Vishal: చెన్నై మేయర్‌పై విశాల్ సెటైర్లు.. ఘాటుగా స్పందించిన మేయర్

ABN , First Publish Date - 2023-12-05T17:46:55+05:30 IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను మిచౌంగ్ తుపాను ముంచెత్తుతోన్న విషయం తెలిసిందే. తుఫాను కారణంగా ఈ రాష్ట్రాలలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. తాజాగా హీరో విశాల్ చెన్నైలో జనజీవనం గురించి స్పందిస్తూ.. నగర మేయర్ ప్రియా రాజన్‌పై సెటర్లు వేశారు. మేయర్ కూడా విశాల్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం వారి పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vishal: చెన్నై మేయర్‌పై విశాల్ సెటైర్లు.. ఘాటుగా స్పందించిన మేయర్
Chennai Mayor Priya Rajan and Hero Vishal

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాలను మిచౌంగ్ తుపాను (Michaung Cyclone) ముంచెత్తుతోన్న విషయం తెలిసిందే. తుఫాను కారణంగా ఈ రాష్ట్రాలలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఇరు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. బాధిత ప్రజలు ఆహారం, నీటి కోసం అలమటిస్తున్నారు. ఎంతగా టెక్నాలజీ పెరిగినా.. ఇలాంటి విపత్తులు వచ్చిన సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.. అదే క్రమంలో పాలకులు విఫలం అవుతూనే ఉన్నారు. తాజాగా చెన్నై నగర మేయర్‌పై హీరో విశాల్ (Vishal) ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా కొన్ని సెటైర్లు పేల్చారు. 2015లో కురిసిన భారీ వర్షాలకు.. ప్రస్తుతం తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు.. అప్పటి, ఇప్పటి పరిస్థితులను పోలుస్తూ.. విశాల్ ఘాటుగా విమర్శలు చేశారు. 2015లో కురిసిన వర్షాల కారణంగా చెన్నై నగరం ఒక నెలపాటు స్తంభించిపోయింది. ఈ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. నగర పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదంటూ సూటిగానే మేయర్‌పై విశాల్ సెటైర్లు పేల్చారు.

‘డియర్ ప్రియా రాజన్ (Priya Rajan) (చెన్నై మేయర్), గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్, ఇతర అధికారులకు.. మీరుండే ప్రదేశంలో వరద నీరు లేదని అనుకుంటున్నా. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లల్లో హ్యపీగా, సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు కరెంట్, ఆహారం అందుతున్నాయనే అనుకుంటున్నాను. కానీ చెన్నై (Chennai) నగరంలో మీతో పాటు నివసిస్తున్న ఇతర ప్రజలు మాత్రం మీలా సురక్షితంగా లేరు. ఆకలితో అలమటిస్తున్నారు. మీరు చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రెయిన్ ప్రాజెక్ట్ సింగపూర్ కోసమా లేక చెన్నై కోసమా? 2015లో భారీ వర్షాల కారణంగా విపత్తు వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరం రోడ్ల మీదకు వచ్చి ప్రజలకు సాయం అందించాం. అది జరిగిన 8 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితిలో ఏం మార్పు లేదు. ఇప్పుడు కూడా బాధితులకు మేమంతా ఆహారం, నీటిని పంపిణీ చేసి ఆదుకుంటాం. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులంతా వారివారి నియోజకవర్గాల్లో బయటకు వచ్చి బాధితులకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. బాధిత ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. అలాంటి వారందరిలో ధైర్యం, విశ్వాసం నింపాలని కోరుకుంటున్నా’’ అంటూ విశాల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే విశాల్ పోస్ట్ చేసిన వీడియోకు నగర మేయర్ కూడా ఘాటుగా స్పందించారు. ప్రతీది రాజకీయంగా చూడకుండా.. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియజేయండి.. ప్రభుత్వం కచ్చితంగా అండగా నిలుస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.


ఇంకా ఆమె విశాల్ ట్వీట్‌కు సమాధానమిస్తూ.. ‘‘క్రమంగా విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. ఇప్పటి వరకు 6 లక్షల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశాం. వరదలు మీ ఇంటికి మాత్రమే రావు. దీంతో చెన్నై వాసులంతా ఇబ్బంది పడుతున్నారు. చెంబరంబాక్కం సరస్సును కూడా ఎలాంటి హెచ్చరికలు లేకుండా తెరిచారు. నేడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి‌గారు తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. చాలా చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాలిన చెట్లను తొలగించారు. మంత్రులు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేషన్ ఉద్యోగులు రంగంలోకి దిగి వారికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో రాజకీయాలు చేయాలని చూడకుండా.. మీకు ఏదైనా అభ్యర్థన ఉంటే దయచేసి నాకు తెలియజేయండి. ప్రభుత్వం నెరవేరుస్తుంది. మే 2021 నుంచి డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్షపు నీటి పారుదల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇలాంటి పనుల వల్లనే చెన్నైకి రక్షణ లభించింది. ఆ వాననీటి కాల్వల ద్వారానే గత వారం రోజుల వరకు కురిసిన వర్షపు నీరంతా బయటకు పోయింది. 2015లో తీవ్ర వరదల కారణంగా చెన్నై మరియు దాని పరిసర ప్రాంతాల్లో 289 మంది ప్రాణాలు కోల్పోయారు. 23.25 లక్షల ఇళ్లు నీట మునిగాయి. నేడు అలాంటి పరిస్థితి ఉందా? ముందు జాగ్రత్త చర్యగా 2015లో ప్రభుత్వ సెలవులు ప్రకటించలేదు. ఇప్పుడలా ఏం లేదు. ప్రతి ఒక్కరూ సహాయక చర్యలలో పాల్గొంటున్నారు..’’ అని మేయర్ ప్రియా రాజన్ బదులిచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Nithiin: ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం..

*************************************

*Neha Shetty: సుట్టంలా వచ్చి.. ఇష్టసఖిగా మారుతోంది

***************************************

*‘బై వన్‌ టికెట్.. గెట్‌ వన్‌ ఫ్రీ’.. నిర్మాత బంపరాఫర్

*****************************************

Updated Date - 2023-12-05T17:47:53+05:30 IST