వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్‌లో నో ఛేంజ్
ABN, Publish Date - Sep 11 , 2026 | 05:37 PM
విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ మూవీ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది.
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (AK47)’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ హైప్ పెంచారు. విక్టరీ వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రతో పాటు శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలు ఈ ఆత్మీయ కుటుంబ కథకు ప్రాణంగా నిలవనున్నాయి. అయితే, గత కొద్ది రోజులుగా ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం లేదని, అక్టోబర్ 2 నుంచి వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. తాజా అప్‌డేట్‌తో మేకర్స్ ఆ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
ఈ సినిమా టీజర్‌ను శనివారం (సెప్టెంబర్ 12) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక స్టైలిష్ అండ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో విక్టరీ వెంకటేష్ కళ్లద్దాలతో సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన సిల్హౌట్ లోపల ఒక ఇంటి ముందు నుంచి గుంపుగా మనుషులు నడుచుకుంటూ వస్తున్నట్లు చూపించిన విజువల్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ పోస్టర్‌పై ‘2nd OCT IN CINEMAS’ అని మరోసారి స్పష్టంగా ప్రస్తావించారు. దీంతో సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న దసరా పండుగ బరిలో సినిమా రావడం పక్కా అని తేలిపోయింది.
ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, కెవిన్ కుమార్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ చమత్కారమైన సంభాషణలు, వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రేపు రాబోతున్న టీజర్‌తో ఈ ‘ఆదర్శ కుటుంబం’ ఎలాంటి సందడి సృష్టిస్తుందో చూడాలని అటు వెంకీ ఫ్యాన్స్, ఇటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
కొరటాల రిక్వెస్ట్.. బాలయ్య యాక్సెప్ట్.. ఇక దబిడి దిబిడే!
ట్రాక్ మీదకి కమల్, శంకర్‌ల ‘ఇండియన్ 3’
‘డీసీ’ బ్లాక్‌బస్టర్ హిట్.. మారన్ సార్ మళ్లీ మొదలెట్టారుగా!