Vijayakanth: ‘కెప్టెన్’ విజయకాంత్ గురించి ఆయన తోబుట్టువులు ఏం చెప్పారో తెలుసా?

ABN , Publish Date - Dec 31 , 2023 | 11:55 AM

డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు విజయకాంత్‌ తమను తండ్రిలా కంటికిరెప్పలా కాపాడినట్లు ఆయన సోదరులు సెల్వరాజ్‌, బాల్‌రాజ్‌ తెలిపారు. మదురైలో నివసిస్తున్న వీరిరువురు విజయకాంత్‌తో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Vijayakanth: ‘కెప్టెన్’ విజయకాంత్ గురించి ఆయన తోబుట్టువులు ఏం చెప్పారో తెలుసా?
Vijayakanth Family

డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు విజయకాంత్‌ (Vijayakanth) తమను తండ్రిలా కంటికిరెప్పలా కాపాడినట్లు ఆయన సోదరులు సెల్వరాజ్‌, బాల్‌రాజ్‌ తెలిపారు. మదురైలో నివసిస్తున్న వీరిరువురు విజయకాంత్‌తో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మదురైలో విజయకాంత్‌ కాలుమోపని స్థలం అంటూ ఏదీ లేదు. నిదురపోని ఆ నగరంలో విజయకాంత్‌ యుక్తవయస్సులో చురుకుగా ఉండేవారు. స్నేహితులతో కలిసి చలాకీగా తిరుగుతుండేవారు. మదురై మీనాక్షి సుందరేశ్వరర్‌, కళ్లలగర్‌, ఆండాళ్‌పై అపారమైన భక్తిని కలిగి ఉండేవారు. మీనాక్షి అమ్మవారిపై భక్తిని కలిగి ఉండటం వల్లే ఆయన మీనాక్షి కల్యాణం అనే సినిమాలో పరమశివుడి వేషంలో నటించారు. మదురై మేల్‌మాసి వీధిలో సౌరాష్ట్ర లేన్‌ ప్రాంతంలో ‘ఆండాళ్‌ భవనం’ అనే నివాసగృహంలో విజయకాంత్‌ కుటుంబీకులు నివసిస్తుండేవారు. ఆయన కుటుంబం చాలా పెద్దది.

విజయకాంత్‌కు 10 మంది తోబుట్టువులు. వీరిలో విజయలక్ష్మి, తిరుమలాదేవి, చిత్రా, మీనాకుమారి, శాంతి సోదరీమణులు. ఇక విజయకాంత్‌కు అన్న నాగరాజ్‌, తమ్ముళ్లు సెల్వరాజ్‌, బాల్‌రాజ్‌, రామ్‌రాజ్‌, పృథ్వీరాజ్‌ ఉన్నారు. ప్రస్తుతం మేల్‌మాసి వీధి నివాసగృహంలో విజయకాంత్‌ తమ్ముడు సెల్వరాజ్‌ కుటుంబ సమేతంగా కాపురం చేస్తున్నారు. తన అన్నయ్య విజయకాంత్‌ గురించి ఆయన పాత సంగతులను గుర్తు చేసుకుంటూ మదురై అంటే కెప్టెన్‌కు చాలా ఇష్టమని ప్రస్తుతం ఆ నగరంలో తాను, తన సోదరుడు బాల్‌రాజ్‌ మాత్రమే ఉన్నామని, తక్కిన తోబుట్టువులు హోసూరు, తేని తదితర ప్రాంతాల్లో ఉన్నారని తెలిపారు. విజయకాంత్‌ చాలా మంచి వ్యక్తి అని, అందరితోనూ ఆప్యాయంగా మసలుకునేవారని చెప్పారు. తమ ఉమ్మడి కుటుంబంలో ఏ నిర్ణయమైనా తమ తండ్రి, విజయకాంత్‌ మాత్రమే తీసుకునేవారని తెలిపారు. తొలిసారిగా విరుదాచలం శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ముందు తమ ఇంటికి వచ్చి నామినేషన్‌కు కుటుంబీకుల శుభాకాంక్షలందుకుని వెళ్లారని వివరించారు. తండ్రిలా తమను కంటికి రెప్పలా కాపాడిన విజయరాజ్‌ మృతి తమకు తీరని లోటు అని అన్నారు.


Vijayakanth-2.jpg

మదురై ఒత్తకడై ప్రాంతానికి చెందిన విజయకాంత్‌ మరో సోదరుడు బాల్‌రాజ్‌ మాట్లాడుతూ అన్నయ్య మృతి కుటుంబీకులకే కాకుండా రాష్ట్రానికే తీరనిలోటు అని చెప్పారు. సినీ, రాజకీయ రంగాలలో తనదైన చెరగని ముద్ర వేశారని, ఎంత ఎత్తుకు ఎదిగినా తమ సుఖదుఃఖాలలో పాలుపంచుకునేవారని, ఏ కష్టమొచ్చినా అండగా నిలిచారని తెలిపారు. మదురైలోని సోదరుల ఇంటికి తేని నుంచి వచ్చిన విజయకాంత్‌ సోదరి చిత్రా మాట్లాడుతూ తన సోదరుడు చాలా కష్టపడి సినీ రంగ ప్రవేశం చేశారని, ఎన్నో అవమానాలు ఎదురైనా పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని సాధించారని చెప్పారు. తామెక్కడికి వెళ్ళినా విజయకాంత్‌ తోబుట్టువులని సగర్వంగా చెప్పుకునేవారమని, మదురై వాసులంతా తమను ఆప్యాయంగా చూసుకునేవారని చెప్పారు. చెన్నైలోని విజయకాంత్‌ ఇంటికి వెళ్ళితే సంతోషంగా పలకరించి కలిసి భోజనం చేసేవారమని, ప్రస్తుతం కుటుంబ పెద్ద (విజయకాంత్‌)ను కోల్పోయి అనాథలుగా మిగిలామని ఆమె బోరున విలపించారు.


ఇవి కూడా చదవండి:

====================

*NBK109: ‘యానిమల్’ స్టార్‌ని బాలయ్య మూవీ సెట్స్‌లోకి ఆహ్వానించిన ఊర్వశి..

********************************

*Hi Nanna in OTT: ‘హాయ్ నాన్న’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

**************************

*Nagababu: కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి

**************************

*Rashmika Mandanna: ఎలా, ఎప్పుడు, ఎందుకు.. ఇదంతా జరిగింది? రష్మిక పోస్ట్ వైరల్

****************************

Updated Date - Dec 31 , 2023 | 11:55 AM