ఉపేంద్ర సినిమా రీ-రిలీజ్!
ABN, Publish Date - Sep 08 , 2026 | 01:33 PM
ఉపేంద్ర తన పేరుతోనే తీసిన 'ఉపేంద్ర' సినిమా మరోసారి జనం ముందుకు రానుంది. ఈ నెల 18న ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తున్నారు.
'ఎ' సినిమాతో సగటు సినిమా ప్రేక్షకుడిని తనవైపు తిప్పుకున్న కన్నడ, నట దర్శకుడు ఉపేంద్ర... తన పేరుతోనే 1999లో తెరకెక్కించిన సినిమా 'ఉపేంద్ర'. ఈ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ లో రవీనా టాండన్, ప్రేమ, దామిని కీలక పాత్రలు పోషించారు. మూడు కాలాలను ఈ మూడు పాత్రలు రిప్రజెంట్ చేయడం విశేషం. కథ, మాటలు, పాటలు ఉపేంద్ర రాసిన ఈ సినిమాకు గురుకిరణ్ స్వరాలు అందించారు. ఉపేంద్ర అభిమానుల దృష్టిలో ఇదో కల్ట్ క్లాసిక్ మూవీ. 'ఉపేంద్ర' అనే ఈ పేరుకు మాత్రం దర్శకుడు వేరే అబ్రివేషన్ ఇచ్చారు. ఇందులో యు అంటే ఉపేంద్ర, పి అంటే ప్రేమ, డి అంటే దామిని, ఆర్.ఎ. అంటే రవీనా అని చెప్పుకొచ్చారు. 30వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ప్రదర్శితమైన ఈ సినిమా ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకుంది. అలానే నటుడు, దర్శకుడు ఉపేంద్ర ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు. దీనికి సీక్వెల్‌గా 'ఉప్పి 2' మూవీని 2015లో ఉపేంద్ర రూపొందించారు.
'ఉపేంద్ర' సినిమాను అప్పట్లో అంబికా కృష్ణ తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. కర్నాటకతో పాటు ఇక్కడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇరవై యేడు సంవత్సరాల తర్వాత ఇప్పుడీ సినిమా మరోసారి జనం ముందుకు రాబోతోంది. ఈ నెల 18న దీనిని తెలుగు వారి ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఇవి కూడా చదవండి:
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ గురుకుల విద్యార్థుల సందడి..
Priyanka Chopra: బిగ్‌బాస్ 20లో మేరీకోమ్ ఎంట్రీ.. కంటెస్టెంట్లకు ప్రియాంక చోప్రా సరదా వార్నింగ్!