మెగా ఫ్యాన్స్‌కు పండగ వార్త.. చిరంజీవి సినిమాపై వెంకీ అట్లూరి హింట్!

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:26 PM

మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక ప్రభంజనం. ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా, సమీకరణాలు మారినా.. బాక్సాఫీస్ రూలర్ నేనే అని ప్రతిసారీ ఆయన నిరూపించుకుంటూనే ఉన్నారు.

Chiranjeevi

బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అంటేనే ఒక ప్రభంజనం. ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా, సమీకరణాలు మారినా.. బాక్సాఫీస్ రూలర్ నేనే అని ప్రతిసారీ ఆయన నిరూపించుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టి తన స్టామినాను మరోసారి చాటి చెప్పారు. ఇదే ఊపుతో మెగాస్టార్ తన తదుపరి సినిమాలను వేగంగా ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కొల్లు దర్శకత్వంలో 'కాకా' సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సూపర్ హిట్ కావడంతో 'కాకా'పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. అనస్వర రాజన్, నివేత పేతురాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

అయితే, 'కాకా' తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ లైనప్‌లోకి మరో యంగ్ డైరెక్టర్ చేరారు. 'సార్', 'లక్కీ భాస్కర్', 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న వెంకీ అట్లూరి (Venky Atluri) తో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉండబోతోందని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఈ క్రేజీ రూమర్‌పై తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. చిరంజీవిగారితో సినిమా చేయడం తన కల అని, అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ముఖ్యంగా ఈ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడానికి సమయం కావాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా మెగా అభిమానులకు వెంకీ ఒక పెద్ద హామీ ఇచ్చారు. 'ఈ సినిమా నా మార్క్ క్లాస్ మూవీలా కాకుండా.. పూర్తిస్థాయి మెగాస్టార్ మాస్ సినిమాలా ఉంటుంది' అని చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రస్తుతం వెంకీ అట్లూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'లక్కీ భాస్కర్-2' పనుల్లో బిజీగా ఉన్నారు. అటు చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల కాంబో పూర్తయ్యాకే, చిరు - వెంకీ అట్లూరి క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్.. మెగాస్టార్ చిరంజీవితో చేతులు కలిపితే థియేటర్లలో రికార్డులు తిరగరాయడం ఖాయమని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబో ఎప్పుడు తెరపైకి వస్తుందో వేచి చూడాలి.

Updated Date - Sep 04 , 2026 | 11:40 PM