డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ వేధింపులపై విష్ణు మంచు కీలక నిర్ణయం
ABN, Publish Date - Oct 05 , 2026 | 06:47 PM
సినీ పరిశ్రమలో ఇటీవల కలకలం రేపిన ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ వీడియోల వ్యవహారంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలిపారు.
సినీ పరిశ్రమలో ఇటీవల కలకలం రేపిన ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ వీడియోల వ్యవహారంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు (Maa President Vishnu Manchu) సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘చుట్టమల్లె’ సాంగ్‌ను ఏఐతో మార్ఫింగ్ చేసి.. దుర్వినియోగం చేసిన ఘటనను కేవలం ఒక సంఘటనగా చూడకూడదని, అదుపులేని డిజిటల్ దుర్వినియోగం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలకు ఇది ఒక హెచ్చరిక అని అన్నారు.
హీరో రామ్ పోతినేని చేసిన ట్వీట్.. ‘వాళ్లకు ముఖాలు లేవు.. అందుకే భయం లేదు’ అనే వ్యాఖ్యను ప్రస్తావించిన విష్ణు మంచు.. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తుల గుర్తింపులకు ఆధార్ అనుసంధానంతో జవాబుదారీతనం తీసుకురావాలనే ప్రతిపాదనను పరిగణించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిందేనని, అయితే వ్యక్తి కనిపించకుండా, ఏదో ఒక పేరుతో ఇతరులను వేధించడం, వారి పరువు తీయడం, అసభ్యకరంగా దాడి చేయడం.. లేదంటే ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని సహించకూడదని స్పష్టం చేశారు.
డీప్‌ఫేక్‌లకే పరిమితం కాకుండా సినిమాలు, నటీనటులు, దర్శకులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వ్యవస్థీకృత ప్రతికూల ప్రచారంపైనా విష్ణు మంచు ఆందోళన వ్యక్తం చేశారు. విమర్శలు, సమీక్షలు, ట్రోలింగ్, భిన్నాభిప్రాయాలు సినీ ప్రపంచంలో సహజమేనని, అయితే ప్రేక్షకులు సినిమా చూసే వరకు వెయిట్ చేయకుండానే.. ఆ సినిమాను దెబ్బతీసేలా పనిగట్టుకుని మరి నెగెటివ్ ప్రచారం చేయడాన్ని మాత్రం అంగీకరించలేమని అన్నారు. సందీప్ కిషన్ తనపై, తన సినిమాపై జరుగుతున్న లక్ష్యిత ప్రతికూల ప్రచారం గురించి చేసిన వ్యాఖ్యలను, అలాగే ‘ద ప్యారడైజ్’ సినిమా విడుదలకు ముందు పరువు నష్టం కలిగించే కంటెంట్ నుంచి రక్షణ కోరుతూ నాని కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ప్రతి సినిమా వెనుక ఎన్నో ఏళ్ల కష్టం, వందలాది కుటుంబాల జీవితం, భారీగా డబ్బు పెట్టుబడి పెట్టే నిర్మాతలు ఉంటారని విష్ణు మంచు పేర్కొన్నారు. సినిమాపై అభిప్రాయం ఏర్పరుచుకునే ముందు ప్రతి ఒక్కరూ దాన్ని చూడాలని.. సినిమా నచ్చినా, నచ్చకపోయినా, విమర్శించినా ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని అన్నారు. అయితే ముందుగా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేస్తూ ‘ముందుగా సినిమాను విడుదల కానివ్వండి’ అని పిలుపునిచ్చారు.
ఇండస్ట్రీలోనే అభిమాన సంఘాలు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకోవడం, తటస్థంగా ఉన్నట్లు చెప్పుకునే అనామక సామాజిక మాధ్యమ ఖాతాలు, నటీనటుల ఫొటోలను ప్రొఫైల్ చిత్రాలుగా ఉపయోగించుకుని వారు సమర్థించని చర్యలకు పాల్పడుతున్న ఖాతాలపైనా విష్ణు మంచు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించిన ఆయన, ఒక తెలుగు సినిమా విఫలమైతే మరో సినిమా విజయవంతం కాదని అన్నారు. ‘అందరికీ సరిపడేంత పెద్ద కేక్ ఉంది.. ప్రతి ఒక్కరికీ అందులో ఒక ముక్క దక్కుతుంది’ అని తనదైన తరహాలో ఆయన కౌంటర్ ఇచ్చారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. పదేపదే లక్ష్యిత వేధింపులు, దుష్ప్రచారాలకు పాల్పడుతున్న సామాజిక మాధ్యమ ఖాతాలు, వాటి వెనుక ఉన్న నెట్‌వర్క్‌లకు సంబంధించిన సమాచారాన్ని సంఘం సేకరిస్తోందని విష్ణు మంచు వెల్లడించారు. విమర్శలను అణచివేయడం తమ ఉద్దేశం కాదని, తప్పులకు జవాబుదారీతనం తీసుకురావడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తాజా డీప్‌ఫేక్ వివాదం వంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు, ఆన్‌లైన్ దుర్వినియోగంపై బాధ్యతను నిర్ధారించేందుకు పరిశ్రమవ్యాప్తంగా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అత్యవసర అవసరాన్ని మరోసారి స్పష్టం చేసిందని విష్ణు మంచు అన్నారు.
ఇవి కూడా చదవండి:
అలాంటి కొటేషన్స్ వేసి.. ఇలా తగ్గావ్ ఏంటి బండ్లన్నా?
నర్తకిగా పూజిత పొన్నాడ.. ఫస్ట్ లుక్ అదిరింది
నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్