావచ్చు, రిలీజ్ టైమ్ లో కావచ్చు ఆమె కోరినంత సమయాన్ని ఇస్తుందనే హామీ ఏదీ మేకర్స్ కు లభించనట్టుగా లేదు. అందుకే నిబద్ధత మాత్రమే ఇలాంటి సినిమాలకు సరిపోదని వారు తమ ప్రకటనలో తెలియచేశారని కొందరు అంటున్నారు. అంటే పరోక్షంగా దీపికా విషయంలో వారి ఏ మాత్రం సంతృప్తిగా లేరని తెలుస్తోంది.
ప్రస్తుతం దీపికా పదుకొణే... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ మూవీ చేస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి కావచ్చిందట. ఇదే యేడాది డిసెంబర్ లో దీనిని పట్టాలెక్కించాలని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే అదే సమయంలో 'కల్కి' సీక్వెల్ కూడా చేయాలని నాగ అశ్విన్ అనుకుంటున్నాడట. ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ పైకి వెళుతుండటంతో డేట్స్ ను దీపికా అడ్వస్ట్ చేయలేక చేతులెత్తేసిందని అంటున్నారు. ఆమె అల్లు అర్జున్ మూవీకి ప్రాధాన్యం ఇస్తుండటంతో... తప్పని పరిస్థితుల్లో 'కల్కి' సీక్వెల్ నుండి తొలగించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయమై దీపికా పదుకొణే తన వర్షన్ ఏం చెబుతుందో చూడాలి.
Also Read: Nandamuri Balakrishna: చివరి పాట చిత్రీకరణలో 'అఖండ -2'
Also Read: Trupti Ravindra: హీరోయిన్‌గా.. మరాఠీ స్టేజ్ ఆర్టిస్ట్