Raj Kapoor Award: అనుపమ్ కీర్తి కిరీటంలో కలికితురాయి
ABN, Publish Date - Aug 06 , 2025 | 04:57 PM
సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ను మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్ కపూర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు.
ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) ను మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్ కపూర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు (Raj Kapoor Lifetime Achievement Award) తో మంగళవారం సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 5న రాష్ట్ర ప్రభుత్వం 60, 61వ ఫిలిమ్ అవార్డులను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis), ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ (Ajit Pawar), సాంస్కృతిక శాఖ మంత్రి ఆషిష్ షేలర్ అనుపమ్ ఖేర్ ను సత్కరించారు.
ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ముంబైతో తనకున్న అనుబంధాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్ కపూర్ (Raj Kapoor) నటుడిగా తనకు స్ఫూర్తి ప్రదాత అని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఈ నగరానికి తాను 1981 జూన్ 3వ తేదీ వచ్చానని, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో గోల్డ్ మెడల్ పొందినా తగిన అవకాశం ఇక్కడ తనకు దొరకలేదని అన్నారు. అప్పట్లో ఓ చిన్న గదిలో తాను ఉండేవాడినని... ఇవన్నీ నలభై యేళ్ళ నాటి ముచ్చట్లని చెప్పుకోచ్చారు. అయితే... ముంబై మహానగరం పెద్ద మనసుతో తనకు చోటు ఇచ్చిందని అన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి ఏదో ఒక ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ అవార్డును అందుకున్న అనంతరం అనుపమ్ ఖేర్ కొన్ని ఫోటోలను, ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విశేషం ఏమంటే... హిందీతో పాటు అనుపమ్ ఖేర్ ప్రస్తుతం పలు భారతీయ భాషా చిత్రాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలానే ఆయన దర్శకత్వం వహించిన 'తన్వీ: ద గ్రేట్' (Tanvi : The Great) మూవీ ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలను పొందింది.
Also Read: KVN Productions: పెద్ద ఫ్లానే ఇది..హోంబలే, మైత్రిలకు పోటీగా మరో నిర్మాణ సంస్థ
Also Read: Vijay Devarakonda: ఆ యాప్స్ లీగల్.. అందుకే ప్రమోట్ చేశా