iBomma Ravi: ఆర్థిక ఇబ్బందులున్నాయ్.. రూ.3 కోట్లు ఇప్పించండి

ABN , Publish Date - Sep 17 , 2026 | 09:42 AM

ఐ బొమ్మ, బప్పం టీవీ పేరుతో పైరసీ సామ్రాజ్యం నడిపి అరెస్ట్ అయిన ఇమ్మడి రవి వ్యవహారంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.

iBOMMA

ఐ బొమ్మ (i BOMMA), బప్పం టీవీ (Bappam Tv) పేరుతో పైరసీ సామ్రాజ్యం నడిపి అరెస్ట్ అయిన ఇమ్మడి రవి (Immadi Ravi) వ్యవహారంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, తన రూ.3 కోట్లను తిరిగి ఇప్పించాలని కోరుతూ అతడు నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. సినిమా పైరసీకి పాల్పడుతూ పరిశ్రమకు రూ. వేలకోట్ల నష్టాన్ని కలిగించడమే కాకుండా, బెట్టింగ్ యాప్‌ల‌ను ప్రచారం చేసి రూ. కోట్లు సంపాదించాడన్న ఆరోపణలపై.. ఇమ్మడి రవిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గతేడాది నవంబర్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

విదేశాలకు వెళ్లాద్దని, పోలీసుల అనుమతి లేకుండా ఇంటర్నెట్ వినియోగించొద్దనే షరతులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడికి బెయిల్ లభించింది. అయితే, అరెస్టు సమయంలో పోలీసులు తన ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్లు తిరిగి అన్ ఫ్రీజ్ చేయించాలని కోరుతూ నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఇమ్మడి రవి పిటిషన్ దాఖలు చేశాడు.

ఇదిలాఉంటే.. అరెస్ట్ అయిన‌నప్పటి నుంచి తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందని తెలిపాడు. ఉన్నత చదువుల కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవి.. ఆపై ఇంటర్నెట్ వేదికగా పైరసీ సినిమాలు ప్రసారం చేస్తూ కోట్లు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. చాలా కాలం పాటు విదేశాల్లో విలాస జీవితం గడిపిన అతడు.. మొత్తం 10 దేశాలకు తన నెట్వర్క్ ను విస్తరింపజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Updated Date - Sep 17 , 2026 | 10:14 AM