నేడు.. అద్దంకి పోలీస్ స్టేషన్‌కు యూట్యూబర్ నందన
ABN , Publish Date - Sep 17 , 2026 | 10:38 AM
యూట్యూబర్ రమానందన ఈరోజు అద్దంకి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు.
యూట్యూబర్ రమానందన (YouTuber Nandana) ఈరోజు అద్దంకి (Addanki) పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు. అద్దంకి మండలం పేరాయిపాలెంకి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూట్యూబర్ రమానందన (ramanandana), ఆమె భర్త మధుకర్ తో పాటు మరో ముగ్గురిపై అద్దంకి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన కుమారుడు ఉప్పలపాటి నవీన్‌కి లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని 10.50 లక్షలు నగదు తీసుకుని మోసం చేశారని జూలై 4న శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అద్దంకి పోలీసులు రమానందనకి నోటీసులు జారీ చేశారు. 17న విచారణకు హాజరుకావాలని ఇటీవల రమానందనకి విజయవాడలో నోటీసులు అందించారు. నోటీసులు అందుకున్న రమానందన ఈరోజు సాయంత్రం అద్దంకి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఉద్యోగాల పేరుతో మోసం చేశారని ఇబ్రహీంపట్నంకి చెందిన శివ క్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమానందనని ఇప్పటికే విజయవాడ పోలీసులు విచారించారు. అద్దంకిలో నమోదైన కేసులో యూట్యూబర్‌ని పోలీసులు మరోసారి విచారించనున్నారు. ఉద్యోగాల విషయంలో తనకేం సంబంధం లేదని అంతా తన భర్త మధుకర్ (Madhukar) కు మాత్రమే తెలుసునని పోలీసుల విచారణలో చెబుతున్న రమానందన.. అద్దంకి పోలీసుల ప్రశ్నలకు ఏ సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.