కాంత.. ఆ కొరతని తీరుస్తుందా
ABN , Publish Date - Oct 16 , 2026 | 09:26 PM
కామెడీగా అయినా సీరియస్ గా అయినా.. పాత సినిమాలను గమనిస్తే ప్రతి సినిమాలో ఒక లేడీ విలన్ ఉండేది. ఉన్నాకొద్ది లేడీ విలన్స్ మచ్చుకు కూడా కనిపించడం లేదు.
కామెడీగా అయినా సీరియస్ గా అయినా.. పాత సినిమాలను గమనిస్తే ప్రతి సినిమాలో ఒక లేడీ విలన్ ఉండేది. ఉన్నాకొద్ది లేడీ విలన్స్ మచ్చుకు కూడా కనిపించడం లేదు. అప్పుడెప్పుడో వీరసింహారెడ్డిలో వరలక్ష్మీ విలనిజాన్ని చూసి.. అమ్మాయిని బాగా వాడితే మంచి లేడీ విలన్ అవుతుంది అనుకున్నారు. కానీ, ఆ తరువాత ఈ అమ్మడు పెళ్లి చేసుకొని లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పరిమితమయ్యింది. ఆ తరువాత అంతా విలనిజాన్ని పండించే హీరోయిన్ రాలేదు. ఇక ఇప్పుడు జైలర్ 2 లో కాంతని చూశాక మళ్లీ ఇండస్ట్రీలో లేడీ విలన్స్ గురించి చర్చ మొదలయ్యింది.
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే కాంత అదేనండీ విద్యాబాలన్ వచ్చాక వచ్చే హైప్ మరొక ఎత్తు. ఎస్.జె. సూర్య చెల్లిగా, అస్తమానం సిగరెట్ తాగుతూ, రజనీకాంత్ మొహం మీద పొగ ఊదే సీన్లో ఆమె చూపించిన అహంభావం, నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆమె కట్టు, బొట్టు పద్దతిగా ఉన్నా కూడా.. రజనీ కుటుంబాన్ని హింసించేటప్పుడు ఆమెలో ఉన్న ఆ విలనిజాన్ని చూసి ఫ్యాన్స్ ఫిధా అయ్యారు. జైలర్ 3 కి లీడ్ కూడా విద్యా బాలన్ పాత్ర ద్వారానే ఇవ్వడం సినిమాలోని మరో బిగ్గెస్ట్ ట్విస్ట్. నెల్సన్ కనుక మూడో భాగాన్ని తెరకెక్కిస్తే, ఆ కథ పూర్తిగా విద్యా బాలన్ చుట్టే తిరిగే అవకాశం ఉంది. ఈ సక్సెస్ ఆమెకు టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్కు గట్టి పునాది వేసిందనే చెప్పాలి.
ఇక ఇప్పుడు అంతా కాంత గురించే మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన విద్యాబాలన్ తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తరువాత ఆమె మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఇక ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్స్ ఒకసారి ఆమె వైపు చూసేలా కాంత పాత్ర చేసింది అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలే ఇంకో స్టార్ హీరో సినిమాల్లో విలన్స్ గా చేస్తున్నారు. అలానే విద్యాబాలన్ లోని విలనిజాన్ని కూడా వాడితే కచ్చితంగా సినిమా విజయానికి ఆమె నటన కూడా తోడవుతుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మన టాలీవుడ్ దర్శకులు కూడా ఇలాంటి బలమైన లేడీ విలన్ పాత్రలపై దృష్టి పెడితే.. లేడీ విలన్ కొరత తీరినట్టే అని చెప్పొచ్చు