Priyanka Chopra: బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్ ఎంట్రీ.. కంటెస్టెంట్లకు ప్రియాంక చోప్రా సరదా వార్నింగ్!

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:49 PM

ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దిగ్గజ క్రీడాకారిణి మేరీకోమ్ ఇప్పుడు బుల్లితెరపై తన కొత్త జర్నీని ప్రారంభించారు.

Priyanka chopra - Mary Kom

ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దిగ్గజ క్రీడాకారిణి మేరీకోమ్ ఇప్పుడు బుల్లితెరపై తన కొత్త జర్నీని ప్రారంభించారు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. హిందీ బిగ్‌బాస్ 20వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మేరీకోమ్ సుమారు 105 ఎపిసోడ్ల పాటు హౌస్‌లో ఉండనున్నారు. మేరీకోమ్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తిని పెంచగా.. ఆమెకు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మేరీకోమ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రియాంక ఓ వీడియో ద్వారా తన అభినందనలు తెలియజేశారు.

మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా 2014లో తెరకెక్కిన బయోపిక్‌లో ప్రియాంక చోప్రా టైటిల్ రోల్ పోషించారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రపంచ స్థాయి బాక్సర్‌గా ఎదిగిన మేరీకోమ్ జీవితంలోని పోరాటాన్ని ఆ సినిమాలో చూపించారు. ఈ పాత్ర కోసం ప్రియాంక ఎంతో శ్రమించారు. బాక్సింగ్‌కు సంబంధించిన శిక్షణ తీసుకోవడంతో పాటు.. మేరీకోమ్ బాడీ లాంగ్వేజ్, పెర్సనాలిటీ, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు  తెరపై ప్రతిబింబించేలా ఆమె  సిద్ధమయ్యారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మేరీకోమ్’ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం’గా అవార్డు దక్కింది. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా మంచి స్నేహంగా మారింది. ఇప్పుడు మేరీకోమ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడంతో ప్రియాంక మరోసారి తన స్నేహితురాలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'మేరీకోమ్ మన దేశానికి గర్వకారణం. బిగ్‌బాస్ 20లో ఆమె ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. అయితే హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లు ఆమె పంచ్‌ల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది' అంటూ ప్రియాంక సరదాగా హెచ్చరించారు. ప్రియాంక చేసిన ఈ కామెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మేరీకోమ్ బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులను ఎదుర్కొనే తీరును గుర్తుచేసుకుంటూ ఆమె సరదాగా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated Date - Sep 07 , 2026 | 02:50 PM