Chiranjeevi: మనం చేసిన.. మంచే మాట్లాడుతుంది

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:44 PM

తన గురించి సామాజిక మాధ్యమాల్లో అదే పనిగా ట్రోల్స్ చేసినా తాను స్పందించనని తను చేసిన పనులు, మంచి మాత్రమే మాట్లాడుతుంటాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

Chiranjeevi

తన గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా, సామాజిక మాధ్యమాల్లో అదే పనిగా ట్రోల్స్ చేసినా తాను స్పందించనని తను చేసిన పనులు, మంచి మాత్రమే మాట్లాడుతుంటాయని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అన్నారు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బాంక్ (Chiranjeevi Eye & Blood Bank), ఫీనిక్స్ పౌండేషన్ (Phoenix Foundation) సంయుక్తంగా ప్రారంభించిన మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ (Mega Blood Donation Drive)కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. హీరోయిన్ సంయుక్తా మీనన్, తేజ సజ్జా వంటి నటులు సైతం ఈ ప్రొగ్రాంకు హజరయ్యారు. ఈ సందర్భంగా యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja) బ్లడ్ డొనేట్ చేయడం విశేషం.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. రక్తదానం గురించి చెప్పగానే తన పేరు గుర్తుకొస్తున్నదంటే అది తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. గతంలో.. ఓ జర్నలిస్ట్ రాసిన కథనం వల్ల బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందని,అయితే ఇంత వరకు ఆ విలేఖరి ఎవరో మాత్రం తనకు తెలియలేదన్నారు. తేజా సజ్జా వంటి యువ నటులు రక్తదానానికి ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. బిడ్డ లాంటి తేజా.. బ్లడ్ డొనేట్ చేసినందుకు థాంక్స్ అని అన్నారు. తనపై అభిమానంతో ఇక్కడే గాక ఇతర ప్రాంతాలు, దేశాల్లోనూ రక్తదానం చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు చిరు.


అయితే.. తను రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ పలువురు తనపై ఆకారణంగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. ఇటీవల ఓ నాయకుడు అకారణంగా తనపై విమర్శలు చేస్తే ఆ ప్రాంతానికే చెందిన మహిళ ఎదురు తిరిగి చిరంజీవిని అన్ని మాటలు ఎలా అనగలుగుతున్నారంటూ నిలతీసిందని, ఆ వీడియో చూసి సదరు మహిళ గురించి వాకబు చేస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆవిడ బిడ్డ ప్రాణం నిలబడిందని తెలిసిందన్నారు. ఇలాంటి న్యూస్ తెలిసినపుడు తన వల్ల కొన్ని ప్రరాణాలు నిలబడుతున్నాయనే ఆనందంతో హృదయం ఉప్పొంగి పోతుంది’ అంటూ భావోద్వేగం చెందారు.

అలాంటి రాజకీయ నాయకులు తిరిగి మళ్లీ తనపై ఎలాంటి విమర్శలు చేయలేరని, ఇప్పుడైనా, ఎప్పుడైనా మనం చేసే పనులే మాట్లాడుతుంటాయని, సోషల్ మీడియాలో వచ్చే కువిమర్శలను పట్టించుకోనని, అసలు తనకు అంత సమయం కూడా ఉండదంటూ అభిమానులే తన సర్వస్వం అని స్పష్టం చేశారు. ఫియోనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చుక్కపల్లి శంకరరావు శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేయటానికి పలువురు పోటీపడి క్యూ కట్టడం విశేషం. ఇదే ఈవెంట్ లో రక్తదాతలకు చిరు చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందచేశారు ఫియోనిక్స్ ఛైర్మన్ చుక్కపల్లి సురేశ్. ఈ కార్యక్రమంలో చుక్కపల్లి అవినాశ్, చుక్కపల్లి ఆకాశ్, చుక్కపల్లి మధుమతి, డాక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 01:45 PM