Allu Aravind: ఈ బయోపిక్ తీయడానికి అమ్మే.. మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది
ABN, Publish Date - Sep 17 , 2026 | 08:47 AM
జనాలకి ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారి సంగీత జీవితమే తెలుసు. ఆమె జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, ఇబ్బందులు గురించి ఎవరికీ తెలీదు.
"జనాలకి ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారి (MS Subbalakshmi) సంగీత జీవితమే తెలుసు. ఆమె జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, ఇబ్బందులు గురించి ఎవరికీ తెలీదు. ఎం.ఎస్.అమ్మ జీవితం కీలక విషయాలను సంపూర్ణంగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం" అని అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు, భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ వెండితెరపై ఆవిష్కృతం కానుంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను తెరకెక్కించనున్నారు. ఇందులో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ‘ఎంఎస్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
అల్లు అరవింద్ మాట్లాడుతూ "ఎమ్‌ఎస్ అమ్మ సినిమా ప్రారంభానికి ముందు ఆడిటోరియమ్ ముందు అలా నడుస్తూ ఉంటే అమ్మ ఫొటో ఒకటి చూసి భావోద్వేగానికి గురయ్యాను. ఆ పెద్ద ఫొటో చూశాక.. నాతో నేనే చెప్పుకున్నాను.. అమ్మ మీ బయోపిక్ తీయడం మాకు సాధ్యపడే విషయం కాదు.. మేం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు.. మీరే మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ఈ ఆలోచన వచ్చేలా చేశారు. రష్మిక కూడా అమ్మ సెలక్షనే’ అని అనుకున్నాను. ఎంఎస్ అమ్మ ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగించారో చాలామందికి తెలియదు. ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన, భావోద్వేగభరితమైన సంఘటనలు ఉన్నాయి. అలాంటి విషయాలను ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నమే ఈ సినిమా. అమ్మ పాడిన పాటలను యథాతథంగా రీక్రియేట్ చేసే సాహసం మేం చేయడం లేదు. ఆమె జీవితం, ప్రయాణం, సంగీతానికి చేసిన సేవను ప్రధానంగా తీసుకుని ఒక గొప్ప బయోపిక్‌ను రూపొందిస్తున్నాం. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఈ కథ పై దర్శకుడు ఎంతో రీ సెర్చ్ చేసారు. ఆమెకు సంబంధించిన ఎన్నో ప్రాంతాలు తిరిగి వివరాలు సేకరించారు. ఎంఎస్ అమ్మ వ్యక్తిగత జీవితం, సంగీత ప్రయాణం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లను తెరపై ఎంత అందంగా ఆవిష్కరించగలమనే దానిపై మేం ప్రత్యేక దృష్టి పెట్టాం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మాకు ఎంతో ప్రత్యేకమైన విషయం’’ అని తెలిపారు.
ALSO READ:
నేడు.. అద్దంకి పోలీస్ స్టేషన్‌కు యూట్యూబర్ నందన
iBomma Ravi: ఆర్థిక ఇబ్బందులున్నాయ్.. రూ.3 కోట్లు ఇప్పించండి