Dhanush Sister: ఫాలో... ఫాలో... ఫాలో అవుతున్న మృణాల్
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:55 PM
తమిళ స్టార్ హీరో ధనుష్ తో తాను డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల పట్ల మృణాల్ ఠాకూర్ అసహనం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఆమె చర్యలు సరికొత్త సందేహాలకు తావిస్తున్నాయి.
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మధ్య సమ్ థింగ్ గోయింగ్ ఆన్ అనే విషయంపై అటు బాలీవుడ్ మీడియా, ఇటు కోలీవుడ్ మీడియా కోడై కూస్తున్నాయి. ఇలా తమను టార్గెట్ చేయడం మృణాల్ కు అస్సలు నచ్చడం లేదు. అజయ్ దేవ్ గన్ (Ajay Devgn) సరసన మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ -2' (Son of Sardaar -2) మూవీ ఆగస్ట్ 1న విడుదలైంది. అయితే ఈ మధ్య కాలంలో అజయ్ దేవ్ గన్ నటించిన సినిమాల్లో అతి తక్కువ గ్రాస్ ను వసూలు చేసిన సినిమా ఇదే! రొటీన్ కామెడీతో సాగిన ఈ సినిమాకు విడుదలకు ముందు కూడా ఎలాంటి హైప్ రాలేదు. అజయ్ దేవ్ గన్ గతంలో నటించిన ఫ్రాంచైజ్ మూవీస్ స్థాయిలో ఈ సినిమా అస్సలు లేదని ట్రేడ్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. వంద కోట్ల సంగతి దేవుడెరుగు.. అసలు రూ. 50 కోట్ల గ్రాస్ ను కూడా ఈ సినిమా వసూలు చేయలేదని వారు చెబుతున్నారు.
ఓ పక్క ఈ పరాజయం తాలుకు చికాకులో మృణాల్ ఉంటే... ధనుష్ తో ఆమె డేటింగ్ చేస్తోందంటూ మీడియాలో వస్తున్న వార్తలు చికాకు పుట్టిస్తున్నాయి. అందుకే ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, 'ప్రస్తుతం తాను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనని, ఎవరితోనూ డేటింగ్ చేయడం లేద'ని స్పష్టం చేసింది. ఇంకా తాను సినిమా రంగంలో సాధించాల్సింది చాలా ఉందని తెలిపింది. అలాంటిది ఏదైనా ఉంటే పబ్లిక్ గా చెబుతానని అనేసింది. అదే సమయంలో తన వ్యక్తిగత విషయాలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం మీడియాకు ఏముందని ప్రశ్నించింది. ధనుష్ తో మృణాల్ ఓ సినిమాలో నటించబోతోందనే వార్త కూడా చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, 'అధికారికంగా ఏదైనా కన్ ఫర్మ్ అయితే తానే చెబుతానని, ఊహాగానాలతో కథలు అల్లవద్ద'ని మీడియాకు హితబోధ చేసింది. కొత్త ప్రాజెక్ట్స్ గురించి అయినా, వ్యక్తిగత వివరాలను గురించి అయినా తాను చెప్పకముందే చిలవలు పలవలుగా వార్తలు రాయడం సరికాదని వాపోయింది. మనసుకు తోచింది రాయడం కాకుండా అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తే బాగుంటుందని చెప్పింది.
చిత్రం ఏమంటే... ధనుష్ తో అనుబంధం గురించి చెప్పడానికి ఆసక్తి చూపించని మృణాల్ ఠాకూర్ అతని సిస్టర్స్ ఇద్దరిని ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతోంది. ఇదే బాలీవుడ్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ధనుష్ కు అతని సిస్టర్స్ కు మధ్య చాలా బలమైన బంధం ఉంది. అతని చెల్లెళ్ళు కార్తిక కార్తిక్, విమల్ గీత ఇద్దరూ కూడా డాక్టర్సే. మృణాల్ వీరిద్దరినీ ఇన్ స్టాలో ఫాలో అవుతుంటే... ఆ ఇద్దరూ కూడా ఆమెనూ తిరిగి ఫాలో అవుతున్నారు. వృతిరీత్యా డాక్టర్స్ అయినా... వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. ఇక ధనుష్ ఈ మధ్య మృణాల్ బర్త్ డే పార్టీలో పాల్గొనడంతో పాటు, 'సన్ ఆఫ్ సర్దార్ -2' ప్రీమియర్ షోలో మృణాల్ తో కనిపించడమే ఈ పుకార్లకు తెర తీసింది. అలానే మృణాల్ తెలుగు సినిమాల్లోనూ వరుసగా నటిస్తోంది. ఆమె యాక్ట్ చేస్తున్న 'డెకాయిట్' ప్రస్తుతం సెట్స్ పై ఉంది.త్వరలో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ధనుష్ తో ప్రేమాయణం గురించి మీడియాలో చర్చలు జరగడం ఆమెను ఇబ్బందికి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: Chiranjeevi: మనం చేసిన.. మంచే మాట్లాడుతుంది
Also Read: Vijay Deverakonda: టైమ్ పాస్.. ప్రశ్నలు అడగొద్దు!