Hindi Movie Tanvi The Great: తన్వీ ది గ్రేట్ మూవీ రివ్యూ.. అనుపమ్ ఖేర్ డైరెక్ట్ చేసిన మూవీ ఎలా ఉందంటే!
ABN , Publish Date - Jul 20 , 2025 | 07:52 PM
'ఓం జై జగదీశ్' తర్వాత అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన సినిమా 'తన్వీ ది గ్రేట్'. ఎన్.ఎఫ్.డి.సి. తో కలిసి అనుపమ్ ఖేర్ ఈ మూవీని నిర్మించారు. జూలై 18న 'తన్వీ ది గ్రేట్' సినిమా విడుదలైంది.
మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamirkhan) నటించి, నిర్మించిన 'సితారే జమీన్ పర్' (Sitaare zameen par) చిత్రం గత నెల 20న జనం ముందుకొచ్చింది. మానసిక దివ్యాంగులతో బాస్కెట్ బాల్ టీమ్ ను ఏర్పాటు చేసి వారిలోని అంతర్గత ప్రతిభను వెలికితీసే కోచ్ గా ఆమిర్ ఖాన్ అందులో నటించాడు. సరిగ్గా ఇది వచ్చిన నెల రోజులకే ఆటిజం నేపథ్యంలో అనుపమ్ ఖేర్ (Anupam Kher) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'తన్వీ ది గ్రేట్' (Tanvi The Great) మూవీ విడుదలైంది. ఓ పక్క నూతన తారలతో మోహిత్ సూరి దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన 'సయారా' చిత్రం బాక్సాఫీస్ బరిలో చెలరేగిపోతుంటే... అనుపమ్ ఖేర్ 'తన్వీ' థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి.
అనుపమ్ ఖేర్ చెల్లెలు ప్రియాంక పెద్ద కూతురు తన్వీ. ఆటిజం ఉన్న తన్వీకి సంగీతం, నటన అంటే ప్రాణం. ఎప్పటికైనా మ్యూజిక్ టీచర్, అలానే నటి అవ్వాలన్నది తన్వి డ్రీమ్. ఆమె జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని, 'తన్వి ది గ్రేట్' మూవీని అనుపమ్ ఖేర్ తెరకెక్కించారు. 2002లో 'ఓం జై జగదీశ్' (Om Jai Jagadish) తర్వాత అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన రెండో సినిమా ఇది. విడుదలకు ముందే ఈ సినిమా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. లండన్, న్యూయార్స్, హూస్టన్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
కథ గురించి చెప్పుకోవాలంటే...
బై బర్త్ ఆటిజమ్ తో సఫర్ అవుతుంటుంది తన్వీ (సుభాంగీ దత్ Shubhangi Dutt). ఆమె ఏడేళ్ళ వయసులో తండ్రి మేజర్ సమర్ రైనా (కరణ్ టక్కర్ Karan Tacker ) సియాచిన్ కు ప్రయాణం చేస్తూ, తీవ్రవాదులు పెట్టిన ల్యాండ్ మైన్ కు బలవుతాడు. సియాచిన్ లోని జాతీయ పతాకానికి సెల్యూట్ చేయాలన్నది అతని చిరకాల కోరిక. సింగిల్ మదర్ విద్య (పల్లవి జోషి Pallavi Joshi ) స్పెషల్ చైల్డ్ తన్వీని ఎలాంటి లోటు లేకుండా పెంచుతుంది. న్యూయార్క్ లో జరిగే వరల్డ్ ఆటిజమ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ కు ఆమె వెళుతూ, తన్వీని ఉత్తరాఖండ్ కంటోన్మెంట్ హిల్ టౌన్ లాన్స్ డౌన్ లో తన్వీని తాతయ్య కల్నల్ ప్రతాప్ రైనా (అనుపమ్ ఖేర్) దగ్గర దించుతుంది. సంగీతం అంటే ఇష్టమైన తన్వీని రజా సాబ్ (బొమన్ ఇరానీ Boman Irani ) వద్ద చేర్చుతారు. అయితే... తాతయ్య ఇంట్లో తన తండ్రి నివాసం ఉన్న గదిని, ఆయన పాత ఫోటోలను, వీడియోలను చూసిన తర్వాత తన్వీ మనసు మారిపోతుంది. తగిన శిక్షణ తీసుకుని ఆర్మీలో చేరాలనుకుంటుంది. ఆటిజమ్ ఉన్న వారిని సెన్యంలో తీసుకోరని తెలిసిన ప్రతాప్ రైనా అందుకు నిరాకరిస్తాడు. తన్వీ తండ్రితో పాటు మేయర్ గా పనిచేసిన శ్రీనివాసన్ (అరవింద్ స్వామి Aravind Swamy) ... ఆమె గతాన్ని తెలుసుకుని ఆర్మీ ఎంట్రన్స్ కై ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్థ పడతాడు. ఇంటి గడపను సైతం సరిగా దాటలేని తన్వీ.. ఆర్మీలో జాబ్ సంపాదించిందా? సియాచిన్ కు వెళ్ళాలనుకున్న తన కోరికను నెరవేర్చుకుందా? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే...
సహజంగా ఇలాంటి సినిమాల పతాక సన్నివేశాలు ఊహకు అందేవే! ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని, హీరో లేదా హీరోయిన్ తమ లక్ష్యాన్ని చేరడంతో ఇవి ముగుస్తాయి. ఇది అలాంటి కథే. కాకపోతే ఏ మేరకు ఈ కథను ఆసక్తికరంగా తెరకెక్కించారన్నదే ప్రధానం. ఆ విషయంలో అనుపమ్ ఖేర్ దర్శకుడిగా తన వంతు కృషి తాను బాగా చేశాడు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఎక్కడా గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. ఓ పక్క ఆటిజం ఉన్న వారు ఎదుర్కొనే ఇబ్బందులను చూపిస్తూనే, లక్ష్యం వైపు అడుగులు వేయడానికి వాళ్ళు ఎంతటి రిస్క్ చేస్తారో చూపించాడు. అయితే... క్లయిమాక్స్ అరగంటను కాస్తంత కుదించి ఉంటే మరింత బాగుండేది. ఏదేమైనా... నవతరానికి స్ఫూర్తినిచ్చే విధంగా అనుపమ్ ఖేర్ 'తన్వి ది గ్రేట్'ను రూపొందించారు. ప్రేమకథల సుడిగాలిలో యువత కొట్టుకుపోతున్న ఈ తరుణంలో ఇలాంటి చిత్రాలు గాలిలో పెట్టి దీపాల్లా అల్లల్లాడటం సహజం. తగిన ఆదరణ పొందనంత మాత్రాన వీటిని తక్కువ అంచనా వేయకూడదు.
నటీనటుల పెర్ఫార్మెన్స్...
నటీనటుల విషయానికి వస్తే... టైటిల్ రోల్ ప్లే చేసిన సుభాంగి దత్ కు ఇదే మొదటి సినిమా. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంది. అందువల్లే అనుపమ్ ఖేర్ మొదలు కొని ఎందరెందరో అనుభవజ్ఞులైన నటీనటుల మధ్య ఎలాంటి అదురు బెదురు లేకుండా తన పాత్రను చక్కగా పోషించింది. ఆమె తల్లిగా పల్లవి జోషి, తండ్రిగా కరన్ టక్కర్, తాతయ్యగా అనుపమ్ ఖేర్ నటించారు. ఇక బ్రిగేడియర్ జోషి గా జాకీ ష్రాఫ్ (Jachie Shroff), రజా సాబ్ గా బొమన్ ఇరానీ, మేయర్ శ్రీనివాసన్ గా అరవింద్ స్వామి చక్కని నటన కనబరిచారు. క్లయిమాక్స్ లో నాజర్ (Nasser) గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. నటీనటుల నటన ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి (MM Keeravani) స్వరపర్చిన బాణీలు, నేపథ్య సంగీతం మరో ఎత్తు. ఫోటోగ్రఫీతో పాటు క్లయిమాక్స్ లో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. నిర్మాణపరంగా ఎలాంటి వంకపెట్టడానికి లేదు. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో థియేటర్ల నుండి ప్రేక్షకులు బయటకు వస్తారు.
సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన పరిచయాలను మూవీ ప్రమోషన్ కోసం మరింతగా ఉపయోగించాల్సింది. అలానే ఎన్.ఎఫ్.డి.సి. నిర్మాణ భాగస్వామ్యంతో చేతులు దులుపుకోకుండా మూవీ ప్రమోషన్ బాధ్యతలను భుజానికి ఎత్తుకుని ఉంటే... 'తన్వీ ది గ్రేట్' మరింత ఆదరణ పొందేందుకు ఆస్కారముంది.
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్: డిఫరెంట్ బట్ నో లెస్!