తొలి భారతీయ లేడీ సూపర్ హీరో నిరూప రాయ్...
ABN, Publish Date - Sep 01 , 2025 | 06:23 PM
సినిమా జనం 'ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్' అనే వాక్యాన్ని భలేగా ఉపయోగిస్తుంటారు. తాము వైవిధ్యం అనుకొన్నది అంతకు ముందు లోకంలోనే లేదన్న భ్రాంతిలో ఉంటారు వారు. అంతేకాదు ఈ జానర్ లో ఇదే మొదటిసారి అంటూ టముకు వేస్తూ ఉంటారు.
ఈ మధ్యే విడుదలైన అనువాద చిత్రం 'కొత్త లోక' (Kotha Loka) సినిమాను మలయాళంలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో మూవీగా ప్రచారం చేశారు దర్శక నిర్మాతలు. సదరు చిత్ర మేకర్స్ సరిగానే సెలవిచ్చారు. కానీ, కొందరు ఇండియాలోనే 'కొత్త లోక'తో ఫస్ట్ లేడీ సూపర్ హీరో మూవీ వెలుగు చూసినట్టు చెప్పుకుంటున్నారు. నిజానికి 1935ల్లోనే లేడీ సూపర్ హీరో మూవీస్ వెలుగు చూశాయి. ఆ సినిమాల్లో ఆస్ట్రేలియాకు చెందిన స్టంట్ ఉమన్ నాడియా నటించారు. పోరాట సన్నివేశాల్లో ఆమె కనబరిచే సాహసాన్ని చూసి 'ఫియర్ లెస్ నాడియా' (Fearless Nadia)గానూ కీర్తించారు జనం. ఆమె నటించిన 'హంటర్ వాలి' (Hunterwali) ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది.
నాడియా విదేశీ వనిత అనుకుంటే 1960లో 'సూపర్ మేన్' (Superman) టైటిల్ తోనే ఓ ఫిమేల్ సూపర్ హీరో మూవీ వెలుగు చూసింది. ఈ సినిమాలో నిరూప రాయ్ (Nirupa Roy) ప్రధాన పాత్ర పోషించి మెప్పించారు. ఇందులో ఓ సైంటిస్ట్ అనాథ అయిన అమ్మాయిని దత్తత తీసుకొని, ఆమెకు సూపర్ పవర్స్ రావడానికి ఓ సీరమ్ ను ఇంజెక్ట్ చేస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి సంఘంలోని విద్రోహక శక్తులను ఎలా అణచివేసింది అన్నదే కథ. ఈ పాత్రను నిరూప రాయ్ అద్భుతంగా పోషించారు. అందులో ఆమె గెటప్ మాత్రం ఫియర్ లెస్ నాడియాను అనుసరించే రూపొందించారు.
తరువాతి రోజుల్లో నిరూప రాయ్ అనేక చిత్రాలలో తల్లి పాత్రలు పోషించి మెప్పించారు. హిందీ చిత్రాల్లో 'మా' అనగానే నిరూప రాయ్ గుర్తుకు వచ్చేలా నటించారామె. 1975లో అమితాబ్ బచ్చన్ కు నటునిగా మంచిపేరు సంపాదించి పెట్టిన 'దీవార్' (Deewar)లో నిరూప రాయ్ తల్లి పాత్రను పోషించారు. అందులో ఆమె తనయులుగా అమితాబ్, శశికపూర్ నటించారు. ఈ సినిమాలోని 'మేరే పాస్ మా హై...' అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. అలాగే 'దీవార్ - మా'గానూ నిరూప రాయ్ ఖ్యాతి గడించారు. ఏది ఏమైనా మన దేశంలో తొలి ఫిమేల్ సూపర్ హీరోగా నటించిన తొలి భారతీయనటిగా నిరూప రాయ్ చరిత్రలో నిలచిపోయారు.
Also Read: Lavanya: మెగా కోడలు.. కొత్త తమిళ మూవీ! పెళ్లికి ముందు చేస్తే.. ఇప్పుడు బయటకు వచ్చింది
Also Read: August Tollywood Report: షరా మామూలే...