వీఎఫ్ఎక్స్ కోరల్లో ఆ మూడు చిత్రాలు!
ABN , Publish Date - Sep 05 , 2026 | 04:25 PM
రిలీజవుతున్న మూవీస్‌లో 'విజువల్ ఎఫెక్ట్స్' లేకుండా వస్తోన్న సినిమాలు తక్కువనే చెప్పాలి. కొన్ని సినిమాలు వీఎఫ్ఎక్స్ మీదే ఆధారపడి తెరకెక్కుతున్నాయి. అలా రూపొందిన 'విశ్వంభర, వృషకర్మ, స్వయంభూ' చిత్రాలు పూర్తయినా ఎప్పుడు రిలీజవుతాయో తెలియని పరిస్థితి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన 'విశ్వంభర' చిత్రం అదుగో ఇదుగో అంటూనే సాగుతోంది. నాగచైతన్య హీరోగా కార్తిక్ వర్మ దండు నిర్దేశకత్వంలో శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర నిర్మించిన 'వృషకర్మ' తీరూ అలాగే ఉంది. ఇక నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 'స్వయంభు' పరిస్థితి కూడా అదే. ఇలా ఈ మూడు చిత్రాలు ఆలస్యం కావడానికి 'విజువల్ ఎఫెక్ట్స్' రూపకల్పనలో జాప్యం జరగడమే అని తెలుస్తోంది. అయితే ఈ మూడు సినిమాల షూటింగ్స్ పూర్తయి చాలా రోజులయింది. కేవలం వీఎఫ్ఎక్స్ కారణంగానే ఎప్పుడు విడుదలవుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు చెబుతున్నారు. చిరంజీవి 'విశ్వంభర' చిత్రం గత యేడాది సంక్రాంతికే విడుదల కావలసి ఉంది. అప్పట్లో 'గేమ్ చేంజర్'కు దారి ఇస్తూ తాము సంక్రాంతి బరి నుండి తప్పుకుంటున్నామని మేకర్స్ ప్రకటించారు. ఆ తరువాత విజువల్ ఎఫెక్ట్స్ సరిగా రాలేదని, మళ్ళీ రూపొందిస్తున్నారని వినిపించింది. ఆ కారణంగానే 'విశ్వంభర' విడుదలలో మరింత జాప్యం జరిగింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని ఏ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు నిర్మాతలు.
ఒకప్పుడు మన తెలుగు సినిమా మేకింగ్ లో 'కంప్యూటర్ జెనరేటెడ్ ఇమేజ్' ఉపయోగిస్తేనే గొప్పగా చెప్పుకొనేవారు. అలాంటి ఎన్నో సీజీఐస్ ను ఉపయోగిస్తూ షూటింగ్ లో వాడిన వైర్స్ ను, మ్యాట్స్ ను చెరిపేస్తూ విజువల్ ఎఫెక్ట్స్ రూపొందుతాయి. అంతేకాదు మనకు కావలసిన అత్యంత భారీ నిర్మాణాలను, అందమైన ప్రదేశాలను, వింత వింత జీవులను రూపొందించడం కూడా విజువల్ ఎఫెక్ట్స్ తో సాధ్యమవుతుంది. అలా వీఎఫ్ఎక్స్ తో వండర్స్ క్రియేట్ చేస్తూ జనాన్ని ఆకట్టుకోవడానికి మేకర్స్ తపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీఎఫ్ఎక్స్ పై భారీగా ఆధారపడుతున్నారు. తాము కోరుకున్న తీరున తెరపై ఎఫెక్ట్స్ కనిపించక పోతే, నిర్మాణంలో మరింత ఆలస్యం చోటు చేసుకుంటోంది.
చిరంజీవి పాలిటిక్స్ నుండి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చాక హిట్స్- ఫట్స్ తో సాగుతున్నారు. 'ఖైదీ నంబర్ 150' తరువాత "సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్" వంటి ఫ్లాప్స్ పలకరించాయి. 'వాల్తేరు వీరయ్య' ఘనవిజయం తరువాత 'భోళా శంకర్' ఫట్టుమంది. ఈ యేడాది 'మన శంకరవరప్రసాద్ గారు'తో బంపర్ హిట్ పట్టేశారు. మరి రాబోయే 'విశ్వంభర' ఏమవుతుందో అన్న అనుమానం ఉంది. 'విశ్వంభర' వస్తే ఈ యేడాది రావాలి. జనవరిలో ఇప్పటికే చిరు 'కాకా' రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఇక నిఖిల్ 'కార్తికేయ-2' హిట్ తరువాత మూడు ఫ్లాప్స్ చూశారు. రాబోయే 'స్వయంభు' ఇప్పటికే ఆలస్యం కావడంతో ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్న డైలమాలో ఉన్నారు మేకర్స్. 'తండేల్' వంటి బంపర్ హిట్ తరువాత నాగచైతన్య నటించిన చిత్రం 'వృషకర్మ'. ఈ మూవీకి కూడా మొదట్లో ఎంతో క్రేజ్ ఉండేది. అయితే వీఎఫ్ఎక్స్ కారణంగా జాప్యం జరిగింది. దాంతో మునుపటి క్రేజ్ తరిగింది. ఇలా ఈ మూడు చిత్రాలు వీఎఫ్ఎక్స్ కారణంగా మొదట్లో వచ్చిన బజ్ ను కోల్పోయాయి. ఒకవేళ రిలీజ్ అయిన తరువాత కంటెంట్ కారణంగా కలెక్షన్స్ కొల్లగొడతాయేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
కృష్ణాష్టమి.. డ్యాన్స్ టాలెంట్ చూపించిన అనుసూయ
'ఇరుముడి'కి జనాల జాతర.. ట్రాక్టర్లతో గుంపులు గుంపులుగా థియేటర్లకు
మెగా ఫ్యాన్స్‌కు పండగ వార్త.. చిరంజీవి సినిమాపై వెంకీ అట్లూరి హింట్!