Sandeep Reddy Vanga: ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలకు అందుకే వెళ్లను

ABN , First Publish Date - 2023-11-26T19:46:40+05:30 IST

‘అర్జున్ రెడ్డి’తో తన సత్తా చాటి.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో‌ని డైరెక్ట్ చేసే రేంజ్‌కి చేరుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. త్వరలో ఆయన ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తన ఎమోషనల్ సపోర్ట్ ఎవరో సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు.

Sandeep Reddy Vanga: ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలకు అందుకే వెళ్లను
Sandeep Reddy Vanga

‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)తో తన సత్తా చాటి.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో‌ని డైరెక్ట్ చేసే రేంజ్‌కి చేరుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). త్వరలో ఆయన ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘యానిమల్’ (Animal) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. మొత్తంగా 5 భాషల్లో ఏకకాలంలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌తో యూనిట్ అంతా బిజీబిజీగా ఉంది. టీమ్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటూనే.. మధ్యమధ్యలో స్పెషల్‌గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సందీప్ రెడ్డి వంగా. ఇక ఆయన తీసిన సినిమాలో ఎమోషన్స్ స్థాయి ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియంది కాదు. ఎన్నో భావోద్వేగాలతో సినిమాలు తీసే మీకు ఎమోషనల్‌ సపోర్ట్‌ (Emotional Support) ఎవరు? అని అంటే సందీప్ ఏం చెప్పారంటే..

‘‘మా అమ్మ(సుజాత) (Sujatha) నాకు ఒకప్పుడు ఎమోషనల్‌ సపోర్ట్‌. 2019లో అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) విడుదల అయిన రెండు నెలల తర్వాత తనకు క్యాన్సర్‌ అని తెలిసింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా జీవితం ఆగిపోయిందనుకున్నా! ఎందుకంటే మరణానికి సంబంధించిన ఎమోషన్స్‌ నన్ను భయపెట్టేవి. నా స్నేహితుల కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోయినా- అంత్యక్రియలకు వెళ్లేవాడిని కాదు. కొద్దికాలం పోయిన తర్వాత వారిని ఓదార్చటానికి వెళ్లేవాడిని. అలాంటి నాకు- అమ్మకు క్యాన్సర్‌ అనే వార్త ఒక శరాఘాతం. ‘కబీర్‌ సింగ్‌’ విడుదల అయిన రెండు నెలలకు అమ్మ చనిపోయింది. నా జీవితంలో అతి పెద్ద విషాదమది.


Animal-2.jpg

నా ఉద్దేశంలో- ‘లైఫ్‌ మూవ్స్‌ ఆన్‌’ (Life Moves On) అని ఎవడు అన్నాడో వాడు చాలా గొప్పవాడు. అమ్మ లేకపోతే జీవితం ఏమయిపోతుంది అనుకున్నా. కానీ జీవితం నడుస్తూనే ఉంది. రోజు తింటున్నా. ఉద్యోగం చేసుకుంటున్నా.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు - ‘అమ్మ లేకుండానే జీవితం నడుస్తోంది.. ఈ సమస్య ఒక లెక్క..’ అనుకుంటూ ఉంటా! ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అమ్మ చనిపోయిన తర్వాతే- నాకు జీవితం అంటే ఒక ఐడియా వచ్చింది. అప్పటి వరకు అన్నింటికీ అమ్మనాన్నలపైనే ఆధారపడేవాడిని. నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌ని. అమ్మ- ‘నువ్వు అంత ఎమోషనల్‌ అయితే ఎలా బతుకుతావురా?’ అనేది. తనకు నేను ఈ సమాజంలో ఇమడలేనని.. బతకలేననే భయం ఉండేది’’ అని సందీప్ వంగా తెలిపారు.

Updated Date - 2023-11-26T19:46:45+05:30 IST