కొరటాల రిక్వెస్ట్.. బాలయ్య యాక్సెప్ట్.. ఇక దబిడి దిబిడే!
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:16 PM
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘గాడ్ ఆఫ్ మాసెస్’గా తిరుగులేని రికార్డులను సృష్టిస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే సంచలన దర్శకుడు కొరటాల శివతో జతకట్టేందుకు సర్వం సిద్ధమైంది.
నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే క్రేజీ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘గాడ్ ఆఫ్ మాసెస్’గా తిరుగులేని రికార్డులను సృష్టిస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. త్వరలోనే సంచలన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)తో జతకట్టేందుకు సర్వం సిద్ధమైంది. వీరిద్దరి కలయికలో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK112’గా పట్టాలెక్కనుంది. తాజాగా ఫిలింనగర్ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు కొరటాల శివ పెట్టిన ఒకే ఒక్క రిక్వెస్ట్‌కు బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రాజెక్ట్ వేగం ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు ఏకధాటిగా ఏకంగా 110 రోజుల బల్క్ కాల్షీట్లు కావాలని కొరటాల కోరగా, స్క్రిప్ట్ విన్న ఉత్సాహంలో బాలకృష్ణ ఎలాంటి ఆలోచన లేకుండా తక్షణమే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో బలమైన సామాజిక అంశం, హృదయాలను హత్తుకునే బలమైన ఎమోషన్స్ ఉంటాయి. అయితే, ఈసారి బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ తన మార్క్‌కు మించి సరికొత్త పంథాను ఎంచుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బోయపాటి శ్రీను రేంజ్‌ను మించేలా హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను, దానికి తోడు కొరటాల స్టైల్ డెప్త్ ఉన్న ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్‌గా మేళవించి మైండ్ బ్లోయింగ్ బౌండ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. కథాకథనాలు, క్యారెక్టరైజేషన్ విషయంలో కొరటాల ఫుల్ క్లారిటీతో ఉండటం, బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో నటసింహం ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని, అందుకే మరో ఆలోచన లేకుండా డేట్స్ ఇచ్చేశారని టాక్ నడుస్తోంది.
అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ రెండో వారం నుంచే ఈ భారీ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక అత్యంత పవర్‌ఫుల్ అండ్ వైబ్రెంట్ టైటిల్‌ను కూడా మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవైపు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా లైన్‌లో ఉండగానే, మరోవైపు కొరటాల శివతో ఈ స్థాయి భారీ యాక్షన్ డ్రామా ఖరారు కావడం నందమూరి అభిమానుల్లో అంతులేని జోష్ నింపుతోంది. వెండితెరపై కొరటాల మేకింగ్.. బాలయ్య నట విశ్వరూపం తోడైతే బాక్సాఫీస్ వద్ద ‘దబిడి దిబిడే’ అంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టేశారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
ట్రాక్ మీదకి కమల్, శంకర్‌ల ‘ఇండియన్ 3’
‘డీసీ’ బ్లాక్‌బస్టర్ హిట్.. మారన్ సార్ మళ్లీ మొదలెట్టారుగా!
‘ది ప్యారడైజ్’ మాస్ అప్‌డేట్.. రిలీజ్‌పై ఇక నో డౌట్